Friday, March 13, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఉపాధి హామీ నిర్వీర్యానికి కేంద్రం కుట్ర

ఉపాధి హామీ నిర్వీర్యానికి కేంద్రం కుట్ర

- Advertisement -

బిల్లులు రాక పస్తులు ఉంటున్న కూలీలు : ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మీ
రంగారెడ్డి జిల్లా కందుకూరులో కూలీల సమస్యలపై ఆరా
నవతెలంగాణ-కందుకూరు

ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్రం కుట్ర చేస్తోందని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మీ విమర్శించారు. బిల్లులు రాక కూలీలు పస్తులుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం రంగారెడ్డి జిల్లా కందుకూరు గ్రామంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి అంకగాళ్ల కుమార్‌ ఆధ్వర్యంలో ఉపాధి కూలీలు పని చేస్తున్న ప్రదేశానికి వెళ్లి కూలీల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సరిగ్గా పనిదినాలు లేవని, పని ప్రదేశాల్లో మౌలిక వసతులు కల్పించడం లేదని, సకా లంలో డబ్బులు రావడం లేదంటూ కూలీలు తమ సమస్యలను ఏకరవు పెట్టారు.

ఈ సందర్భంగా మల్లు లక్ష్మి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన కొత్త చట్టం ‘వీబీఆర్‌ఏఎంజీ’ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో కూలీలకు వేసవిలో ఉపాధి కల్పించేలా 2005లో వామపక్ష పార్టీల సహకారంతో అప్పటి యూపీఏ ప్రభుత్వం ఉపాధి చట్టం తీసుకొచ్చినట్టు గుర్తు చేశారు. ఒక్కొక్క కుటుంబానికీ వంద రోజుల పని విధానంతో ఈ చట్టం వచ్చిందన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బడ్జెట్‌లో నిధులు కేటాయించకుండా చట్టాన్ని నిర్వీర్యం చేసే చర్యలకు పాల్పడుతుందని విమర్శించారు. ఉపాధికి రూ.2 లక్షలా 50 వేల కోట్లు అవసరం ఉంటే.. కేవలం రూ. 90వేల కోట్లు మాత్రమే కేటాయించడం సిగ్గు చేటన్నారు.

ఎనిమిది వారాలుగా కూలీలకు బిల్లులు రావడంలేదని తెలిపారు. గడ్డ పార, పార, తట్టలు, మెడికల్‌ కిట్లు, తాగునీరు, టెంట్లు బాధ్యత రాష్ట్రాలకు అప్పగించడం శోచనీయ మన్నారు. గ్రూపు ఫొటో కాకుండా, కూలీలకు వ్యక్తిగతంగా ఒక్కొక్కరి ఫొటో సేకరించడం వల్ల ఇబ్బంది అవుతుందని తెలిపారు. ఈకేవైసీ కొత్తగా ప్రవేశపెట్టడంతో నెట్‌ రాక కూలీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ‘వీబీ జీఆర్‌ఏఎంజీ’ ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 25వ తేదీన చేపట్టే చలో కలెక్టరేట్‌ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

అలాగే ఐద్వా ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ కమిటీలు ఏర్పాటు చేయాలనే నిర్ణయం మేరకు కందుకూరులో మస్కు అరుణతో కలిసి గ్రామ కమిటీలు వేశారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘం రాష్ట్ర నాయకురాలు మస్కు అరుణ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు పెరుమండ్ల అంజయ్య, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు దుబ్బాక రామ్‌చందర్‌, సీఐటీయూ సంఘం మండల కన్వీనర్‌ బుడ్డీరపు శ్రీనివాస్‌, సీపీఐ(ఎం) మండల కార్యదర్శి బుట్టి బాల్‌రాజు, గ్రామ పంచాయతీ కార్మికుల సంఘం మండలాధ్యక్షులు రాయి కంటి శేఖర్‌, సురేష్‌, భూమేష్‌, ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -