Saturday, March 14, 2026
E-PAPER
Homeజాతీయంఅణగారిన వర్గాల విద్యార్థులపై కేంద్రం చిన్నచూపు

అణగారిన వర్గాల విద్యార్థులపై కేంద్రం చిన్నచూపు

- Advertisement -

పూర్తిగా ఖర్చు కాని స్కాలర్‌షిప్‌ నిధులు
లబ్దిదారుల సంఖ్యలోనూ గణనీయమైన తగ్గుదల
రాజ్యసభలో కేంద్రం సమాచారం
మోడీ సర్కారుపై సీపీఐ(ఎం) రాజ్యసభ సభ్యులు జాన్‌బ్రిట్టాస్‌ విమర్శలు

న్యూఢిల్లీ : దేశంలో అణగారిన విద్యార్థుల పట్ల కేంద్రం చిన్న చూపు చూస్తున్నది. వారి కోసం ఉద్దేశించిన స్కాలర్‌షిప్‌ నిధులు పూర్తిగా ఖర్చు కావటం లేదు. అంతేకాదు.. ఉపకార వేతనం పొందే విద్యార్థుల సంఖ్య కూడా గణనీయంగా పడిపోయింది. సాక్షాత్తూ కేంద్ర ప్రభుత్వ గణాంకాలు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి. అయితే ఈ గణాంకాలను సీపీఐ(ఎం) రాజ్యసభ సభ్యులు జాన్‌బ్రిట్టాస్‌ ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ చేస్తూ.. కేంద్రంలోని మోడీ సర్కారుపై విమర్శలు చేశారు. కేంద్రం వెల్లడించిన సమాచారం ప్రకారం… ఎస్సీ, ఓబీసీ, ఈబీసీ, డీఎన్‌టీ (డీనోటిఫైడ్‌ ట్రైబ్స్‌) వర్గాలకు చెందిన విద్యార్థుల కోసం కేంద్రం కేటాయించిన స్కాలర్‌షిప్‌ నిధుల్లో వేల కోట్లు పూర్తిస్థాయిలో వినియోగం కాలేదు. గత కొన్నేండ్లలో స్కాలర్‌షిప్‌ పొందుతున్న విద్యార్థుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గినట్టు సమాచారం. రాజ్యసభలో అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ సహాయ మంత్రి రామ్‌దాస్‌ అథవాలే వెల్లడించిన వివరాల్లో ఈ సమాచారం వెల్లడైంది.

ఈ గణాంకాల ఆధారంగా సీపీఐ(ఎం) రాజ్యసభ సభ్యులు జాన్‌ బ్రిట్టాస్‌.. ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఎస్సీ, ఓబీసీ, ఈబీసీ, డీఎన్‌టీ విద్యార్థుల స్కాలర్‌షిప్‌ల కోసం కేటాయించిన వేలాది కోట్ల రూపాయలు ఖర్చు కాకుండా నిలిచిపోయాయని ఎక్స్‌ పోస్ట్‌లో పేర్కొన్నారు. ఈ మేరకు ప్రభుత్వం వెల్లడించిన గణాంకాలను పొందుపర్చారు. ”2021-22లో రూ.6,220.62 కోట్లు కేటాయించగా.. రూ.4,446.24 కోట్లు మాత్రమే ఖర్చయ్యాయి. 2022-23లో రూ.8,165 కోట్లు కేటాయించగా రూ.6,372.38 కోట్లు మాత్రమే వెచ్చించారు. 2023-24లో రూ.8,874.14 కోట్లకు గానూ రూ.7,762.82 కోట్లు, 2024-25లో రూ.9,163.98 కోట్లకు గానూ రూ.8,008.79 కోట్లు ఖర్చు చేశారు” అని ఆయన పేర్కొన్నారు.

”అదేసమయంలో స్కాలర్‌షిప్‌ లబ్దిదారుల సంఖ్య కూడా పడిపోయింది. ఎస్సీ ప్రీమెట్రిక్‌ స్కాలర్‌షిప్‌ల సంఖ్య 2020-21లో 31.22 నుంచి 2024-25లో 21.65 లక్షలకు పడిపోయింది. ఎస్సీ పోస్ట్‌మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌ల సంఖ్య 50.16 లక్షల నుంచి 48.04 లక్షలకు తగ్గింది. ఓబీసీ, ఈబీసీ, డీఎన్‌టీ ప్రీ-మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌ల సంఖ్య 54.95 లక్షల నుంచి 20.61 లక్షలకు పడిపోయింది. అలాగే పోస్ట్‌మెట్రిక్‌ సంఖ్య 45.95 లక్షల నుంచి 24.53 లక్షలకు తగ్గింది. ఇక 2024-25 ఏడాదికి గానూ సామాజిక న్యాయ మరియు సాధికారత విభాగానికి బడ్జెట్‌ కేటాయింపులు రూ.14,164.42 కోట్లుగా ఉంటే ఖర్చు చేసింది రూ.8,679.02 కోట్లు మాత్రమే.

లక్షలాది మంది విద్యార్థులు స్కాలర్‌షిప్‌ జాబితా నుంచి అదృశ్యమవుతున్నారు. అణగారిణ వర్గాల ప్రజలకు ఇది కేవలం గణాంకాలు కావు.. కోల్పోయిన అవకాశాలు” అని తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. కాగా 2026-27 ఆర్థిక సంవత్సరం నుంచి పోస్ట్‌-మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌లకు అర్హత పొందే కుటుంబ వార్షిక ఆదాయ పరిమితిని రూ.2.5 లక్షల నుంచి రూ.4.5 లక్షలకు పెంచే యోచనలో ఉందని కూడా కేంద్రం వెల్లడించడం గమనార్హం. అలాగే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, డీఎన్‌టీ వర్గాల విద్యార్థుల కోసం అమలు చేస్తున్న స్కాలర్‌షిప్‌ పథకాలలో విస్తృత మార్పులు చేయాలని కేంద్రం పరిశీలిస్తున్నట్టు సమాచారం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -