పరిహార ప్యాకేజీని ప్రకటించాలి
పన్ను సంస్కరణ ప్రయోజనాలు వినియోగదారులకు అందాలి : 8 రాష్ట్రాల ఆర్థిక మంత్రులు డిమాండ్
జీఎస్టీ రేట్ల హేతుబద్ధీకరణపై ఆర్థిక మంత్రులు, అధికారుల భేటీ
సెప్టెంబర్ 3న తదుపరి సమావేశం
తెలంగాణ రాష్ట్రానికి రూ.5,100 కోట్లు నష్టం
ఏకపక్షంగా జీఎస్టీ రేట్ల హేతుబద్ధీకరణ
పన్ను తగ్గింపులనేవి పేద, మధ్యతరగతి వర్గాలకు చేరాలి : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఏకపక్షంగా ప్రకటించిన జీఎస్టీ రేట్ల సవరణ వల్ల రాష్ట్రాలకు ఏర్పడిన ఆదాయ నష్టాన్ని కేంద్ర ప్రభుత్వం భర్తీ చేయాలని ప్రతిపక్ష పార్టీల పాలనలో ఉన్న ఎనిమిది రాష్ట్రాల ఆర్థిక మంత్రులు సంయుక్తంగా డిమాండ్ చేశారు. శుక్రవారం నాడిక్కడ కర్ణాటక భవన్‌లో జీఎస్టీ రేట్ల హేతుబద్దీకరణపై ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల ఆర్థిక మంత్రులు, అధికారుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జీఎస్టీ కౌన్సిల్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆర్థిక మంత్రులు భట్టి విక్రమార్క (తెలంగాణ), కె.ఎన్. బాలగోపాల్ (కేరళ), తంగం తెన్నరసు (తమిళనాడు), హర్పాల్ సింగ్ చీమా (పంజాబ్), రాధా కృష్ణ కిషోర్ (జార్ఖండ్), రెవెన్యూ మంత్రి కృష్ణ బైరేగౌడ (కర్నాటక), సాంకేతిక విద్యాశాఖ మంత్రి రాజేష్ ధర్మాని (హిమాచల్‌ప్రదేశ్), పశ్చిమ బెంగాల్ రెసిడెంట్ కమిషనర్ ఉజ్జయిని దత్తా హాజరయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా జీఎస్టీ సంస్కరణకు సంబంధించి రెండు డిమాండ్లు చేశారు. పన్ను సంస్కరణల ప్రయోజనాలను సాధారణ వినియోగదారులకు అందజేయాలని, రాష్ట్రాలకు జరిగిన భారీ ఆర్థిక నష్టాన్ని భర్తీ చేయడానికి కేంద్ర ప్రభుత్వం పరిహార ప్యాకేజీ వంటి పరిష్కారాన్ని కనుగొనాలని డిమాండ్ చేశారు. కొత్త జీఎస్టీ ప్రతిపాదనలతో మొత్తంగా రూ.2 లక్షల కోట్ల వరకు నష్టం వాటిల్లుతుందని అంచనా వేశారు. జీఎస్టీ కౌన్సిల్ భేటీలో తమ ప్రతిపాదనలు సమర్పిస్తామని మంత్రులు తెలిపారు. తదుపరి సమావేశం సెప్టెంబర్ 3న తమిళనాడు భవన్‌లో నిర్వహించేందుకు నిర్ణయించారు.
