Friday, November 7, 2025
E-PAPER
Homeజిల్లాలువ్యవసాయం నుంచి రైతులను దూరం చేసేందుకు కేంద్రం కుట్ర

వ్యవసాయం నుంచి రైతులను దూరం చేసేందుకు కేంద్రం కుట్ర

- Advertisement -

రైతు సంఘం జిల్లా అధ్యక్షులు  వీరేపల్లి వెంకటేశ్వర్లు
నవతెలంగాణ – మిర్యాలగూడ 

రైతులను వ్యవసాయం నుండి దూరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, దీనిని వ్యతిరేకించేందుకు రైతులు సంఘటితంగా పోరాడాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వీరేపల్లి వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. రైతు సంఘం మండల  నాయకులు బొచ్చు కోటిరెడ్డి  అధ్యక్షతన తెలంగాణ రైతు సంఘం దామరచర్ల మండలం మహాసభ నిర్వహించారు. ముందుగా రైతు సంఘం  జెండా ఆవిష్కరించారు. సభ ప్రారంభానికి ముందు అమరవీరులకు సంతాపం ప్రకటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రైతులకు సమస్యలు వెంటాడుతున్నాయని, ప్రకృతి విపత్తులు, అన్ని పంటలపై ధర ప్రభావం చూపుతున్నాయన్నారు. పత్తి క్వింటాలుకు 8,110రూపాయలు కొనుగోలు చేయాల్సి ఉండగా నానా నిబంధనలు పెట్టడంతో రైతు బయట మార్కెట్లో 6వేల నుంచి రూ.4వేలకే అమ్ముకోవాల్సి వస్తోందన్నారు.

అధిక వర్షాలతో పత్తి నాణ్యత దెబ్బతిన్నదని, ఒకవైపు దిగుబడి తగ్గి రైతులు ఆందోళన చెందుతుంటే సిసిఐ నిబంధనలు రైతులను గోసపెడుతున్నాయన్నారు. రైతుల హక్కుల పరిరక్షణ కోసం సంఘటితంగా పోరాడాలని పిలుపునిచ్చారు. అమెరికా నుండి పత్తి, గోధుమ, పాలు, కోడి, పంది మాంసాలు దిగుమతికి అనుమతిస్తూ, కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం స్వదేశీ వ్యవసాయానికి మంగళం పాడుతుందని ఆరోపించారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం బలమైన ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు, సిసిఐ నిబంధనలు రైతులను అయోమయం చేస్తున్నాయన్నారు. కిసాన్ కపాస్ రిజిస్ట్రేషన్ పత్తి రైతులను ముప్పు తిప్పలు పెడుతుందన్నారు. ఇప్పటికే రైతులు లక్ష ఎకరాల్లో పత్తి పంటలు పీకేశారన్నారు. సంఘటితమై పోరాడితేనే తమ హక్కులు సాధించుకోవచ్చు అన్నారు.

అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా మాలోత్ వినోద్ నాయక్ కార్యదర్శిగా గోలి వెంకటరెడ్డి లతో పాటు 17 మందితో నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సిఐటియు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు డబ్బికార్ మల్లేష్, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రవి నాయక్, గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి ఎర్రనాయక్, సిఐటియు మండల కన్వీనర్ దయానంద్, గిరిజన సంఘం సీనియర్ నాయకులు పాపా నాయక్, రైతు సంఘం నాయకులు బొచ్చు కోటిరెడ్డి, శ్రీహరి, సుభాని, కాంతారావు, మట్టయ, దుర్గయ్య, శీను నాయక్, కాజా మొయినుద్దీన్, చంద్రకళ ,బాలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -