Wednesday, January 21, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంయూరియా యాప్‌పై కేంద్రం ప్రశంసలు

యూరియా యాప్‌పై కేంద్రం ప్రశంసలు

- Advertisement -

వచ్చే ఖరీఫ్‌కల్లా అన్ని జిల్లాల్లో అమల్లోకి తేవాలి
సేంద్రీయ, ఆర్గానిక్‌ రైతులను ప్రోత్సహించాలి
ఆర్గానిక్‌ పంటలకు సర్టిఫికేషన్‌ ఇచ్చేలా త్వరలో యాప్‌
వ్యవసాయ శాఖ అన్ని కమిటీల్లోనూ రైతులకు ప్రాతినిధ్యం ఉండేలా చూడండి : ఉన్నతాధికారులతో సమీక్షలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన యూరియా (ఫెర్టిలైజర్‌) యాప్‌ను కేంద్ర ఫెర్టిలైజర్‌ శాఖ అభినందించిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. వచ్చే ఖరీఫ్‌ కల్లా యాప్‌ను రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి తేవాలని అధికారులను ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్‌లోని సచివాలయం నుంచి వ్యవసాయ, మార్కెటింగ్‌, కో-ఆపరేషన్‌, హార్టికల్చర్‌ శాఖల పురోగతిపై ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. అందులో వ్యవసాయశాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్‌, డైరెక్టర్‌ గోపి, హర్టీకల్చర్‌ డైరెక్టర్‌ యాస్మిన్‌ బాషా, హాకా ఎమ్‌డీ చంద్రశేఖర్‌ రెడ్డి, మార్కెటింగ్‌ శాఖ డైరెక్టర్‌ లక్ష్మీబాయి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సమీక్షలో మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. ఆర్గానిక్‌ పంటలు పండించే రైతులకు నష్టం చేకూరకుండా చూస్తామనీ, ఆర్గానిక్‌ ఉత్పత్తులకు సర్టిఫికేషన్‌ ఇచ్చేలా ఒక యాప్‌ను వ్యవసాయ శాఖ రూపొందిస్తున్నదని తెలిపారు. అగ్రివర్సిటీల్లోని ఖాళీ ప్రదేశాల్లో ఆర్గానిక్‌ పంటలు పండించి, అక్కడే స్టాల్స్‌ పెట్టి అమ్మినట్లయితే రైతులు ఆర్గానిక్‌ పంటలవైపు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అన్నారు. వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద రూ.50 కోట్లు ఖర్చు చేశామనీ, మరో రూ. 50 కోట్లు ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. రైతులకు యంత్రాలు మార్కెట్‌ ధరలకే లభించేలా, సబ్సిడీ నేరుగా అందేలా నిబంధనలు రూపొందించాలని ఆదేశించారు. కేంద్ర ప్రాయోజిత పథకాలను పునరుద్ధరిస్తున్నామనీ, ఇప్పటికే పలు పథకాల కింద రూ.500 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. కేంద్రం నుంచి వచ్చే ప్రతి పైసాను సద్వినియోగం చేసుకునేలా ప్రణాళికలు వేయాలని అధికారులను ఆదేశించారు. వచ్చే ఖరీఫ్‌ నాటికి పెద్దఎత్తున యూరియా బఫర్‌ స్టాక్‌ను నిల్వ ఉంచుకోవాలనీ, రైల్వే రేక్‌ పాయింట్లను కూడా ఎరువుల పంపిణీకి తగ్గట్లుగా ఉండేలా, మరికొన్ని పాయింట్లను అదనంగా ఏర్పాటు చేసేలా రైల్వే అధికారులను కోరాలని సూచించారు. రైతులు మేలైన వరి వంగడాలను వాడి మంచి ధర పొందేలా చూడాలన్నారు. ఈ నెలాఖరు నాటికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పంటల శాటిలైట్‌ మ్యాపింగ్‌ డేటా ఇవ్వాలనీ, మూడేండ్ల పంటల శాటిలైట్‌ మ్యాపింగ్‌తో డేటా అందించాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అన్ని శాఖల డిపాజిట్లు ప్రయివేటు కమర్షియల్‌ బ్యాంకుల్లో కాకుండా కో-ఆపరేటివ్‌, అర్బన్‌ కోఆపరేటీవ్‌ బ్యాంకుల్లో చేసేలా చూసేందుకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి లేఖ రాయాలని అధికారులను ఆదేశించారు. పామాయిల్‌పై దిగుమతి సుంకాన్ని 44 శాతానికి పెంచేలా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని అధికారులకు సూచించారు. అలాగైతే టన్ను ఆయిల్‌ పామ్‌ ధర రూ.25,000 వరకు చేరుకుంటుందనీ, దాంతో ఆయిల్‌ ఫామ్‌ సాగువైపు రైతులు మరింత మొగ్గుచూపుతారని తెలిపారు. రాష్ట్ర అవసరాలకు తగ్గట్టుగా కూరగాయల సాగును ప్రోత్సహించాలని ఆదేశించారు. గ్రామాలు, పట్టణాల్లోని ఇండ్లల్లో అందుబాటులో ఉన్న స్థలాల్లో, టెర్రస్‌ల మీద కూరగాయలు పండించేలా అవగాహన కల్పించాలని సూచించారు. రైతులకోసం వ్యవసాయ శాఖ, యూనివర్సిటీలలో, కార్పోరేషన్లలో గాని ఏర్పాటు చేసే ప్రతి కమిటీలోనూ అధికారులతో పాటు రైతులకూ ప్రాతినిధ్యం కల్పించాలని ఆదేశించారు. వ్యవసాయ శాఖకు సంబంధించి ఉన్న ఖాళీ ప్రదేశాల్లో సోలార్‌ ప్యానెల్స్‌ ఏర్పాటు చేసి, ఉత్పత్తి అయి మిగిలిన కరెంట్‌ ను గ్రిడ్‌ కు అమ్ముకోవచ్చని అన్నారు. ఇప్పటికే ప్రయోగాత్మకంగా రెండు రైతువేదికలలో సోలార్‌ ప్యానెల్స్‌ ఏర్పాటు చేయగా నెలకు 400 యూనిట్ల వరకు మిగులు కరెంట్‌ ఉత్పత్తి అవుతుందని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -