Monday, January 5, 2026
E-PAPER
Homeతాజా వార్తలుకేంద్ర ప్రభుత్వ కార్పొరేట్‌, మతోన్మాద విధానాలను తిప్పికొట్టాలి

కేంద్ర ప్రభుత్వ కార్పొరేట్‌, మతోన్మాద విధానాలను తిప్పికొట్టాలి

- Advertisement -

– ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్న వీబీ జీ రామ్‌ జీ బిల్లు
– రద్దు అయ్యేవరకు పోరాటం చేయాలి
– సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు టి.జ్యోతి, : ఎన్‌పీఆర్‌డీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.అడివయ్య
నవతెలంగాణ – ముషీరాబాద్‌

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్పొరేట్‌, మతోన్మాద విధానాలను తిప్పికొట్టాలని, ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసే వీబీజీరామ్‌జీ బిల్లు రద్దు అయ్యేవరకు పోరాటం చేస్తామని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు టి.జ్యోతి, ఎన్‌పీఆర్‌డీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.అడివయ్య అన్నారు. అంధుల అక్షర ప్రధాత లూయిస్‌ బ్రెయిలీ 217వ జయంతి సందర్భంగా వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్‌పీఆర్‌డీ) తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ‘కేంద్ర ప్రభుత్వ విధానాలు- వికలాంగులపై ప్రభావం’ అనే అంశంపై సెమినార్‌ నిర్వహించారు. ముందుగా లూయిస్‌ బ్రెయిలీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళ్లు అర్పించారు. అనంతరం సంఘం రాష్ట్ర కోశాధికారి ఆర్‌.వెంకటేష్‌ అధ్యక్షతన జరిగిన సెమినార్‌లో జ్యోతి మాట్లాడారు. పెట్టుబడిదారుల కోసం కేంద్ర ప్రభుత్వం సంస్కరణలను వేగంగా అమలు చేస్తోందన్నారు. శ్రమ శక్తి నీతి 2025 పేరుతో కార్మికుల ప్రయోజనాలను పెట్టుబడిదారులకు తాకట్టు పెడుతుందని విమర్శించారు. 2025 పార్లమెంట్‌ సమావేశాల్లో విద్యుత్‌ ఉత్పత్తి రంగంలో ప్రయివేట్‌ సంస్థలకు అవకాశాలు కల్పిస్తూ చట్టం చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. బీమా రంగంలో 100 శాతం విదేశీ పెట్టుబడులను ఆహ్వానించిందని తెలిపారు.

గ్రామీణ ప్రాంతంలో ప్రజలకు జీవనోపాధి కల్పిస్తున్న ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ కేంద్రం తెచ్చిన వీబీ జీ రామ్‌ జీ బిల్లు ఉపాధి కూలీల హక్కులను హరిస్తుందని అన్నారు. మహాత్మా గాంధీ పేరును మార్చి జీ రామ్‌ జీ పేరుతో బిల్లు తేవడం ఎవరి ప్రయోజనాలకోసమని అన్నారు. ఇప్పటి వరకు గ్రామీణ ఉపాధి హామీ చట్టబద్ధమైన హక్కుగా ఉందని, కొత్తగా పథకంగా మార్చిందని, దీనివల్ల ఇది దేశవ్యాప్తంగా అమలు కాదని, కేంద్ర ప్రభుత్వం నోటిఫైడ్‌ చేసిన ప్రాంతాలకే పరిమితం అవుతుందన్నారు. దాంతో రాష్ట్ర ప్రభుత్వాల దయ దక్షిణ్యాలపై ఆధారపడి ఉపాధి కూలీలు పని కోసం ఎదురుచూడాల్సిన దుస్థితి ఏర్పడుతుందన్నారు. ఉపాధి కూలీలకు కల్పిస్తున్న పని దినాలు 51.6 రోజుల కంటే ఎక్కువ లేవనే విషయం కేంద్ర ప్రభుత్వానికి తెలియదా అని ప్రశ్నించారు. 100 రోజులు పని దినాలు పూర్తి చేసిన కుటుంబాలు 11 శాతానికి మించి లేవన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం వల్ల గ్రామీణ ప్రాంతంలోని వికలాంగులు, ఒంటరి మహిళలు, వృద్ధులు, ఆదివాసులు, పేదప్రజలు నష్టపోతారని అన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ సంస్థల్లో మతోన్మాద భావజాలన్ని జోప్పిస్తోందన్నారు. రాజ్యాంగ బద్ధ సంస్థలను తమ జేబు సంస్థలుగా మార్చుకుంటుందని అన్నారు. మతం ఆధారిత పరిపాలన చేయడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్దమని తెలిపారు.

అనంతరం ఎం. అడివయ్య మాట్లాడుతూ.. లూయిస్‌ బ్రెయిలీ అంధుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు కృషి చేశారని తెలిపారు. బ్రెయిలీ కనుగొన్న లిపి నేడు ప్రపంచంలో అంధులకు చదువుకునే అవకాశం కల్పించిందన్నారు. దేశంలో 550 మిలియన్స్‌ మందికి కంటి చూపు సమస్య ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేసిందన్నారు. మహిళల్లో 67 శాతం మందికి దృష్టి లోపం ఉంటే 40 శాతం మందికి వైద్యం అందడం లేదని తెలిపారు. ప్రతి ఏడాది 30,000 మంది దృష్టి లోపంతో బాధపడుతున్నారు. జిల్లా కేంద్రాల్లో నాణ్యత కలిగిన సమగ్ర నేత్ర సంరక్షణను అందించడానికి మానవ వనరులు, మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలని తెలిపారు. బ్రెయిలీ లిపిని విస్తృతం చేసి, ప్రభుత్వ సమాచారం బ్రెయిలీలో కూడా అందుబాటులోకి తేవాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన పెన్షన్‌ పెంపు హామీ అమలు చేయకుండా వికలాంగులను మోసం చేస్తుందన్నారు. పెన్షన్‌ పెంచకుండా చేయూత పెన్షన్స్‌ రద్దు చేస్తున్నారని.. దీనికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర కమిటీ సభ్యులు జెర్కొని రాజు, రాష్ట్ర కమిటీ సభ్యులు భుజంగారెడ్డి, చంద్రమోహన్‌, సుల్తాన్‌ రమేష్‌, పి. శశికళ, షైన్‌ బేగం, మల్లేష్‌, రాష్ట్ర నాయకులు లక్ష్మీపతి ఉషా, రాజు, నర్సింగ్‌, దీపిక, సుల్తానా, శివ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -