– దానిలో భాగమే వీబీ జీ రామ్ జీ చట్టం
– ప్రజా వ్యతిరేక చట్టాల రద్దు కోసం పోరాడుదాం
– కార్పొరేట్ల సేవలతో తరిస్తున్న మోడీ సర్కార్
– లేబర్ కోడ్‌లతో కార్మికుల జీవనోపాధికే ఎసరు : సీఐటీయూ జాతీయ అధ్యక్షులు సుదీప్ దత్త
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కార్మిక, రైతు వ్యతిరేక చట్టాల రద్దుకై పోరాడుదామని సీఐటీయూ జాతీయ అధ్యక్షులు సుదీప్ దత్త పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ సంగారెడ్డిలో చేపట్టిన జీపుయాత్ర ముగింపు సభకు హాజరైన సందర్భంగా సీఐటీయూ జాతీయ అధ్యక్షులు సుదీప్ దత్తతో నవతెలంగాణ ప్రత్యేక ఇంటర్వూ..
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్‌లతో కార్మికులకు ఉపయోగం అని బీజేపీ ప్రభుత్వం ప్రచారం చేస్తుంది.. మీరు చట్టాలు రద్దు చేయాలని పోరాడుతున్నారు. అసలు లేబర్ కోడ్‌లతో ఎలాంటి నష్టం వాటిల్లుతుంది?
లేబర్ కోడ్‌ల వల్ల కార్మికులకు అనేక రకాల ఇబ్బందులున్నాయి. ముఖ్యంగా కార్మికులను చట్టాలకు దూరం చేయడమే ఈ కోడ్‌ల ముఖ్య ఉద్దేశం. దేశంలో 75శాతం ఫ్యాక్టరీలు, సంఘటిత రంగంలో పనిచేస్తున్న 90శాతం మంది కార్మికులు.. లేబర్ కోడ్‌ల వల్ల కార్మిక చట్టాల నుంచి నెట్టివేయబడుతున్నారు. 100 మంది కార్మికులు పనిచేసే ఫ్యాక్టరీలో.. ఎవరినైనా ఉద్యోగం నుంచి తొలగించాలంటే ప్రభుత్వ అనుమతి తీసుకోవలసి ఉంటుంది. లేబర్ కోడ్‌లతో 300 మంది లోపు కార్మికులు పనిచేసే పరిశ్రమ అయినా ఎవరి అనుమతి లేకుండానే తొలగించే వీలు కల్పించారు. సంగారెడ్డి పరిధిలోని చాలా కంపెనీల్లో 300మంది లోపు కార్మికులే పనిచేస్తున్నారు. లేబర్ కోడ్‌ల వల్ల వారిని తొలగించేందుకు ఎవరి పర్మిషన్ అవసరం లేదు. అలాగే, పీఎఫ్, ఈఎస్‌ఐ సౌకర్యాలు, జీతాల పెంపు లాంటివి అడిగే హక్కును కార్మికులు కోల్పోతారు. వారి సమస్యలు పరిష్కరించే యూనియన్లను పెట్టుకునేందుకు లేబర్ కోడ్‌లు వ్యతిరేకం. సమ్మెకూ అనుమతిలేదు. మొత్తంగా పరిశ్రమ యాజమాన్యాలకు ఉపయోగపడేందుకే ఈ లేబర్ కోడ్‌లు..
ఫిక్స్‌డ్ టర్మ్ అపాయింట్‌మెంట్ అంటే ఏమిటి?
ఇప్పుడు శాశ్వత పనుల్లో కూడా ఫిక్స్‌డ్ టర్మ్ అపా యింట్‌మెంట్ పెట్టుకోవచ్చని చెప్పారు. ఫిక్స్‌డ్ టర్మ్ అపాయింట్‌మెంట్ అంటే 3 నెలలు, 6 నెలలు అంటూ ఫిక్స్‌డ్ సమయానికి కొన్ని పరిశ్రమలు కార్మికులను నియమించుకుంటారు. దీనికి తప్పని సరిగా పరిశ్రమకు లైసెన్స్ అవసరం. అలాగే, కార్మి కులనూ లైసెన్స్ కాంట్రాక్టర్ ద్వారా నియమిస్తారు. కానీ లేబర్ కోడ్‌ల వల్ల లైసెన్స్ అవసరం లేదు. 50 మంది కార్మికులు పనిచేస్తున్నా లైసెన్స్ అవసరం లేదు. దీనివల్ల లైసెన్స్ లేని పరిశ్రమను, కాంట్రా క్టర్లను హక్కులు అడగలేం. అలాగే, కంపెనీ యాజ మాన్యాలు శాశ్వత పనిలో కూడా కాంట్రాక్టు వర్కర్ల తో పనులు చేయించుకుంటారు. లేబర్ కోడ్‌ల వల్ల యజమానులు పర్మినెంట్ కార్మికులను తగ్గిస్తూ ఫిక్స్‌డ్ టర్మ్ ఎంప్లారు కింద కార్మికులను మూడు నెలలకు, ఆరు నెలలకు తీసుకుంటున్నారు. అంతే కాకుండా, స్ప్రెడ్ ఓవర్ టైమ్ పేరిట పనులు చేయి స్తున్నారు. ఒక కంపెనీలో ఫిక్స్‌డ్ టర్మ్ ఎంప్లారు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పనిచేయాలి. కానీ వేతనం మాత్రం 8 గంట లకు మాత్రమే చెల్లిస్తారు. కార్మిక చట్టాల ప్రకారం.. 4 గంటలు పని చేస్తే 2 గంటలు బ్రేక్, మరో 2 గంటలు పని చేస్తే గంట బ్రేక్ ఉండేది. ఇప్పుడు ఇవన్నీ ఎత్తేశారు. అంతేకాదు, కంపెనీలో యూని యన్ పెట్టాలంటే ఇబ్బంది ఉంటుంది. యూనియ న్లను నిర్వీర్యం చేసేందుకు ఈ ఫిక్స్‌డ్ టర్మ్ ఎంప్లాయిమెంట్ తీసుకువచ్చారు.
సమ్మె హక్కు కార్మికుల ఏకైక ఆయుధం కదా..
లేబర్ కోడ్‌ల వల్ల అది పోతుందా..?
సమ్మె హక్కు కార్మికుల జన్మహక్కు. గతంలో సమ్మె చేయాలంటే 15 రోజుల ముందు నోటీసు ఇచ్చే వారు. కానీ మారిన లేబర్ కోడ్లతో కార్మికులతో కంపెనీ యజమాని చర్చలు జరిపేందుకు ఇచ్చే సమయానికి నెల తర్వాత మాట్లాడదామంటే సమ్మె చేసే వీలుండదు. అంతేకాకుండా రెండు నెలలు, ఆరు నెలలు అయినా చర్చలు జరుపుతామంటే సమ్మె చేసే వీలు లేకుండా చేశారు. అలా కాకుండా కార్మికులు సమ్మెలోకి వెళ్తే వారిని జైల్లో పెట్టేలా లేబర్ కోడ్‌లలో పొందుపర్చారు. సమ్మెలోకి వెళ్లిన కార్మికులను, వారికి సహకరించిన వారిని కూడా జైల్లో పెడతారు. అంతే కాకుండా కంపెనీ లను తనిఖీ చేసేందుకు ఏర్పాటు చేసిన ఫ్యాక్టరీ ఇన్ స్పెక్టర్లు నేరుగా కంపెనీ తనిఖీచేసే అధికారం ఉండదు. వాళ్లు అనుమతి ఇస్తేనే లోపలికి వెళ్లాలి. లేదా కంపెనీ యాజమాన్యం ఏది రాసిస్తే అది మా త్రమే తీసుకోవాలి. ఇది నూతన కోడ్‌ల పరిస్థితి.
అంతేకాదు, రైతులను విత్తన చట్టం పేరుతో కార్పొరేట్ కంపెనీల లాభాల కోసం తీసుకువచ్చి రైతులను నిలువునా ముంచుతున్నారు. వ్యవసాయ కార్మికులను వీబీ జీ రామ్‌జీ పేరుతో ఉపాధికి దూరం చేసి ఇబ్బందులు పడేలా కేంద్రం చట్టాలను మార్చి వేసింది. విద్యుత్ సవరణ చట్టంతో ఉచిత కరెంట్‌కు దూరం చేయడంతోపాటు ఇష్టం వచ్చి నంత కరెంట్ బిల్లులు వసూలు చేసుకునే అవ కాశం కల్పించారు. కాబట్టి ప్రజలకు, కార్మికులకు, రైతులకు, కూలీలకు నష్టం కలిగించేలా తీసుకు వచ్చిన చట్టాలను రద్దు చేయాలని ఫిబ్రవరి 12వ తేదీన దేశ వ్యాప్త సమ్మె నిర్వహిస్తున్నాం. దాన్ని జయప్రదం చేయాలి. అప్పటికీ ప్రభుత్వం దిగిరాకుంటే నిరవధిక సమ్మె చేస్తాం.
కంపెనీల్లో ప్రమాదాలు జరిగితే దానికి ఎవరు బాధ్యత వహిస్తారు?
కంపెనీల్లో ఏదైనా ప్రమాదం జరిగితే దానికి గతంలో కంపెనీ బాధ్యత వహించి కార్మికుని కుటుంబానికి సహాయం అందించేది. అదే విధంగా కంపెనీలను తనిఖీ చేసేందుకు ఇన్స్‌పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అనే అధికారి ఉండేవారు. వారు తనిఖీ చేసి కంపెనీలో లోటు పాట్లను వెలికితీసే వారు. కానీ ఇప్పుడు 500 మంది లోపు కార్మికులు పని చేస్తే వారికి సేప్టీ అధికారి అవసరం లేదని లేబర్ కోడ్‌లలో మార్పులు చేశారు. ఇది వరకు 20 మంది కార్మికులు ఉన్నా ప్రభుత్వం ఒక వెల్ఫేర్ అధికారిని నియమించేది. కానీ ఇప్పుడు వారిని తీసివేశారు.
కార్మిక చట్టాల్లోని స్టాండింగ్ ఆర్డర్స్ అంటే ఏంటి? ఏ విధంగా ఉపయోగపడతాయి?
స్టాండింగ్ ఆర్డర్స్ అంటే.. కార్మికులకు వర్తించే నియమ నిబంధనలు, పని నిబంధనలు. ఓ పరిశ్రమలో 10 మంది కార్మికులు పనిచేసినా.. 300 మంది పనిచేసినా వారందరికీ కార్మిక చట్టాల ప్రకారం ఒకే రకమైన స్టాండింగ్ ఆర్డర్స్ పని చేస్తాయి. కనీస వేతనాలు అమలు చేయడం, పని ప్రదేశంలో రక్షణ, సౌకర్యాలు కల్పించడం, ప్రమాదబీమా వంటివి అమలు జరుగుతాయి. కానీ నూతన లేబర్ కోడ్‌ల వల్ల కార్మికులకు ఉద్యోగ భద్రత లేకుండా చేశారు. స్టాండింగ్ ఆర్డర్స్ రద్దు చేశారు. దాంతో కార్మికులకు తీరని నష్టం జరుగుతుంది. ఫ్యాక్టరీకి సంబంధించిన చట్టాలు కార్మికుడికి వర్తించాలి. పని వేళలు ఎలా ఉంటాయి, ఎప్పుడు పని ప్రారంభం, ఎప్పుడు ముగింపు, ఎంతవరకు తెరిచి ఉంచాలి, ఇవన్నీ నిబంధనల్లో ఉంటాయి. ఇప్పుడు ఏమైందంటే, 20 మంది కార్మికులు ఉన్న ఫ్యాక్టరీకి పవర్ ఉండదు (అంటే చట్టాల ప్రభావం ఉండదు). కార్మికుల సంఖ్య పెరిగినా కూడా ఫ్యాక్టరీకి వర్తించదు.



