అదానీ, అంబానీల కోసమే ఆ చట్టానికి తూట్లు
పనుల్లో దేశంలోనే తెలంగాణ ముందంజ
కరోనా కాలంలో పేదలకు ఆసరాగా నిలిచింది : ఉపాధి హామీ చట్టంపై చర్చలో మంత్రి సీతక్క
దేశానికి ఏంచేయనివారు చట్టాన్ని నాశనం చేస్తున్నారు:డిప్యూటీ సీఎం భట్టి
గాంధీ పేరు మార్చాల్సిన అవసరమేంటి? : కూనంనేని
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్య హేయమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ(సీతక్క) ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పొరేట్లయిన అదానీ, అంబానీల కోసమే మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తూట్లు పొడుస్తున్నదని విమర్శించారు. ఈ చట్టాన్ని రద్దుచేసి వీబీజీరామ్‌జీ పథకంగా మార్చడాన్ని ఖండించారు. కోట్లాదిమంది ప్రజల పొట్టనింపుతున్న ఉపాధి హామీ చట్టంలో మార్పులు చేయడం ద్వారా కేంద్రం పేదలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నదని చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఉపాధి హామీ చట్టం తీర్మానంపై ఆమె మాట్లాడారు.
కరోనా సమయంలో ప్రజల్ని పట్టణం పొమ్మంటే, పల్లె కన్నతల్లిలా ఆదరించి, అక్కునచేర్చుకుందన్నారు. ఉపాధి హామీ పథకం వల్లే పేదలకు ఆకలి తీరిందని గుర్తుచేశారు. వలసలు, పేదరికం, వేతనాల మధ్య అంతరాన్ని ఈ పథకం పూడ్చివేసిందన్నారు. హక్కుగా వచ్చే పనులను మోడీ సర్కారు బిక్షగా మార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. 100 రోజుల పనిని 125 రోజులకు పెంచామంటూ కేంద్రం చెబుతున్నా, నిధులు ఇవ్వకుండా అది ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. 20 ఏండ్లుగా కూలీలకు బేరమాడే శక్తిని కల్పించలేదన్నారు. దాదాపు 90 శాతం లబ్దిదారులు ఎస్సీ, ఎస్సీ, బీసీలేనని వివరించారు. ఈ పథకం కింద వేతనాలు పొందేవారిలో 62 శాతం మహిళలేనని గుర్తుచేశారు.
నీటిసంరక్షణ, సాగునీరు, భూమి అభివృద్ధి, నర్సరీలు, ఉద్యానవనాలు వంటి హరిత పనులను జరిగాయని చెప్పారు రాష్ట్రంలోని 31 జిల్లాల్లో 565 గ్రామీణ మండలాల్లో 12760 గ్రామాల్లో ఉపాధి పనులు జరిగాయని తెలిపారు. దాదాపు కోటి మందికి వర్తించేలా 50 లక్షల జాబ్‌కార్డులు జారీచేసినట్టు వివరించారు. ఉమ్మడిరాష్ట్రంలో తెలంగాణ జిల్లాల్లో 90 కోట్ల పనిదినాలకుగాను రూ. 12,719 కోట్లు ఖర్చయిందని చెప్పారు. గ్రామపంచాయతీల్లో బడ్జెట్ తయారు చేసేవిధానం పోయి, కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇస్తేనే పనులు చేసేలా కొత్త విధానం వచ్చిందన్నారు. పేదలకు వ్యతిరేకంగా ఉన్న చట్టాన్ని అందరూ వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు.
కేంద్రం తెచ్చిన 60:40 నిష్పత్తి విధానాన్ని వెంటనే ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. కొత్త చట్టంలో ఆచరణ సాధ్యంకాని విధంగా ఉన్న 125 రోజుల పనిదినాలు, 65 రోజుల ఉపాధి హాలీడే, కేంద్రం బాధ్యతల నుంచి తప్పించుకోవడం సరికాదన్నారు. ఉపాధి హామీ పథకంపై మాట్లాడాల్సి వస్తుందనే బీఆర్‌ఎస్ సభ నుంచి వెళ్లిపోయిందని ఆరోపించారు. బీజేపీ, బీఆర్‌ఎస్ ఒక్కటే ఏజెండా పనిచేస్తున్నాయన్నారు. అందుకే నేటి చర్చలో బీఆర్‌ఎస్ లేదన్నారు. మోడీ మెప్పుకోసమే ఇలా చేశారని ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్ ఫ్యూడల్ మనస్తత్వ పార్టీ అని చెప్పారు. ఉపాధి హామీ చట్టం అమలైన దగ్గరి నుంచి పూర్తి వివరాలు, లెక్కలను సభలో సభ్యులకు ఆమె వివరించారు.
