మాజీమంత్రి వి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెచ్చిన లేబర్ కోడ్‌లు కార్మికులకు భారంగా ఉన్నాయని బీఆర్‌ఎస్ నాయకులు, మాజీమంత్రి వి శ్రీనివాస్‌గౌడ్ విమర్శించారు. వాటిని కార్మికుల అభ్యున్నతికి అనుగుణంగా సవరించాలని డిమాండ్ చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ (బీఆర్‌టీయూ) ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీమంత్రి వి శ్రీనివాస్‌గౌడ్, మాజీ ఎంపీ బి వినోద్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఆశా వర్కర్లు, ఆటో యూనియన్, హమాలీ యూనియన్, పబ్లిక్ సెక్టార్ యూనియన్లు, ఫ్యాక్టరీ యూనియన్లు, ట్యాక్సీ యూనియన్లు, కన్‌స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్, స్ట్రీట్ వెండర్స్ తదితర రంగాల యూనియన్ నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి కేసీఆర్ నాయకత్వంలో అనేక ఉద్యమాలు, పోరాటాలు చేసి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నామని అన్నారు. ఆ పోరాటాలలో మిలియన్ మార్చ్ ఒక మైలురాయిగా నిలుస్తుందని గుర్తు చేశారు. కాంగ్రెస్ ఎన్నికల సమయంలో మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందన్నారు. మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిందని చెప్పారు. బీఆర్‌ఎస్ ఎప్పుడూ కార్మికుల పక్షానే నిలుస్తుందనీ, వారి హక్కులు, భద్రత, భవిష్యత్తు కోసం పోరాడుతుందని అన్నారు. కార్మికుల ఐక్యత, హక్కుల సాధనకు మరిన్ని కార్యాచరణలు చేపట్టాలని నిర్ణయించామని చెప్పారు. బీఆర్‌టీయూ అధ్యక్షులు రాంబాబు యాదవ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు మారయ్య, నారాయణ, దానకర్ణ చారి, హమాలి శ్రీనివాస్, మాయ రాజయ్య తదితరులు పాల్గొన్నారు.



