Monday, December 29, 2025
E-PAPER
Homeజాతీయంకేరళపై కేంద్రం కత్తి

కేరళపై కేంద్రం కత్తి

- Advertisement -

సంక్షేమ పింఛన్‌ నిధుల విడుదలలో నిర్లక్ష్యం
మోడీ సర్కారు తీరుతో రాష్ట్రంపై ఆర్థిక భారం
లబ్దిదారుల పైనా తీవ్ర ప్రభావం

న్యూఢిల్లీ : కేరళపై కేంద్రం కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నది. రాష్ట్రం లోని లక్షలాది మంది పింఛన్‌దారుల జీవనాధారాన్ని ప్రభావితం చేస్తూ.. కేంద్రం తన వాటా సంక్షేమ పింఛన్‌ నిధులను విడుదల చేయకుండా ఆలస్యం చేస్తున్నది. అయితే పింఛన్‌ లబ్దిదారులకు ఇబ్బంది కలగకూడదని కేరళ ప్రభుత్వమే కేంద్రం వాటాను ముందుగానే సమకూర్చినా.. దానిని కూడా లబ్దిదారులకు చేర్చలేక పోతున్నది. ఇందుకు వ్యవస్థలో సాంకేతిక సమస్యలను కారణాలుగా పేర్కొంటున్నది. ఇది కేరళను, రాష్ట్రం లోని లబ్దిదారులను ఆర్థికంగా ఉక్కిరి బిక్కిరి చేసే చర్యగా విమర్శకులు దీనిని అభివర్ణిస్తున్నారు.

డిసెంబర్‌లో రూ.24.75 కోట్లు
డిసెంబర్‌ నెలకు సంబంధించి కేంద్రం వాటాగా ఇవ్వాల్సిన రూ. 24.75 కోట్లు ఇప్పటి వరకూ పింఛన్‌ లబ్దిదారుల ఖాతాల్లోకి జమ కాలేదు. ఈ మొత్తాన్ని కేరళ ప్రభుత్వం ముందుగానే కేటాయించి.. 8,46, 456 మంది పింఛన్‌దారుల కోసం బదిలీ చేసింది. అయినా కేంద్రం నుంచి డబ్బు బదిలీకాకపోవడంతో వృద్ధులు, వికలాంగులు, వితంతువులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తన వాటాను మాత్రం సమయానికి చెల్లించింది. అయితే కేంద్రం తన బాధ్యతను నెరవేర్చక పోవడంపై తీవ్ర విమర్శలకు దారి తీస్తున్నది.

సకాలంలో జమ కాని కేంద్రం వాటా
గతంలో రాష్ట్ర ప్రభుత్వం మొత్తం పింఛన్‌ నిధులను చెల్లించి.. దానిని తర్వాత కేంద్రం నుంచి రీయింబర్స్‌మెంట్‌ ద్వారా పొందేది. కానీ ఏప్రిల్‌ 2023 నుంచి కేంద్రం పబ్లిక్‌ ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ (పీఎఫ్‌ఎంఎస్‌) ద్వారా నేరుగా డబ్బు పంపుతామని చెప్పింది. అయితే ఈ విధానం అమలులోకి వచ్చినప్పటి నుంచి కేంద్ర వాటా ఒక్కసారి కూడా సమయానికి జమకాలేదు. ప్రతీసారి సాంకేతిక లోపాలు అనే కారణాలే వినిపిస్తున్నాయి. దీంతో లబ్దిదారులకు నష్టం జరగకూడదని కేంద్రం వాటాను కూడా ముందే విడుదల చేయాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది.

సాంకేతిక లోపాలంటూ…
పీఎఫ్‌ఎంఎస్‌ వ్యవస్థ ప్రకారం కేంద్రం చెల్లించాల్సిన వాటాను పింఛన్‌దారులకు బదిలీ చేయడానికి కేరళ రాష్ట్ర ప్రభుత్వం రూ.24.75 కోట్లను తన పీఎఫ్‌ఎంఎస్‌ యూనిట్‌ ఖాతాలో జమ చేసింది. ఈ ఖాతా నుంచే ప్రతి పింఛన్‌దారు ఖాతాలోకి కేంద్రం వాటా వెళ్లాల్సి ఉంటుంది. అయితే పీఎఫ్‌ఎంఎస్‌ అధికారులు ‘సాంకేతిక లోపాలు’ ఉన్నాయంటూ ఆ మొత్తాన్ని సరిగ్గా పంపిణీ చేయడంలో విఫల మయ్యారని సమాచారం. దీంతో లబ్దిదారులకు పింఛన్‌ అందలేదు. ఇలాంటి పరిస్థితి గత కొన్ని నెలలుగా పునరావృతమవుతోంది.

సంక్షేమ పథకాల అమలులో రాజకీయ జోక్యం
ఈ ఆలస్యం కేవలం కేంద్రం నిర్లక్ష్యం మాత్రమే కాదనీ, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను కొనసాగించలేని పరిస్థితిని సృష్టిస్తున్నదని రాజకీయ విశ్లేషకులు విమర్శిస్తున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వంపై మాత్రమే కాకుండా సామాన్య ప్రజల పైనా ఒత్తిడి పెరుగుతోందని అంటున్నారు. కేరళ సామాజిక సంక్షేమ విధానాలను అణచివేయాలనే ప్రయత్నంగా, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆర్థికంగా దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే ఈ చర్యలకు కేంద్రం పాల్పడుతున్నదన్న భావన రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నది. దీంతో సంక్షేమ నిధుల పంపిణీలో రాజకీయ జోక్యం పెరుగుతోందన్న ఆందోళనలు తలెత్తుతున్నాయి.

కేరళకు కేంద్రం రూ.265 కోట్లు బకాయి
కేంద్రం.. రాష్ట్రానికి చెల్లించాల్సిన నిధులను సకాలంలో తిరిగి చెల్లించకపోవడం తో కేరళపై ఆర్థిక భారం మరింత పెరిగింది. ఈ నిధులు రాష్ట్రా నికి చేరుకోవడానికి సంవత్సరాలు పడుతోంది. ప్రస్తుతం వివిధ సంక్షేమ పింఛన్‌ పథకాల కింద కేంద్రం నుంచి కేరళకు రూ.265 కోట్లు రావాల్సి ఉన్నది. ఈ మొత్తాన్ని ఇప్పటి వరకూ చెల్లించక పోవడంతో రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -