ఈ నెల 19న రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన
కేంద్ర ప్రభుత్వానికి ప్రజా సంఘాల హెచ్చరిక
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎమ్‌జీఎన్‌ఆర్‌ఈజీఏ) స్థానంలో ‘వికసిత్ భారత్-గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవిక మిషన్ (వీబీ-జీ రామ్‌జీ) పేరుతో తీసుకు రాబోతున్న స్కీంను వెంటనే ఉపసంహరించుకోవాలని పలు ప్రజాసంఘాల నాయకులు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బుధవారం హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేంద్ర సర్కార్ తీరును వారు తప్పు పట్టారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బి.ప్రసాద్ మాట్లాడుతూ కేంద్రం తీరుకు నిరసనగా ఈ నెల 19న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో కొత్త బిల్లు ప్రతులను దగ్డం చేయాలని పిలుపు నిచ్చారు. పేదలకు అండంగా ఉన్న ఈ పథకాన్ని క్రమంగా ఎత్తేసేందుకే గతంలో ఉన్న కేంద్రం వాటాను 90 శాతం నుంచి 60 శాతానికి తగ్గించారని విమర్శించారు. ఏటా రాష్ట్రంలో 45 లక్షల మంది కూలీలు ఈ చట్టం ద్వారా ఉపాధి పొందుతున్నారని గుర్తు చేశారు. డిజిటల్ జాబ్ కార్డు, బ్యాంక్ ఆధార్ లింక్ పేరిట ఇప్పటికే దేశంలో 7 కోట్ల మంది కూలీల కార్డులు తొలగించారని ఆందోళన వ్యక్తం చేశారు.
వీబీ జీ రామ్ పేరు మార్పు ద్వారా గ్రామాల్లో ఆర్‌ఎస్‌ఎస్ భావజాలాన్ని వ్యాపింప జేసే కుట్ర కోణం కూడా దాగుందని వ్యాఖ్యానించారు. దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి పి.శంకర్ మాట్లాడుతూ వ్యవసాయ సీజన్‌లో 60 రోజులు పని కల్పించకూడదని కొత్త స్కీంలో ఉందనీ, ఇది కూలీల ఉపాధిపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టిన వీబీ జీ రామ్ బిల్లును స్టాండింగ్ కమిటీకి పంపాలని డిమాండ్ చేశారు. రైతు స్వరాజ్ వేదిక నాయకులు కన్నెగంటి రవి మాట్లాడుతూ కొత్త బిల్లువల్ల ఏ రాష్ట్రంలో ఏఏ పనులు చేపట్టాలనే పూర్తి అధికారం కేంద్రం చేతుల్లోకి పోతుందని అన్నారు. విపక్ష రాష్ట్రాలకు కేంద్రం సరైన పనులు కల్పించకుండా కక్ష్యసాధింపు చర్యలకు పాల్పడే అవకాశం ఉందని హెచ్చరించారు. తెలంగాణలో ప్రస్తుతం పొందుతున్న రూ.175 కనీస వేతనం, సగటున 45 పని దినాలు కూడా కొత్త స్కీం వల్ల కూలీలు కోల్పోతారని అన్నారు. ఉపాధికి తూట్లు పొడిచేలా తీసుకొస్తున్న కొత్త బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీపుల్స్ మానిటరింగ్ కమిటీ రాష్ట్ర కన్వీనర్ ఎస్.శివలింగం, డీబీఎఫ్ నాయకురాలు పి.కల్పన, క్లైమెట్ ఫ్రంట్ నాయకులు రుచిత్, అఖిల్ సూర్య తదితరులు పాల్గొన్నారు.
వీబీ-జీ రామ్ బిల్లును కేంద్రం ఉపసంహరించుకోవాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