బీజేపీని చరిత్ర క్షమించదు: డిప్యూటీ సీఎం భట్టి
మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టం పేరుతోపాటు విధానాన్ని మార్చడం ద్వారా జాతీపిత గాంధీజీని అవమానిస్తున్నారని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. బీజేపీ ప్రభుత్వాన్ని చరిత్ర క్షమించదని చెప్పారు. దేశానికి ఏం చేశారని చట్టాలను మారుస్తున్నారని ప్రశ్నించారు. దేశ ప్రజల కనీస రోజు కూలీని రూ. 100 చేస్తూ గతంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం చట్టం తెచ్చిందన్నారు. సమాజాన్ని రాజకీయ, సామాజిక, ఆర్థిక పరివర్తన చేసేందుకు గాంధీజీ, నెహ్రు, ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ తమ రక్తాన్ని చిందించారనీ, అది దేశపు భూమి పొరల్లో పారుతున్నదన్నారు.
మాజీ ప్రధాని మన్మోహన్, యూపీఏ చైర్‌పర్సన్ జాతీయ ఉపాధి హామీచట్టానికి ఊపిరి పోశారని గుర్తు చేశారు. జాతిపిత పేరు ఎందుకు మారుస్తున్నారో సమాధానం చెప్పాలని సభలో నిలదీశారు. దేశానికి స్వాతంత్యాన్ని అందించినందుకు గాంధీజీ పేరు తొలగించారా అని ప్రశ్నించారు.
పేదల కోసం కాంగ్రెస్ ప్రభుత్వాలు అనేక చట్టాలు తెచ్చాయని చెప్పారు. భూసంస్కరణ చట్టం, భూపరిమితిచట్టం, తెలంగాణ టెనెన్సీ చట్టం, హిందూ కోడ్ బిల్లు, ఎస్సీ, ఎస్టీ అట్రాసీటీస్ చట్టం, 25 సూత్రాల పథకం, ఆహార భద్రతా చట్టం కాంగ్రెస్ ప్రభుత్వమే తెచ్చిందని గుర్తు చేశారు. అలాగే ప్రాథమిక విద్యా హక్కు చట్టం, సమాచార హక్కు చట్టం కూడా కాంగ్రెస్ తెచ్చిన విషయం తెలియదా? అని అడిగారు. చట్టాలపై బీజేపీ అవగాహన పెంచుకోవాలన్నారు. స్వాతంత్య్రం వచ్చిన ఆరు నెలల్లోపే గాంధీజీని చంపిన వారి ఆలోచనా విధానాన్ని అమలుచేస్తారా అంటూ అగ్రహం వ్యక్తం చేశారు. వీబీజీ రామ్‌జీ పథకాన్ని అందరూ వ్యతిరేకించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామ్య దేశంలో కనీసం రాష్ట్రాలతో సంప్రదించకుండా ఆరునెలల్లోపు చట్టం చేయాలనడం సరికాదన్నారు. 60:40 నిష్పత్తిలో నిధులు ఖర్చుచేయాలంటూనే పథకం నిబంధనలు పూర్తిగా మార్చిందన్నారు.
దుర్మార్గంగా రద్దుచేశారు:కూనంనేని
దేశంలో జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం దుర్మార్గంగా రద్దుచేసిందని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు వ్యాఖ్యానించారు. గాంధీజీని చంపిన వాళ్లే ఇప్పుడు ఆయన పేరు కూడా లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్‌తో అనేక భిన్నాభిప్రాయాలు ఉన్నా ఈ విషయంలో బీజేపీని వ్యతిరేకిస్తానన్నారు. చట్టాన్ని రద్దుచేసి ఇప్పుడు బీజేపీ సభ్యులు మతపరమైన చర్చ చేస్తారా ? అని అడిగారు. చట్టంలో లోపాలు ఉంటే సరిచేయండి, పేరు మార్చడం సరికాదన్నారు. జీఎస్టీ పేర రాష్ట్రాలను కొల్లగొడుతున్నారని అన్నారు.
పథకాన్ని బలోపేతం చేస్తున్నాం:మహేశ్వర్‌రెడ్డి
ఉపాధి హామీ పథకాన్ని బలోపేతం చేసేందుకే కొత్త పేరుతో విధానాన్ని కేంద్ర ప్రభుత్వం మార్చిందని బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి అన్నారు. పథకం ద్వారా 100 రోజులుగా ఉన్న పనిదినాలను 125 రోజులకు పెంచినట్టు చెప్పారు. ఈ చర్చలో ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాసరెడ్డి, ఎడ్మా బుజ్జి, మందుల సామేల్, మీర్ జుల్పీకర్ అలీ తదితరులు పాల్గొన్నారు.
నేను ఉపాధి కూలీనే: ఎడ్మా బుజ్జి
తాను ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నా, ఒకప్పుడు ఉపాధి హామీ పనులకు వెళ్లాననీ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎడ్మా బుజ్జి చెప్పారు తాను చదువుకునేటప్పుడు తన తల్లిదండ్రులు ఉపాధి హామీ పనులు చేసి చదివించారని గుర్తు చేశారు. పని కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడు ఉపాధి పనులు మన ఊళ్లోనే దొరుకుతున్నాయనీ, మన ఊరికి రావాలని కోరటంతో గ్రామానికి వెళ్లి ఆ పనులు చేశానని చెప్పారు. అనేక కష్టాలు పడి ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యాయని వివరించారు.



