ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పాలడుగు భాస్కర్
నవతెలంగాణ-భూపాలపల్లి
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలు మానుకోవాలని, మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పాలడుగు భాస్కర్ డిమాండ్ చేశారు. శనివారం భూపాలపల్లిలోని శ్రామిక భవనంలో గుర్రం దేవేందర్, పోలం రాజేందర్ అధ్యక్షతన జిల్లా విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర కమిటీ సభ్యులు జె వెంకటేష్‌తో కలిసి ఆయన హాజరయ్యారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో భాస్కర్ మాట్లాడుతూ ఇటీవల కాలంలో మోడీ సర్కారు పార్లమెంటులో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రద్దుచేసి దాని స్థానంలో వీబీజీఆర్‌ఏఎంజీ చట్టాన్ని తీసుకువచ్చి ఉపాధి కూలీలకు అన్యాయం చేసిందన్నారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే వీబీజీఆర్‌ఏఎంజీ చట్టాన్ని రద్దుచేసి యథావిధిగా ఉపాధి హామీ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర కమిటీ సభ్యులు జె వెంకటేష్ మాట్లాడుతూ.. విద్యుత్ సవరణ చట్టం ద్వారా స్మార్ట్‌మీటర్లు పెట్టడం, కేంద్రమే విద్యుత్తు రేట్లు పెంచడం, ఉచిత కరెంటును ఎత్తివేసే కుట్ర చేస్తుందని ఆందోళన వ్యక్తంచేశారు. సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి బంధు సాయిలు మాట్లాడుతూ పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర నియం త్రించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. యుద్ధం కారణంగా చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, వంటి మహా నగరాలలోని రెస్టారెంట్లు, హోటల్‌లతో పాటు సామాన్య మానవునిపై పెరిగిన వంట గ్యాస్ ధర భారం పడుతుందన్నారు. సమావేశంలో సిహెచ్ రమేష్,చిన్న రాజేందర్, స్మరణ్, రాజకుమార్, వంగాల లక్ష్మి,సంగం ప్రీతి, శేఖర్, సీపీఐ(ఎం) నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.



