Friday, February 6, 2026
E-PAPER
Homeఎడిట్ పేజివిద్యా పునాదిని దెబ్బతీస్తున్న కేంద్రం

విద్యా పునాదిని దెబ్బతీస్తున్న కేంద్రం

- Advertisement -

కేంద్రం ప్రవేశపెట్టిన యూనియన్‌ బడ్జెట్‌ విద్యారంగాన్ని నిర్వీర్యం చేసేలా ఉన్నది. 2026-27 బడ్జెట్‌లో విద్య మంత్రిత్వ శాఖకు కేటాయింపు చేసినది రూ.1,39,289 కోట్లు కాగా, 2025-26లో ఇది రూ.1,28,650 కోట్లు. నామమాత్రంగా పెరుగుదల ఉన్నా, వాస్తవ (ద్రవ్యోల్బణ సర్దుబాటు చేసిన) వ్యయం స్థిరంగా ఉంది. మొత్తం జీడీపీలో విద్య ఖర్చు సుమారు 3-4శాతం మాత్రమే. ఇది జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపి) సూచించిన ఆరు శాతం లక్ష్యానికి చాలా తక్కువ. కేంద్ర ప్రభుత్వ కేటాయింపు కేవలం జీడీపీలో 0.3శాతం. మొత్తం అంచనా ఖర్చు రూ.53.5 లక్షల కోట్లలో విద్య వాటా సుమారు 2.6శాతం. అనుపాతంగా చూస్తే, జీడీపీ పెరుగుతున్నప్పటికీ విద్యకు ప్రాధాన్యం తగ్గుతోంది.ఇతర దేశాలతో పోలిస్తే ఈ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది.జపాన్‌, చైనా, యునైటెడ్‌ కింగ్‌డమ్‌ వంటి దేశాలు తమ జీడీపీలో ఆరు శాతం లేదా అంతకంటే ఎక్కువను విద్యపై ఖర్చు చేస్తున్నాయి. ఆర్థిక బలం, ఆవిష్కరణలు, సామాజిక స్థిరత్వానికి ప్రజా పెట్టుబడి కీలకమని అవి గుర్తించాయి. కానీ, భారతదేశం విద్యకు తగిన పెట్టుబడి లేకుండా ప్రపంచశక్తిగా మారాలనే ఆశయం బలహీనమైన పునాదిపై నిలబడింది.

2014-15లో ప్రభుత్వ పాఠశాలల సంఖ్య 11,07,101, 2023-24కు వచ్చేసరికి అవి 10,17,660కు తగ్గాయి. దశాబ్దకాలంలో 89,441 ప్రభుత్వ పాఠశాలలు మూసివేయబడ్డాయి. 33 లక్షల మంది విద్యార్థులు ఒక్క ఉపాధ్యాయుడే ఉన్న పాఠశాలల్లో చదువుతున్నారు. ఇంకా చెప్పాలంటే ప్రభుత్వ విద్యాసంస్థలలో తగిన పెట్టుబడి లేకపోవడం వల్ల డ్రాపౌట్‌లు పెరుగుతున్నాయి. ఇప్పటివరకు 65.7 లక్షల మంది పిల్లలు పాఠశాల వ్యవస్థ నుంచి బయటకు వచ్చారు. వీరిలో దాదాపు సగం మంది బాలికలే. ఇది పేదరికం, పాఠశాల మూసివేతలు, మాధ్యమిక పాఠశాలల కొరత, అసురక్షిత ప్రయాణం, ప్రజామద్దతు లేకపోవటం వంటి అంశాలతో సంబంధం కలిగి ఉన్నాయి. ఈ సమస్యను ఎదుర్కొనేందుకు బడ్జెట్‌ 2026లో పునర్‌నమోదు, వారిని స్థిరంగా చేయడం నిలుపుదల సామాజిక మద్దతుకు సమగ్ర వ్యూహం లేదు. ప్రభుత్వ విద్యాసంస్థలను బలపరచడం బదులు, ఎన్‌ఈపికి అనుసంధానమైన అంశాలపై అకాడెమిక్‌ బ్యాంక్‌ ఆఫ్‌ క్రెడిట్స్‌ (ఎబిసి), నేషనల్‌ క్రెడిట్‌ ఫ్రేమ్‌వర్క్‌ (ఎన్‌సిఎఫ్‌ఆర్‌), అపార్‌, పిఎం-శ్రీ దీక్ష వంటి పథకాలపై ఎక్కువగా దృష్టిపెట్టింది.

అదేవిధంగా పబ్లిక్‌-ప్రయివేటు భాగస్వామ్యం(పిపిపి) మోడల్‌ను విద్యలో ముందుకు తీసుకొస్తోంది. ఇది సామర్థ్యం, ఆవిష్కరణ పేరుతో ప్రభుత్వ విద్యాసంస్థలను వాణిజ్యపరంగా మారుస్తోంది. ఖర్చును విద్యార్థులు, వారి కుటుంబాలపై మోపి, ప్రభుత్వవిద్యను ప్రయివేటు లాభాలకు తలుపులు బార్లా తెరుస్తోంది. ఉన్నత విద్యలో అంతర్జాతీయీకరణ, పరిశ్రమ విద్యాసంస్థల భాగస్వామ్యం, వికసిత భారత్‌ శిక్షా అధిష్ఠాన్‌(విబిఎస్‌ఎ) బిల్లుతో ”తీవ్రమైన కేంద్రీకరణ” ద్వారా నియంత్రణ వ్యవస్థ ప్రతిపాదన ఇవన్నీ అధిక కేంద్రికరణను, మార్కెట్‌ దృక్పథాన్ని సూచి స్తున్నాయి. ప్రజాపెట్టుబడికి బదులు నియంత్రణ పునర్వ్యవస్థీకరణకు ప్రాధాన్యమిస్తూ, ప్రజాస్వామ్య నియంత్రణను, సంస్థాగత స్వతంత్రతను బలహీనపరుస్తున్నాయి.ఈ నిర్లక్ష్యం పాఠశాలలు, విశ్వవిద్యాలయాలకే పరిమితం కాదు. ఐసిడిఎస్‌, మధ్యాహ్న భోజన పథకం వంటి పునాది సంక్షేమ విద్యావ్యవస్థలకూ విస్తరించింది. సక్షమ్‌ అంగన్‌వాడి – పోషణ్‌ 2.0కు 2026-27లో కేటాయింపు రూ.23,100 కోట్లు మాత్రమే (గత సంవత్సరం రూ.21,960 కోట్లు). పోషకాహార ఖర్చు ప్రమాణాలు పెరుగుతాయని హామీనిచ్చినా, ఇది రోజుకు ఒక్కరికి కేవలం 38 పైసల పెరుగుదల మాత్రమే. ఇంకా 3.38 లక్షల అంగన్‌వాడీ కేంద్రాలకు తాగునీటికే దిక్కులేదు. 4.61 లక్షలకు మరుగుదొడ్లు లేవు.

ఇది బాల్య విద్య, పోషణ పునాదినే దెబ్బతీస్తోంది. అలాగే దేశంలో ఉన్నత విద్యను అభివృద్ధి చేయకపోవడంతో విద్యార్థులు అమెరికా, ఆస్ట్రేలియా, జార్జియా, చైనా, యు.కె. లాంటి దేశాలు వలసలు పోతున్నారు. దీని గురించి కనీస ప్రస్తావన బడ్జెట్‌లో లేదు. ఈ బడ్జెట్‌ విద్యను సామాజిక హక్కుగా కాకుండా మార్కెట్‌ ఆధారిత సేవగా మార్చుతోంది. నైపుణ్యాలు, క్రెడిట్లు, ఉద్యోగయోగ్యతకు ప్రాధాన్యమిస్తూ, ప్రజా పెట్టుబడి, ఉపాధ్యాయ నియామకాలు, సామాజిక రక్షణను పక్కన పెట్టింది. సంకుచితమవుతున్న ప్రభుత్వ పాఠశాలలు, ఒక్క ఉపాధ్యాయుడే ఉన్న తరగతులు, భారీ డ్రాపౌట్‌లు, వాణిజ్యీకరించిన సంస్థలు, పెరుగుతున్న సామాజిక విభేదాలపై అభివృద్ధి చెందిన భారత్‌ నిర్మించలేం. వికసిత భారత్‌ నినాదం కేవలం మాటలకే పరిమితం కాకుండా ఉండాలంటే, ప్రజావిద్యను మళ్లీ సార్వత్రిక హక్కుగా గుర్తించి జాతీయ ప్రాధాన్యతగా పెట్టాలి. లేకపోతే, భారత వృద్ధి విస్తృతంగా కనిపించినా పునాదులు బలహీనంగానే ఉంటాయి.

టి.నాగరాజు 9490098292

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -