Wednesday, January 7, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంపేదల ఉపాధిని దెబ్బతీస్తున్న కేంద్రం

పేదల ఉపాధిని దెబ్బతీస్తున్న కేంద్రం

- Advertisement -

మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి
గిరిజన సంఘం 2026 క్యాలెండర్‌ ఆవిష్కరణ

నవతెలంగాణ – ముషీరాబాద్‌
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పేదల ఉపాధిని దెబ్బతీస్తోందని మాజీ శాసనసభ్యులు జూలకంటి రంగారెడ్డి అన్నారు. తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ ముద్రించిన నూతన సంవత్సర క్యాలెండర్‌ను సోమవారం హైదరాబాద్‌ ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌లోని ఎంబీ భవన్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జూలకంటి మాట్లాడుతూ. గిరిజనులు, పేదల హక్కుల కోసం వీరోచిత పోరాటాలు చేసిన కొమురం భీమ్‌, ఠానూ నాయక్‌ త్యాగాలను స్మరించుకునే విధంగా వారి ఫొటోలతో గిరిజన సంఘం క్యాలెండర్‌ తీసుకురావడం అభినందనీయమన్నారు. వారి ఆశయాలను సాధించే విధంగా.. గిరిజన హక్కులు, చట్టాలను అమలు చేసే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాడాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టం స్థానంలో వీబీ జీ రామ్‌ జీ అనే కొత్త పథకాన్ని తీసుకొచ్చి కోట్లాది మంది గిరిజనులు, దళితులు, పేదల ఉపాధిని దెబ్బతీసిందని ఆవేదన వ్యక్తం చేశారు.

గిరిజన, అటవీ హక్కులను కాలరాస్తూ అటవీ సంపదను కార్పొరేట్లకు అప్పగించేందుకు అటవీ సంరక్షణ నియమాల చట్టం-2023 తీసుకొచ్చిందని తెలిపారు. దీంతో ఆరావళి, బస్తర్‌, నల్లమల వంటి ప్రతిష్టాత్మక పర్వతాలు, అడవులు ఖనిజ తవ్వకాల పేరుతో ధ్వంసమయ్యే ప్రమాదం ఉందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం చేవెళ్ల డిక్లరేషన్‌ పేరుతో గిరిజనులకు ఇచ్చిన హామీలను అమలు చేసేలా స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. గిరిజనులకు ఇచ్చిన వాగ్దానాల అమలులో జాప్యంపై గిరిజన సంఘం ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎం.ధర్మ నాయక్‌, ఆర్‌.శ్రీరాం నాయక్‌, ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బండారు రవికుమార్‌, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తీగల సాగర్‌, నాయకులు నున్నా నాగేశ్వరావు, మూడ్‌ శోభన్‌, సీఐటీయూ రాష్ట్ర నాయకులు భూపాల్‌, జయలక్ష్మి, ఆవాజ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అబ్బాస్‌, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌.వెంకట్‌రాములు, నాయకులు బుర్రి ప్రసాద్‌, పద్మ, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కోట రమేష్‌, వెంకటేష్‌, గోపీ నాయక్‌ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -