Tuesday, March 31, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంతెలంగాణకు కేంద్రం తీరని అన్యాయం

తెలంగాణకు కేంద్రం తీరని అన్యాయం

- Advertisement -

రాష్ట్రం నుంచి వెళ్తున్నది రూ.4.60 లక్షల కోట్లు, వస్తున్నది రూ.1.36 లక్షల కోట్లే
బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఒక న్యాయం, మిగిలిన వాటికి మరో న్యాయం : అసెంబ్లీలో మంత్రి జూపల్లి కృష్ణారావు
వ్యాట్‌ సవరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

తెలంగాణకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తున్నదని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సోమవారం అసెంబ్లీలో తెలంగాణ విలువ ఆధారిత పన్ను (సవరణ) బిల్లు-2026పై చర్చ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ 2018-19 నుంచి 2024-25 ఆర్థిక సంవత్సరాల వరకు రాష్ట్రం నుంచి కేంద్రానికి రూ.4,60,653 కోట్లు వెళ్తే కేంద్రం నుంచి రాష్ట్రానికి రూ.1,36,174 కోట్లు మాత్రమే వచ్చాయని వివరించారు. ఇదే కాలంలో తమిళనాడు నుంచి రూ.9.84 లక్షల కోట్లు వెళ్తే ఆ రాష్ట్రానికి వచ్చింది రూ.2.56 కోట్లని అన్నారు. కర్నాటక నుంచి రూ.16.17 లక్షల కోట్లు వెళ్తే ఆ రాష్ట్రానికి వచ్చింది రూ.2.44 లక్షల కోట్లని చెప్పారు. మధ్యప్రదేశ్‌ నుంచి రూ.2.60 లక్షల కోట్లు వెళ్తే ఆ రాష్ట్రానికి వచ్చింది రూ.4.86 లక్షల కోట్లని వివరించారు. బీహార్‌ నుంచి రూ.6.93 లక్షల కోట్లు వెళ్తే ఆ రాష్ట్రానికి వచ్చింది రూ.6.25 లక్షల కోట్లని అన్నారు. కేంద్ర ప్రభుత్వం బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఒక న్యాయం, ప్రతిపక్ష రాష్ట్రాలపై సవతి తల్లి ప్రేమను చూపిస్తున్నదని విమర్శించారు. 2014 జూన్‌ రెండు నాటికి తెలంగాణ అప్పు రూ.60 వేల కోట్లని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్ర అప్పు రూ.ఎనిమిది లక్షల కోట్లకు చేరింన్నారు. దీంతో రోజుకు రూ.300 కోట్ల అప్పు చేస్తేనే ప్రభుత్వం నడిచే పరిస్థితి ఉందన్నారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి రూ.లక్ష కోట్ల సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నదని వివరించారు. పన్నులను పెంచలేదన్నారు. రిలయెన్స్‌ సంస్థకు ప్రయోజనం చేకూర్చడం కోసం తాము ఈ బిల్లును తేలేదని వివరించారు. రిలయన్స్‌ మొబిలిటీ లిమిటెడ్‌ సంస్థ నుంచి నిర్దిష్టంగా పన్ను సేకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ బిల్లును తెచ్చిందన్నారు. రిలయన్స్‌ కంపెనీ ప్రభుత్వానికి చెల్లించే పన్నులో వ్యత్యాసాలను గతేడాది జులైలో అధికారులు గుర్తించారని చెప్పారు. వాటిని సరిచేసేందుకు అప్పుడే నోటిపికేషన్‌తోపాటు జీవోను జారీ చేశామని వివరించారు. దానికి చట్టబద్దత కోసం ఈ సవరణ బిల్లును ప్రవేశపెట్టామని మంత్రి అన్నారు.

పెట్రోల్‌, డీజిల్‌పై వ్యాట్‌ను తగ్గించాలి : పాయల్‌ శంకర్‌
అంతర్జాతీయ చమురు ధరల ప్రకారం దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల ధరలు ఉండాలని ప్రధాని నరేంద్ర మోడీ పెట్రోల్‌పై రూ.పది, డీజిల్‌పై రూ.పది ఎక్సైజ్‌ డ్యూటీని తగ్గించారని బీజేపీ సభ్యులు పాయల్‌ శంకర్‌ అన్నారు. ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలతో పోలిస్తే బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తక్కువగా ఉన్నాయని వివరించారు. రైతులకు తక్కువ ధరకే పెట్రోల్‌, డీజిల్‌ను సరఫరా చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రజలపై భారం మోపకుండా పెట్రోల్‌, డీజిల్‌పై వ్యాట్‌ను తగ్గించేలా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాలని కోరారు.

ఎన్నికలుంటేనే ఎక్సైజ్‌ డ్యూటీ తగ్గింపు : పొన్నం
రాష్ట్రాల్లో ఎన్నికలుంటేనే కేంద్ర ప్రభుత్వం పెట్రో ఉత్పత్తులపై ఎక్సైజ్‌ డ్యూటీని తగ్గిస్తున్నదని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. ఎన్నికలు పూర్తయ్యాక ఏడాది వరకు దాన్ని కొనసాగిస్తుందా?అని ప్రశ్నించారు. ఎన్నికల కోసమే కేంద్రం నిర్ణయాలు తీసుకుంటున్నదని విమర్శించారు.

ధరల పెరుగుదలతో పేదలకే నష్టం : కూనంనేని
ధరల పెరుగుదలతో పేద ప్రజలకే నష్టం కలుగుతుందని సీపీఐ సభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. పన్ను చెల్లింపులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన రిలయన్స్‌ కంపెనీకి జరిమానా విధించి మొత్తం పన్ను వసూలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో ముందస్తు ప్రణాళిక లేకపోతే రాష్ట్రం సంక్షోభంలోకి నెట్టివేయబడుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. పెట్రోలియం ఉత్పత్తులపై ఎక్సైజ్‌ డ్యూటీని తగ్గిస్తే ద్రవ్యోల్బణం కూడా తగ్గుతుందని చెప్పారు. పన్నుల ఆదాయంపై సభలో స్వల్పకాలిక చర్చ పెట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. దానం నాగేందర్‌ మాట్లాడుతూ ఆయిల్‌ కంపెనీల టర్నోవర్‌ నుంచి ప్రభుత్వానికి వచ్చే పన్నుల ఆదాయంపై పర్యవేక్షణ ఉండాలని అన్నారు. రాష్ట్రంలో పెట్రోల్‌, డీజిల్‌ నిల్వలపై ప్రభుత్వం ప్రకటన చేయాలని కోరారు. బీజేపీ సభ్యులు పాల్వాయి హరీశ్‌బాబు మాట్లాడుతూ పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ డ్యూటీని కేంద్రం రూ.పది తగ్గించిందని చెప్పారు. రాష్ట్రం కూడా వ్యాట్‌ను తగ్గించాలని అన్నారు. అనంతరం తెలంగాణ విలువ ఆధారిత పన్ను (వ్యాట్‌) సవరణ బిల్లు-2026ను సభ ఆమోదించినట్టు స్పీకర్‌ ప్రసాద్‌ కుమార్‌ ప్రకటించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -