కల్వకుంట్ల కుటుంబ పెత్తనంతో ఆ బోర్డు నిర్వీర్యం
కాంగ్రెస్ తప్పుడు విధానాలకు సైట్ విజిట్ సర్టిఫికేషన్ నిబంధన పరాకాష్ట
నైనీ కోల్‌బ్లాక్‌పై సీబీఐ విచారణకు కాంగ్రెస్ సర్కారు అనుమతిస్తే పరిశీలిస్తాం : కేంద్ర మంత్రి జి కిషన్‌రెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
సింగరేణి సంస్థపై కేంద్ర ప్రభుత్వ అజమాయిషీ లేదని కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణలో సీబీఐ అడుగు పెట్టేందుకు వీలులేదంటూ అసెంబ్లీ తీర్మానం చేసిందని తెలిపారు. ఇప్పటికైనా నైని కోల్‌బ్లాక్ విషయంలో అనుమతిస్తే తెలంగాణ రాష్ట్రంలో సీబీఐ అడుగుపెడుతుందన్నారు. బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్న సమయంలో సింగరేణి బోర్డును నిర్వీర్యం చేసి, ఆ తర్వాత కల్వకుంట్ల కుటుంబం పెత్తనం చేసిందని విమర్శించారు. సింగరేణి బొగ్గుబావులను బీఆర్‌ఎస్ సర్కారు 12 ప్రయివేట్ కంపెనీలకు అప్పగించిం దన్నారు. గురువారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనూ, ఎన్డీయే ప్రభుత్వ హయాంలోనూ సింగరేణి విషయంలో కేంద్రం జోక్యం చేసుకోలేదని స్పష్టం చేశారు. అయినప్పటికీ సింగరేణి రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిందని తెలిపారు. లాభాల్లో ఉన్న సింగరేణి రాష్ట్రం ఏర్పడిన తర్వాత క్రమంగా సమస్యల్లో చిక్కుకుందని చెప్పారు.
ఈ సంస్థలో తెలంగాణ రాష్ట్రానికి 51 శాతం, కేంద్రానికి 49 శాతం వాటా ఉన్నప్పటికీ ఎన్నో ఏండ్లుగా రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోనే ఉందనీ, ఎలాంటి ప్రత్యక్ష జోక్యం ఉండదని చెప్పారు. ‘సింగరేణి బోర్డులో కేంద్ర నుంచి ముగ్గురు డైరెక్టర్లు, రాష్ట్రం నుంచి ఏడుగురు ఉంటారు. గతంలో కాంగ్రెస్ హయాంలో ఏర్పడిన వర్కింగ్ సిస్టమ్ ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏడుగురు, కేంద్రం నుంచి ఇద్దరు, వెస్ట్రన్ కోల్ ఫీల్డ్ నుంచి ఒకరు కలిపి మొత్తం 10 మంది డైరెక్టర్లతో సింగరేణి బోర్డు పని చేస్తుంది’ అని అన్నారు. అన్ని నిర్ణయాలను బోర్డు పరిధిలోనే తీసుకుంటారని గుర్తు చేశారు. అందుకు సంబంధించిన ప్రతి సమాచారం కేంద్రానికి ఉండదని గుర్తు చేశారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలోనే కాకుండా రెండేండ్ల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో కూడా సింగరేణిపై ఆర్థిక విధ్వంసం కొనసాగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. సింగరేణిని కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసి, ఖర్చు తగ్గింపుపై నివేదిక సిద్ధం చేయించిందన్నారు. బీఆర్‌ఎస్ పాలనలో కేసీఆర్ కుటుంబం పూర్తిగా సింగరేణిపై అజమాయిషీ చేసిందని విమర్శించారు. టెండర్ల నుంచి చిన్న కాంట్రాక్టుల వరకు ప్రతి చోటా కేసీఆర్ కుటుంబ ఆదేశాలే అమలయ్యాయని ఆరోపించారు.
మైనింగ్ జరిగే ప్రాంతాల్లో పరిసర ప్రాంతాల అభివృద్ధికి డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ ఉంటుందనీ, సుమారు రూ.1500 కోట్ల నిధులు ఇప్పటికీ సంబంధిత జిల్లాలకు చేరలేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇన్‌చార్జి సీఎండీలతోనే కాలం గడుపుతూ, ఫుల్ టైం సీఎండీలను నియమించలేదని విమర్శించారు. బీఆర్‌ఎస్ హయాంలో కూడా టెండర్లు పిలిచి, ఆఫర్లు వచ్చిన తర్వాత మధ్యలోనే రద్దు చేసిందని విమర్శించారు. మైనింగ్ చేయలేమంటూ సింగరేణితో బీఆర్‌ఎస్ సర్కారు లేఖ రాయించిందని గుర్తు చేశారు. టెండర్లలో సాధారణంగా ‘సైట్ విజిట్ సర్టిఫికెట్’ సెల్ఫ్ డిక్లరేషన్ రూపంలో ఉంటుందనీ, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టు అథారిటీ సర్టిఫికెట్ తప్పనిసరి చేసిందని వివరించారు. నైని కోల్ బ్లాక్ విషయంలో 17 కంపెనీలు సైట్ విజిట్ చేశాయనీ, అందులో ఏ కంపెనీకి కూడా సర్టిఫికెట్ ఇవ్వలేదని గుర్తు చేశారు. తప్పుడు విధానాలతో టెండర్లలో ‘సైట్ విజిట్ సర్టిఫికెట్’ నిబంధన పెట్టారని ఆరోపించారు. నైనిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలంటే, సీబీఐ రాష్ట్రంలో దర్యాప్తు చేయకూడదని బీఆర్‌ఎస్ ఉత్తర్వులు తెచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కోల్ బ్లాక్స్‌కు సంబంధించి వేలాన్ని నిర్వహించకపోతే కేంద్రానికి అప్పగిస్తే పారదర్శకంగా టెండర్ ప్రక్రియ పూర్తి చేస్తామని ఆయన తెలిపారు.



