సాహిత్య అకాడెమీ అవార్డుల ప్రకటన రద్దు అందులో భాగమే
‘సమీక్ష’లతో అవార్డు విలువ పోతుందని సాహితీవేత్తల ఆవేదన
న్యూఢిల్లీ : సాహిత్య అకాడెమీ చరిత్రలోనే తొలిసారిగా గత వారం అవార్డుల ప్రకటన కార్యక్రమాన్ని నాటకీయంగా రద్దు చేసిన విషయం తెలిసిందే. గత దశాబ్ద కాలంగా కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థలపై దాడి చేస్తూనే ఉంది. సాహిత్య అకాడెమీ ఉదంతం దానికి తాజా ఉదాహరణ. అకాడెమీ ప్రతి ఏటా 24 భాషలలో ప్రతిష్టాత్మక అవార్డులు ప్రకటిస్తుంది. సంప్రదింపుల అనంతరం వివిధ భాషలకు చెందిన జ్యూరీలు అవార్డు విజేతలను ఖరారు చేస్తారు. ఈసారి కూడా అలాగే జరిగింది. అవార్డు గ్రహీతల జాబితాను అకాడెమీ ఎగ్జిక్యూటివ్ బోర్డు ఆమోదించింది కూడా. ఈ నెల 18న పాత్రికేయుల సమావేశంలో వారి పేర్లను ప్రకటించాల్సి ఉంది. అందుకు అన్ని ఏర్పాట్లు జరిగాయి. కానీ చివరి నిమిషంలో సమావేశం రద్దయింది. అవార్డులపై పున్ణసమీక్ష జరపాలంటూ కేంద్ర సాంస్కృతిక శాఖ నుంచి హడావిడవగా సర్క్యులర్ రావడమే దీనికి కారణం.
ఇరకాటంలో పడిన హోల్కర్
అవార్డు గ్రహీతల జాబితాను పున్ణసమీక్షించి, మంత్రిత్వ శాఖ అనుమతి పొందే వరకూ ప్రకటన ప్రక్రియ జరగబోదని సర్క్యులర్‌లో స్పష్టం చేశారు. దీంతో అటు అకాడెమీ, ఇటు జ్యూరీలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విజేతలను ప్రతి భాషకూ చెందిన ప్రత్యేక జ్యూరీ ఎంపిక చేస్తుంది. ప్రతి జ్యూరీకి ఒక కన్వీనర్ నేతృత్వం వహిస్తారు. అకాడెమీ కార్యదర్శి పల్లవి ప్రశాంత్ హోల్కర్ ఈ జ్యూరీలను ఏర్పాటు చేశారు. అకాడెమీపై నియంత్రణ కోసమే మంత్రిత్వ శాఖ ఆమెను ఆ స్థానంలో నియమించిందని అందులోని అధికారులు అంటున్నారు. హోల్కర్ 2011 బ్యాచ్‌కి చెందిన ఇండియన్ ఆడిట్-అకౌంట్స్ సర్వీసెస్ అధికారిణి. మంత్రిత్వ శాఖ జారీ చేసిన తాజా సర్క్యులర్ అందరి కంటే ఎక్కువగా హోల్కర్‌నే ఇబ్బంది పెట్టింది. ఎందుకంటే కార్యక్రమం గురించి ఆమె పేరుతోనే పత్రికలకు ప్రకటన విడుదల చేశారు. విజేతలను ప్రకటించాల్సింది కూడా ఆమే.
ఈ ప్రశ్నలకు బదులేది?
అవార్డుల ప్రక్రియ జనవరిలోనే ప్రారంభమైంది. అంటే జూలైలో అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదరడానికి ఆరు నెలల ముందే ఇది మొదలైందన్న మాట. అలాంటప్పుడు అవార్డుల పున్ణసమీక్ష కోసం ఎలాంటి ప్రతిపాదనలు చేయకూడదు. ఇక్కడ మరో విషయాన్ని కూడా గమనించాల్సి ఉంది. ప్రకటన వెలువడాల్సిన రోజే సర్క్యులర్ జారీ చేశారు. స్వయం ప్రతిపత్తి కలిగిన ఒక సంస్థ వ్యవహారాలలో జోక్యం చేసుకోవడానికి అంత తొందర ఎందుకని రాజకీయ విశ్లేషకులు, విద్యావేత్తలు ప్రశ్నిస్తున్నారు. అదీకాక పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేసింది అకాడెమీ కార్యదర్శి. అకాడెమీలో కార్యదర్శి మంత్రిత్వ శాఖ శాశ్వత ప్రతినిధిగా వ్యవహరిస్తారు. అలాంటప్పుడు కార్యదర్శికి కూడా కార్యక్రమం రద్దు విషయం తెలియదా అన్న ప్రశ్న తలెత్తుతోంది. సమావేశం ఉంటుందని ప్రకటించిన 24 గంటలకే దానిని రద్దు చేయడానికి అనుమతి ఇచ్చిందెవరు?
సాహిత్య అకాడెమీ లక్ష్యంగా…
అకాడెమీ జారీ చేసిన సర్క్యులర్ నాలుగు సంస్థలను.. లలిత కళా అకాడెమీ, సంగీత నాటక అకాడెమీ, సాహిత్య అకాడెమీ, నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా…ఉద్దేశించి జారీ చేసిందే అయినప్పటికీ అది కేవలం సాహిత్య అకాడెమీని లక్ష్యంగా చేసుకొని ఇచ్చిందేనని అర్థమవుతోంది. అయితే అలాంటిదేమీలేదని, అది ఓ విస్తృత ప్రక్రియ అని నమ్మిం చేందుకు మంత్రిత్వశాఖ ప్రయత్నించింది. అయితే ఆ నాలుగు సంస్థల్లో ఒకటైన నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ఎలాంటి వార్షిక అవార్డులు ఇవ్వదన్న విషయాన్ని విస్మరించింది.
పెత్తనం కోసమే…
సాంస్కృతిక శాఖకు ఏ అవార్డు గ్రహీత విషయం లోనూ అభ్యంతరం లేదని, అవార్డు ప్రక్రియను, అవార్డు గ్రహీతల ఎంపికను నియంత్రించాలన్న ఉద్దేశంతోనే ఈ పని చేసిందని అకాడెమీ అధికారులు కొందరు తెలిపారు. మంత్రిత్వ శాఖ తీసుకున్న చర్య అకాడెమీ స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అకాడెమీకి మంత్రిత్వ శాఖ నిబంధనలను నిర్దేశించగలదని, ఏ దశలో అయినా ప్రక్రియను అడ్డుకోగలదని రుజువైందని చెప్పారు. వాస్తవానికి గత దశాబ్ద కాలంలో అకాడెమీ తన ప్రతిష్టను కోల్పోతూ వచ్చింది. రచయితలు సైతం దానిపై ఆరోపణలు చేశారు. 2015లో కొందరు అవార్డు వాపసీ ప్రచారాన్ని చేపట్టారు. సాంస్కృతిక శాఖ పరిధిలోని సంస్థ లు తమ బడ్జెట్‌లో 25-30 శాతాన్ని సొంతగానే సమకూ ర్చుకోవాలని, తద్వారా ఆర్థిక స్వావలంబన సాధించాలని మోడీ ప్రభుత్వం కోరుకుంది. దీన్ని ఆయా సంస్థలలో పనిచేస్తున్న అధికారులు వ్యతిరేకించారు. ఎందుకంటే నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా, సంగీత నాటక అకాడెమీలకు సొంతంగా ఆర్థిక వనరులు సమకూర్చుకునే సామర్ధ్యం లేదు. అవార్డుల ఎంపిక ప్రక్రియను తిరిగి సమీక్షించుకుంటూపోతే వాటికి ఉన్న విలువ పోతుందని సాహితీవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు.



