– కార్పొరేట్లకు వరాలు.. ప్రజలపై భారాలు
– కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక నాయకులు
– ప్రజా వ్యతిరేక బడ్జెట్‌కు నిరసనగా సీఐటీయూ, ఏఐకేఎస్, ఏఐఏడబ్ల్యూయూ ప్రదర్శన
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఆర్థిక బడ్జెట్ మన దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతోందని సీఐటీయూ, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. గత బడ్జెట్ కంటే సుమారు రూ.3లక్షల కోట్లు అదనంగా కేటాయించిందని పేర్కొన్నాయి. ఇప్పటికే జీడీపీ లోటు ఉందనీ, ఈ బడ్జెట్ ప్రభావంతో ఆర్థిక వ్యవస్థకు ప్రమాదం ఉందని తెలిపాయి. ప్రజా వ్యతిరేక కేంద్ర బడ్జెట్‌ను నిరసిస్తూ ఆయా సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్ గొల్కొండ చౌరస్తా నుంచి ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ వరకు భారీ నిరసన ప్రదర్శన నిర్వహించాయి. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి. వెంకట్ మాట్లాడుతూ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్ కార్పొరేట్ల బడ్జెట్ అని విమర్శించారు. పేదలు, వ్యవసాయ కూలీలు, ఇతర సామాజిక తరగతులకు సంబంధించిన సంక్షేమ పధకాలకు కేటాయింపులు తగ్గించిందని తెలిపారు. కార్పొరేట్ల ప్రయోజనాలను రక్షించే విధంగా బడ్జెట్ రూపకల్పన చేశారని విమర్శించారు. గ్రామీణ ఉపాధి హమీ పథకానికి కేటాయింపులు మరింత తగ్గించి గ్రామీణ పేదల ఉపాధికి గండికొట్టిందని తెలిపారు. రైతులకు గిట్టుబాటు ధరకు గ్యారంటీ లేకుండా చేసిందనీ, ఎరువులకు, వ్యవసాయ పరికరాలపై జీఎస్టీ తగ్గించకపోవడం అన్యాయమన్నారు. ఈబడ్జెట్‌కు వ్యతిరేకంగా దేశవ్యాప్త ఉద్యమానికి సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు.
సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ ఈ బడ్జెట్‌లో కార్పొరేట్లకు వేలకోట్ల లాభాలు తెచ్చిపెట్టే ఇన్ఫ్రాస్ట్రక్చర్, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాజెక్టులను కట్టబెట్టిందని తెలిపారు. కార్పొరేట్ల సంపదపై పన్ను మినహాయింపులు ఇచ్చిందని తెలిపారు. కార్మికుల ఉద్యోగ భద్రత, ఉపాధి హామీపై ఒక్క మాట కూడా బడ్జెట్‌లోలేదని విమర్శించారు. కార్పొరేట్ల సంపదను పెంచేందుకు కోట్లాది ప్రజల జీవన హక్కులను దెబ్బతీస్తున్నదని తెలిపారు. ఉపాధిని కల్పించే పేరిట శాశ్వత ఉద్యోగుల స్థానంలో కాంట్రాక్టు, గిగ్, ఔట్‌సోర్సింగ్ పెంచేలా బడ్జెట్ ఉందన్నారు. కార్మికులకు ఉద్యోగ భద్రత, ఉపాధి కల్పన, కనీస వేతనాల పెంపు, అసంఘటితరంగ కార్మికులు, స్కీమ్ వర్కర్లకు సంబంధించిన పెన్షన్, ఈఎస్‌ఐ, పీఎఫ్ వంటి సామాజిక భద్రతను దెబ్బతీస్తున్నదని విమర్శించారు. లేబర్ కోడ్ల అమలు వల్ల నష్టపోయే కార్మికుల సంక్షేమాన్ని పట్టించుకోలేదన్నారు. బడ్జెట్ అసమానతల్ని పెంచేదిగా ఉందని చెప్పారు. లేబర్ కోడ్ల రద్దు కోసం, కనీస వేతనం రూ.26వేల ఇవ్వాలనీ, స్కీమ్ వర్కర్లను కార్మికులుగా గుర్తించాలని కార్మికవర్గం సుదీర్ఘకాలం ఉద్యమిస్తోందన్నారు. అసంఘటిత కార్మికుల సంక్షేమం వంటి అంశాలను బడ్జెట్‌లో ప్రస్తావించకపోవడం కార్మిక వ్యతిరేక చర్య అని ఆయన అభిప్రాయపడ్డారు. సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్. వీరయ్య మాట్లాడుతూ ఈ బడ్జెట్ సంస్కరణల వేగాన్ని మరింత పెంచే విధంగా ఉందన్నారు. ప్రజల కొనుగోలు శక్తి పెంచేందుకు చర్యలు తీసుకోలేదని చెప్పారు. ధరల స్థిరీకరణ అంశాన్ని పట్టించుకోలేదని తెలిపారు. ఇది సంస్కరణలతో కూడిన సంపన్నుల బడ్జెట్ అన్నారు. వ్యవసాయ, పారిశ్రామిక సంక్షోభం, నిరుద్యోగం, ఆహార ద్రవ్యోల్బణం, అసమానతలు పెంచేందుకు అనువుగా బడ్జెట్‌ను రూపకల్పన చేసిందని విమర్శించారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్. వెంకట్రాములు మాట్లాడుతూ ఈ బడ్జెట్ సాధారణ ప్రజలతోపాటు వ్యవసాయ కూలీలపై తీవ్ర ప్రభావం చూపుతోందన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని భారాలు మోపిందని చెప్పారు. గతంలో గ్రామీణ ఉపాధి హమీ పథకానికి కేంద్ర బడ్జెట్‌లో 90 శాతం నిధులు కేటాయించగా నేడు 60శాతం మాత్రమే కేటాయించిందని తెలిపారు.
రాబోయే రోజుల్లో గ్రామీణ ఉపాధి హమీ పరిరక్షణ కోసం పోరాటాలు నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు. నిరసన కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శులు జె. వెంకటేష్, ఎ. ముత్యంరావు, ఎం. వెంకటేష్, ఎం. పద్మశ్రీ, కూరపాటి రమేష్, పి. సుధాకర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు టి. రాజారెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు యాటల సోమన్న, ఎస్‌ఎస్‌ఆర్‌ఎ ప్రసాద్, ఎ. సునీత, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బుర్రి ప్రసాద్, రాష్ట్ర సహాయ కార్యదర్శి పద్మ, రాష్ట్ర కమిటీ సభ్యులు ఆర్. ఆంజనేయులు, హైదరాబాద్ సెంట్రల్ సిటీ అధ్యక్ష, కార్యదర్శులు ఎం. దశరధ్, జె. కుమారస్వామి, నగర నాయకులు మల్లేష్, రాములు, నరేష్, మహేందర్, యాదమ్మ తదితరులు పాల్గొన్నారు.



