ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి రమేష్
ఘనంగా ఏఐటీయూసీ 106వ ఆవిర్భావ వేడుకలు
నవతెలంగాణ- భూపాలపల్లి
కేంద్రంలో బిజెపి ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను, నాలుగు కోడ్ లుగా విభజించి కార్మిక హక్కులను కాలరాస్తుందని ఏఐటియుసి బ్రాంచ్ సెక్రటరీ మోట పలుకుల రమేష్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో ని కొమురయ్య భవన్ లో ఏఐటీయూసీ 106వ ఆవిర్భావ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా  ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి క్యాతరాజు సతీష్ జెండా ఎగరవేసి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. స్వాతంత్రం రాకముందు కార్మికుల యొక్క హక్కుల కోసం ఆవిర్భవించిన గొప్ప చరిత్ర ఉన్న ఏఐటీయూసీ ఆరోజు జరిగిన స్వాతంత్ర పోరాటంలో కూడా పాల్గొన్న ఏకైక కార్మిక సంఘం ఏఐటీయూసీ మాత్రమే అని అన్నారు.
 మోడీ ప్రభుత్వం కార్మికులు అనేక పోరాటాల ద్వారా సాధించుకున్న 29 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడులుగా మార్చి హక్కు లేకుండా చేసి యాజమాన్యాలకు తొత్తులుగా చట్టాలు మార్పు చేశారన్నారు. కాంట్రాక్టు వ్యవస్థ రద్దు కోసం ,కనీస వేతనాలు అమలు కోసం, సింగరేణి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, ఉద్యోగ భద్రత కోసం నిరంతర ఉద్యమాలు కొనసాగిస్తూనే ఉందన్నారు.ఫ్యాక్టరీల చట్టం , ఈఎస్ఐ చట్టం, పీఎఫ్ చట్టం ,ప్రసూతి ప్రయోజనాల చట్టం, బోనస్ చెల్లింపు చట్టం, గ్రాటిటీ చెల్లింపు చట్టం ,బాల కార్మిక నిషేధ చట్టం, ఉద్యోగుల పదవి విరమణ పెన్షన్ పథకం, భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ చట్టం ,ఉపాధి హామీ చట్టం .వీటితోపాటు అనేక కార్మికుల హక్కుల కోసం చట్టాలను సాధించిన గొప్ప చరిత్ర కలిగిన యూనియన్ ఎఐటియుసి అని వారు గుర్తు చేశారు. భవిష్యత్తులో మోడీ అనుసరిస్తున్న ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ఏఐటీయూసీ ఇచ్చే పోరాట పిలుపులో భాగంగా కార్మికులంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు మోట పలుకుల రమేష్, బ్రాంచ్ అసిస్టెంట్ సెక్రటరీ సుధాకర్ రెడ్డి, సిపిఐ పట్టణ కార్యదర్శి సోతుకు ప్రవీణ్ కుమార్, ఎఐటియుసి నాయకులు కమలాకర్ ,శ్రావణ్ ,రాజు ,యాదగిరి రాజయ్య, పీక రవి ,భూమయ్య తోపాటు నాయకులు పాల్గొన్నారు.

 
                                    