Friday, January 9, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంప్రజల హక్కులను కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వం

ప్రజల హక్కులను కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వం

- Advertisement -

నాలుగు లేబర్‌ కోడ్స్‌, ‘వీబీ జీ రామ్‌ జీ’ని రద్దు చేయాలి
అణురంగంలో ప్రయివేటీకరణ దేశానికి ప్రమాదకరం
కేంద్ర విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్త ఉద్యమం
ఈనెల 11 వరకు పోరుయాత్ర
కార్మిక, కర్షకులు ఉద్యమంలో పాల్గొనాలి
మెదక్‌, నల్లగొండ జిల్లాల్లో జీపుజాతా ప్రారంభం


నవతెలంగాణ-మెదక్‌ ప్రాంతీయ ప్రతినిధి /మిర్యాలగూడ
గత 11 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న కేంద్ర బీజేపీ ప్రభుత్వం ప్రజల హక్కులను కాలరాయడమే కాకుండా రాష్ట్రాల హక్కులను సైతం హరిస్తూ నష్టం చేసే చట్టాలను చేస్తున్నదని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు అన్నారు. గురువారం మెదక్‌, నల్లగొండ జిల్లాల్లో కార్మిక, కర్షక పోరు జీపు జాతాను ప్రారంభించారు. మెదక్‌లోని పోస్ట్‌ ఆఫీస్‌ వద్ద జీపుజాతాను చుక్క రాములు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒక పక్క కేంద్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం పేరు వల్లిస్తూనే కార్పొరేట్‌ సంస్థలకు రూ.16 లక్షల కోట్లు రాయితీలు ఇచ్చిందన్నారు. చివరికి ప్రభుత్వ రంగ సంస్థలను అదానీ, అంబానీ వంటి బడా పెట్టుబడిదారులకు కట్టబెడుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అత్యంత ప్రమాదకరమైన 4 లేబర్‌ కోడ్లను అమలు చేయడంతోపాటు విద్యుత్‌ సవరణ చట్టం, విత్తన బిల్లు, వీబీ-జీ రామ్‌ జీ పథకం, బీమా రంగంలోకి 100శాతం విదేశీ పెట్టుబడుల అనుమతి, అణు రంగంలోకి ప్రయివేట్‌ కంపెనీలకు అనుమతినిస్తూ అణు చట్టం చేసిందని తెలిపారు.

అణురంగంలో ప్రయివేట్‌ పెట్టుబడులకు అవకాశం ఇవ్వడమంటే దేశాన్ని ప్రమాదంలోకి నెట్టడమేనన్నారు. వీటికి వ్యతిరేకంగా సీఐటీయూ, తెలంగాణ రైతు సంఘం, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా దశల వారీగా జరిగే ఆందోళనల్లో కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు, ప్రజలు, ప్రజాస్వామిక వాదులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మెదక్‌ జిల్లా వ్యాప్తంగా ఈనెల 8 నుంచి 11వతేదీ వరకు 21 మండలాల్లో కార్మిక, కర్షక పోరుయాత్ర జీపు జాత ప్రచారం చేసుకుంటూ తిరుగుతుందన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ కార్మిక, రైతు, వ్యవసాయ కూలీ, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు బాలమణి, కోశాధికారి కె.నర్సమ్మ, జిల్లా సహాయ కార్యదర్శి సంతోష్‌, నాయకులు దుర్గ, కవిత, అనిల్‌, గంగులు, సాయిలు, ఎల్లమ్మ, నాగరాణి, అజయ్, సత్యం, షౌకత్‌, ఇమ్రాన్‌ అలీ, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.

ప్రజావ్యతిరేక విధానాలను ఉద్యమాలతో తిప్పి కొట్టాలి : సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్‌ మల్లేష్‌
నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో నిర్వహించిన జీపు జాతాను సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్‌ మల్లేష్‌, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వీరేపల్లి వెంకటేశ్వర్లు ప్రారంభించి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలైన లేబర్‌ కోడ్స్‌, వీబీజీ రామ్‌ జీ పథకం, జాతీయ విత్తన, విద్యుత్‌ సవరణ బిల్లుల రద్దుకై జరిగే ఉద్యమాల్లో ప్రజలు భాగస్వాములవ్వాలని కోరారు. ఈ నెల 19న జిల్లా కేంద్రంలో ప్రదర్శనలు సభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి రాగిరెడ్డి మంగారెడ్డి, సీపీఐ(ఎం) మండల కార్యదర్శి మూడవత్‌ రవి నాయక్‌, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు పిల్లుట్ల సైదులు, నాయకులు గోవింద్‌ రెడ్డి, వెనుధర్‌ రెడ్డి, రెడ్యా నాయక్‌ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -