రాజకీయ దురుద్దేశంతోనే అడ్డగింత
బీసీ బిల్లు ఆమోదానికి కేంద్రంపై రాష్ట్రం ఒత్తిడి తేవాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ-మిర్యాలగూడ
బీసీ రిజర్వేషన్ అమలులో కేంద్ర ప్రభుత్వం ఆటంకం కలిగించిందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. శుక్రవారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడలోని సీపీఐ(ఎం) కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం రాజకీయ దురుద్దేశంతోనే బీసీ రిజర్వేషన్ అమలు కాకుండా అడ్డుకుందని విమర్శించారు. 42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే అసెంబ్లీలో చర్చ పెట్టిందని, ఆ సమయంలో అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయని గుర్తు చేశారు. అసెంబ్లీ ఆమోదంతో బిల్లును గవర్నర్‌కు రాష్ట్ర ప్రభుత్వం పంపించిందని, అట్టి బిల్లును ఆమోదించాల్సిన గవర్నర్ రాష్ట్రపతికి పంపారని గుర్తు చేశారు.
అక్కడ కూడా బిల్లు ఆమోదించకుండా కేంద్రం కావాలనే కాలయాపన చేస్తుందని అన్నారు. గవర్నర్, రాష్ట్రపతి ఆమోదం తెలిపితే కోర్టుకు వెళ్లే పరిస్థితి ఉండేది కాదన్నారు. కులగణన చేసిన తర్వాతనే అసెంబ్లీలో బీసీ బిల్లు పెట్టారని, బీసీ రిజర్వేషన్ మధ్యప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో అమలవుతుందని తెలిపారు. బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో ప్రభుత్వాలను నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం రాజకీయంగా తమకు అనుకూలంగా ఉంటే జమ్ము కాశ్మీర్‌లో 370 ఆర్టికల్ రద్దు చేశారని, ప్రజా ప్రతినిధుల చట్టం తీసుకొచ్చారని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వానికి రాజకీయ ప్రయోజనాలే తప్ప ప్రజాప్రయోజనాలు, సంక్షేమం పట్ట్టలేదని అన్నారు. బీసీ రిజర్వేషన్లు అడ్డుకుంటున్న బీజేపీకి ప్రజలు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. ఎన్నికలు జరిపేందుకు ప్రభుత్వానికి అనేక అవకాశాలు ఉన్నాయని, దానిలో ప్రధానంగా సుప్రీంకోర్టుకు వెళ్లడమా..? కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడమా? పాత రిజర్వేషన్ పద్ధతిన ఎన్నికలకు వెళ్లడమా..? లేకపోతే పార్టీపరంగా 42 శాతం రిజర్వేషన్ అమలు చేయడమా అనేది ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉందన్నారు.
బీసీ రిజర్వేషన్ అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని రాజకీయ పక్షాల నాయకులను ఢిల్లీకి తీసుకెళ్లి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. స్థానిక ప్రభుత్వాలు లేకపోవడం వల్ల గ్రామాల్లో అనేక సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కేంద్ర నుంచి వచ్చే రూ.మూడు వేల కోట్ల నిధులు రాకుండా పోతున్నాయని అవేదన వ్యక్తం చేశారు. సత్వరమే స్థానిక సంస్థల ఎన్నికలు జరపాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, వన్‌టౌన్ కార్యదర్శి డాక్టర్ మల్లు గౌతమ్ రెడ్డి, మండల కార్యదర్శి మూడవత్ రవి నాయక్, జిల్లా నాయకులు పాదూరి శశిధర్ రెడ్డి, రాగిరెడ్డి మంగారెడ్డి, నాయకులు గోవర్ధన, కోటిరెడ్డి, అరుణ, నాగేందర్, చారి పాల్గొన్నారు.