Saturday, January 17, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంప్రజావ్యతిరేక చట్టాలను కేంద్రం రద్దు చేయాలి

ప్రజావ్యతిరేక చట్టాలను కేంద్రం రద్దు చేయాలి

- Advertisement -

ఎస్కేఎం, టీయూ నాయకుల పిలుపు
సంయుక్త కిసాన్‌ మోర్చా ఆధ్వర్యంలో నిరసన

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రజా వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చేయాలని సంయుక్త కిసాన్‌ మోర్చా, కార్మిక సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని నారాయణగూడ చౌరస్తాలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సంయుక్త కిసాన్‌ మోర్చా రాష్ట్ర కన్వీనర్లు టీ సాగర్‌, పశ్య పద్మ, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌ వెంకట్రాములు, జక్కుల వెంకటయ్య, తుకారాం నాయక్‌, విజయ్ మాట్లాడుతూ… నాలుగు లేబర్‌ కోడ్‌లు, విద్యుత్‌ సవరణ బిల్లు, విత్తన చట్టం, వీబీ జీ రామ్‌ జీ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. విద్యుత్‌ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు తెలపాలనీ, నల్ల జెండాలు, నల్ల బ్యాడ్జీలతో జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేయాలని పిలుపునిచ్చారు.

మోడీ పాలనలో కార్పొరేట్‌ సంస్థలకు రూ. 18 లక్షల కోట్లు రాయితీలు ఇచ్చినట్టు ఎత్తిచూపారు. చివరికి ప్రభుత్వ రంగ సంస్థలను అదానీ, అంబానీలకు కట్టబెడుతున్నదని విమర్శించారు. అత్యంత ప్రమాదకరమైన లేబర్‌కోడ్‌లను అమలు చేసి కార్మికుల హక్కులను కాలరాయడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. జాతీయ విత్తన బిల్లు ద్వారా రైతులకు నష్టదాయకమని హెచ్చరించారు. విత్తనంపై అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు లేకుండా కేంద్రమే తన ఇష్టానుసారంగా బడా కార్పొరేట్లకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నదని విమర్శించారు. వామపక్ష పార్టీల పోరాటాల ఫలితంగా వచ్చిన ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసి వికసిత్‌ భారత్‌ జీ రామ్‌ జీ చట్టాన్ని తేవడాన్ని తప్పుబట్టారు. కేంద్రం తన వాటాను తగ్గించుకోవడమంటే రాష్ట్రాలపై ఆర్థిక భారం మోపడమేనని తెలిపారు. ఆ చట్టం పేరులో నుంచి మహాత్మా గాంధీ పేరును తొలగించడం దుర్మార్గమన్నారు.

రాజ్యాంగం రీత్యా విద్యుత్‌ ఉత్పత్తి రాష్ట్రాల జాబితాలోనిదనీ, విద్యుత్‌ సవరణ చట్టంతో దానిపై హక్కులను రాష్ట్రాలు కోల్పోతాయని తెలిపారు. ఇక నుంచి విద్యుత్‌ ఉత్పత్తి, సరఫరా, పంపిణీ బాధ్యతలు కేంద్రం చేతుల్లోకి వెళ్లిపోతాయనీ, విద్యుత్‌ రెగ్యులెటరీ కమిషన్లు చార్జీలు పెంచుతాయని అన్నారు. ఉచిత విద్యుత్‌, క్రాస్‌ సబ్సిడీలు కొత్త చట్టంతో ఎగిరిపోతాయనీ, స్మార్ట్‌ మీటర్లు పెట్టి ముందుగానే చార్జీలు వసూలు చేస్తారని హెచ్చరించారు. ప్రభుత్వ రంగ సంస్థల్లోకి వంద శాతం విదేశీ పెట్టుబడులను ఆహ్వానిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేయడాన్ని తప్పుబట్టారు. విదేశీ బహుళ జాతి కంపెనీలకు మన ఇన్సూరెన్స్‌ రంగాన్ని అప్పగించే కుట్ర దీని వెనుక ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాసంఘాల నాయకులు జె.వెంకటేశ్‌, భూపాల్‌, వంగూరు రాములు, ఈశ్వర్‌ రావు, బొప్పని పద్మ, శంకర్‌, మూడ్‌ శోభన్‌, ఆర్‌ శ్రీరామ్‌ నాయక్‌, ఎం ధర్మానాయక్‌, కోట రమేష్‌, ఎం.వెంకటేష్‌, ఎం.దశరథ్‌, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -