Tuesday, March 31, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంయుద్ధ విరమణకు కేంద్రం చొరవ చూపాలి

యుద్ధ విరమణకు కేంద్రం చొరవ చూపాలి

- Advertisement -

ఇలాగే కొనసాగితే మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే ప్రమాదం
ఆర్థిక విధ్వంసంతో ప్రజల జీవితాలు దుర్భరం
శాసనసభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తీర్మానం
ఏకగ్రీవంగా ఆమోదించిన అసెంబ్లీ

నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్‌ కొనసాగిస్తున్న యుద్ధాన్ని ఆపేందుకు భారత ప్రధాని మోడీ చొరవ తీసుకోవాలని రాష్ట్ర శాసనసభ కోరింది. యుద్ధం వల్ల మరణాల సంఖ్య పెరగడంతో పాటు, ఆర్థిక విధ్వంసంతో ప్రజల జీవితాలు దుర్భరంగా మారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఇదే విధంగా యుద్ధం కొనసాగితే మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే ప్రమాదముందని హెచ్చరించింది. శాసనసభలో ఇదే అంశంపై సోమవారం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు. ఆ తీర్మానాన్ని శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. తీర్మానంలోని అంశాలిలా ‘పశ్చిమాసియాలో ఇరాన్‌, ఇజ్రాయిల్‌ మధ్య మొదలైన యుద్ధం అనేక రూపాంతరాలు చెంది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తోంది. క్రూడాయిల్‌ (పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌) ఇబ్బందులు ప్రతీ దేశ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తాయన్న విషయం మనందరికీ తెలుసు.

ఈ యుద్ధ ప్రభావం వల్ల క్రూడాయిల్‌ ఉత్పత్తి, రవాణా, సరఫరాలో తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. అమెరికా, ఇజ్రాయిల్‌ కలిసి ఇరాన్‌, లెబనాన్‌ దేశాలపై దాడి చేస్తున్నాయి. అలాగే ఇరాన్‌ కూడా గల్ప్‌, మిడిల్‌ ఈస్ట్‌ దేశాల్లో ఉన్న అమెరికా రక్షణ స్థావరాలను టార్గెట్‌ చేసుకుని దాడి చేస్తోంది. ఫైటర్‌ బాంబర్స్‌, బాలెస్టిక్‌ మిస్సైల్స్‌, డ్రోన్స్‌ వంటి అత్యంత ఆధునికమైన ఆయుధాలతో పరస్పర దాడులు చేసు కుంటున్నాయి. ఇలాంటి మాస్‌ డిస్ట్రక్టివ్‌ ఆయుధాలతో జరిగే విధ్వంసంతో దాదాపు 4,000 మంది అమాయకులు మరణించారు. ఈ మరణాలతోపాటు ఆర్థికపరమైన విధ్వంసం కొనసాగుతోంది.

మరణాలు ఆయా దేశాలకు మాత్రమే పరిమితమైతే, ఆర్థిక విధ్వంసం ప్రపంచం మొత్తాన్ని ప్రభావితం చేస్తోంది. ఆసియా దేశాలకు ఇది మరింత ప్రమాదకరంగా మారింది. మన దేశంపైనా తీవ్రమైన ప్రభావం కనపడుతోంది. ఇంతటితోనైనా ఈ యుద్ధాన్ని ఆపకపోతే ప్రపంచ భవిష్యత్తు ఆందోళనకరంగా మారుతుంది. ఈ యుద్ధం ఇలాగే కొనసాగినా, ఆపకపోయినా ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీయొచ్చు. ఇది ప్రపంచ మానవాళి మనుగడకే ముప్పు. ఇలాంటి అత్యంత ప్రమాదకర పర్యవసనాల దృష్ట్యా భారత ప్రభుత్వం చొరవ తీసుకుని యుద్ధాన్ని ఆపేందుకు, ప్రపంచ శాంతిని నెలకొల్పేందుకు తగిన చొరవ తీసుకోవాలి’ అని కేంద్ర ప్రభుత్వానికి అసెంబ్లీ విజ్ఞప్తి చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -