Tuesday, March 10, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంపోరాడి సాధించుకున్న చట్టాల రద్దుకు కేంద్రం యత్నం

పోరాడి సాధించుకున్న చట్టాల రద్దుకు కేంద్రం యత్నం

- Advertisement -

– గ్యాస్‌ ధరల పెంపుతో ప్రజలపై అదనపు భారం
– మే నెలలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర 4వ మహాసభ : సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి.నాగయ్య
– ఈ నెల 10 నుంచి 30 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధియాత్రలు : వ్యకాస రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట్రాములు
నవతెలంగాణ-సూర్యాపేట

అనేక పోరాటాల ద్వారా సాధించుకున్న చట్టాలను కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రద్దు చేసుకుంటూ పోతోందని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి.నాగయ్య అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకటనరసింహారెడ్డి భవన్‌లో సోమవారం వ్యకాస జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. పోరాటాల పురిటి గడ్డ మహబూబ్‌నగర్‌లో 2026 మే చివరివారంలో మూడ్రోజులపాటు వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభ జరగనుందని తెలిపారు. రాష్ట్ర మహాసభ ఆహ్వాన సంఘం సమావేశం ఈనెల 14న మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో నిర్వహించనున్నట్టు చెప్పారు. పెరిగిన ధరలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న పేదలపై వంటగ్యాస్‌పై రూ.60 పెంచడం వల్ల పేద, మధ్యతరగతి ప్రజలకు అదనపు భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకొచ్చి రెండేండ్లు పూర్తయినా ఇచ్చిన 6 గ్యారంటీలు నేటికీ అమలు కాలేదని విమర్శించారు. రైతాంగానికి రైతు భరోసా జమ చేయలేదన్నారు. ఖమ్మం జిల్లాలోని వెలుగుమట్లలో భూదాన్‌ భూముల్లో గుడిసెలేసుకొని నివాసం ఉంటున్న పేదలపై బుల్డోజర్ల ద్వారా దాడి చేసి 700 మందిని నిర్వాసితులను చేసిందన్నారు. ప్రభుత్వం తక్షణమే అర్హులైన వారందరికీ ఇంటి స్థలాల పట్టా ఇచ్చి ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

ఉపాధి హామీ చట్టాన్ని రక్షించుకునేందుకు ఊరూరా ఉద్యమం : వ్యకాస రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌. వెంకట్రాములు
అనేక పోరాటాల ద్వారా సాధించుకున్న గ్రామీణ ఉపాధిహామీ చట్టాన్ని రక్షించుకునేందుకు ఊరూరా ఉద్యమిస్తామని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌.వెంకట్రాములు అన్నారు. ఉపాధి కూలీల పొట్ట కొట్టే వీబీజీఆర్‌ఏఎం-జీ పథకాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. గ్రామీణ ఉపాధిహామీ చట్టాన్ని యథావిధిగా అమలు చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టంలో పనికి హామీ లేకపోవడంతోపాటు ప్రభుత్వాల దయాదాక్షిణ్యాలపై పేదలు ఆధారపడాల్సిన దుస్థితి నెలకొందన్నారు. పార్లమెంట్‌లో హడావిడిగా ఎందుకు బిల్లు తెచ్చారో దేశప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. తక్షణమే ప్రజా వ్యతిరేక బిల్లులను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ నెల 10 నుంచి 30 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధియాత్రలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ నెల 20 నుంచి 28 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఎంపీడీవో కార్యాలయాల ఎదుట ధర్నాలు, 30న కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు చేయనున్నట్టు తెలిపారు. వ్యకాస జిల్లా ఉపాధ్యక్షులు పులుసు సత్యం అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపల్లి సైదులు,ఉపాధ్యక్షులు పోసనబోయిన హుస్సేన్‌, సోమపంగు జానయ్య, గుంజ వెంకటేశ్వర్లు, షేక్‌పఠాన్‌ మహబూబ్‌ అలీ, నారసాని వెంకటేశ్వర్లు, జిల్లా కమిటీ సభ్యులు ఆరే రామకృష్ణారెడ్డి, దోసపాటి భిక్షం, అంజంపల్లి లక్ష్మయ్య, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -