గతంలాగే 90 శాతం నిధులు కేటాయించాలి
12న దేశ వ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
లోయపల్లిలో ఉపాధి హామీ కూలీలతో సమావేశం
నవతెలంగాణ-మంచాల
కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీని నిర్వీర్యం చేసేందుకు కుట్రలు చేస్తోందని, అందులో భాగంగా మహత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పేరును వికసిత్ భారత్ రాంజీ అని మార్చిందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలను ఖండిస్తూ.. ఈ నెల 12వ తేదీన చేపట్టే దేశ వ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. శనివారం రంగారెడ్డి జిల్లా మంచాల మండలం లోయపల్లి గ్రామంలో ఉపాధి హామీ కూలీలతో సమావేశమయ్యారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు పేదరికంలో ఉండటం వల్లనే ఉపాధి హామీ పనులు చేయాల్సి వస్తోందని తెలిపారు.
యువతకు ఉద్యోగాలు రాక ఉపాధి హామీ పనులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఉపాధి హామీలో పని చేసే కూలీలకు చెట్లు కొట్టే పనులు, మట్టి తీసే పనులు చెప్పకుండా.. కొండలపై, గుట్టలపై పని చేయించాలని చూస్తోందని అన్నారు. గుట్టలపై పనిచేసినా సరైన కూలి దక్కడం లేదన్నారు. పనికి తగ్గ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం రోజు కూలి రూ.307గా నిర్ణయించిందని, కానీ రూ.165కు మించి రావడం లేదన్నారు. రోజు కూలి రూ.800 చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే ఏడాదిలో పనిదినాలు 125 రోజులుగా నిర్ణయించారని, దీన్ని 200 రోజులకు పెంచాలన్నారు. ఉపాధి హామీకి కేంద్రమే గతంలో లాగా 90 శాతం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. పని ప్రదేశాల్లో సౌకర్యాలు కల్పించడం లేదని, కూలీలకు పనిముట్లు అందజేయడం లేదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులు, కర్షకులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని అన్నారు.
రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర రావడం లేదన్నారు. సబ్సిడీలు కూడా ఇవ్వడం లేదన్నారు. ఆస్పత్రిలో కనీసం మెరుగైన వైద్యం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని, వాటిని అమలు చేయాలని డిమాండ్ చేశారు. మనకు హక్కులు దక్కాలంటే పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. దేశవ్యాప్త సమ్మె సందర్భంగా మండల కేంద్రాల్లో నిర్వహించే ఆందోళనలో కార్మికులు, కర్షకులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య, మండల కార్యదర్శి రావుల జంగయ్య, జిల్లా కమిటీ సభ్యులు కర్నాటి శ్రీనివాస్‌రెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు పి.అంజయ్య, ఎన్.శ్యామ్ సుందర్, మండల కమిటీ సభ్యులు బోయపల్లి సుధాకర్, పార్టీ గ్రామ కమిటీ కార్యదర్శి ఉరుపక్క లింగం, శాఖ కార్యదర్శి సిద్ధ గొని మహేష్ తదితరులు పాల్గొన్నారు.