రాష్ట్రాల ఆదాయం 20 శాతం తగ్గుతుంది : కెఎన్ బాలగోపాల్, కేరళ ఆర్థిక మంత్రి
జీఎస్టీ కౌన్సిల్‌లోని దాదాపు మూడింట ఒక వంతు మంది మంత్రులు ఇటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేయడం ఒక చారిత్రాత్మకమని కేరళ ఆర్థిక మంత్రి కె.ఎన్. బాలగోపాల్ అన్నారు. జీఎస్టీ సంస్కరణ ఉత్పత్తుల ధరలను తగ్గించి సామాన్యులకు ప్రయోజనం చేకూర్చితే, ప్రతిపక్ష రాష్ట్రాలు స్వాగతిస్తాయని అన్నారు. పన్ను తగ్గింపు ప్రయోజనాలను వినియోగదారులకు అందించేలా నిర్ధారించుకోవాలని, లేకుంటే కార్పొరేట్లు ప్రయోజనం పొందే పరిస్థితి ఏర్పడుతుందని పేర్కొన్నారు. గతంలో అనేక ఉత్పత్తులపై జీఎస్టీ తగ్గించినప్పుడు, ధరలు తదనుగుణంగా మారలేదని కేరళ నిర్వహించిన అధ్యయనంలో తేలిందన్నారు. రాష్ట్రాలకు వచ్చే ఆదాయ నష్టాన్ని ఎలా భర్తీ చేస్తారో కేంద్రం స్పష్టం చేయాలన్నారు. 2017లో కేంద్రం వ్యాట్ నుంచి జీఎస్టీకి మారినప్పుడు, ఆదాయ నష్టాన్ని భర్తీ చేయడానికి కేంద్రం నిర్ణీత కాలానికి పరిహారం అందించిందని, అయితే, గత రెండేండ్లుగా ఈ పరిహారం అందించటం లేదని పేర్కొన్నారు. దీనికి తోడు, కొత్త జీఎస్టీ సంస్కరణతో భారీ ఆదాయ నష్టం జరుగుతుందని,జీఎస్టీ సంస్కరణ నోట్ల రద్దు వంటి పెద్ద తప్పుగా మారవచ్చని ఆర్థిక మంత్రి కెఎన్ బాలగోపాల్ అన్నారు.జీఎస్టీ కేంద్రం మొత్తం ఆదాయంలో 25 శాతం మాత్రమేనని, కానీ రాష్ట్రాల ఆదాయంలో 70 శాతం జీఎస్టీ నుంచి వస్తుందని అన్నారు. జీఎస్టీ సంస్కరణలతో రాష్ట్రాలకు వచ్చేదానిలో కనీసం 20 శాతం తగ్గుతుందని పేర్కొన్నారు. ఈ ఆదాయంలో లోటును కేంద్రమే భర్తీ చేయాలని, లేకుంటే, రాష్ట్రాల సామాజిక భద్రతా పథకాలు, అభివృద్ధి పథకాలపై ప్రభావం పడుతోందని అన్నారు. కేరళ రూ. 8,000 కోట్ల నుంచి రూ. 10,000 కోట్ల వరకు నష్టపోతుందని భావిస్తున్నామన్నారు. కేరళ 62 లక్షల మందికి సామాజిక భద్రతా పెన్షన్ అందించే రాష్ట్రమని, దీనితో పాటు, కారుణ్య చికిత్సా పద్ధతి వంటి పథకాలు ఉన్నాయని పేర్కొన్నారు. లైఫ్ ప్రాజెక్ట్, రోడ్ల అభివృద్ధి, ఆస్పత్రులు, పాఠశాలల అభివృద్ధి మొదలైనవి వన్నీ ప్రభావితమవుతాయని అన్నారు. రాష్ట్రాలు రూ. 2 లక్షల కోట్లు నష్టపోతాయని భావిస్తున్నామని, కానీ అది ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని తెలిపారు.జీఎస్టీ వల్ల కేరళకు జరిగిన ఆదాయ నష్టాన్ని బాలగోపాల్ వివరించారు. జీఎస్టీకి ముందు పన్ను విధానం కొనసాగి ఉంటే, ఏడాదికి కేరళకు వచ్చే ఆదాయం రూ. 54,000 కోట్లకు చేరుకుంటుందని, కానీ గతేడాది జీఎస్టీ నుంచి కేరళకు కేవలం రూ.32,000 కోట్లు మాత్రమే వచ్చిందని అన్నారు. రూ. 22,000 కోట్లు మేర నష్టం జరిగిందని పేర్కొన్నారు. రాష్ట్రాల మొత్తం ఆదాయంలో 60-65 శాతం కేంద్రానికి వెళుతుందని, కానీ ఖర్చులో 65 శాతం రాష్ట్రాలు భరిస్తాయని వివరించారు. ప్రతిపక్ష రాష్ట్రాలు ఈ సమస్యలన్నింటినీ జీఎస్టీ కౌన్సిల్‌ను ఒప్పించడానికి ప్రయత్నిస్తాయని అన్నారు. బీజేపీ రాష్ట్రాలు కూడా ఆదాయ నష్టం గురించి ఆందోళన చెందుతున్నాయని బాలగోపాల్ అన్నారు.
తెలంగాణ రాష్ట్రానికి రూ.5,100 కోట్లు నష్టం : భట్టి విక్రమార్క
జీఎస్టీ సంస్కరణలతో తెలంగాణ రాష్ట్రానికి రూ.5,100 కోట్లు నష్టం వస్తుందని అంచనా ఉన్నట్టు తెలంగాణ ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న రేట్ల హేతుబద్ధీకరణకు మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని, అయితే సంక్షేమ పథకాలపై ప్రతికూల ప్రభావం చూపే నష్టం గురించి ఆందోళన కలుగుతోందని తెలిపారు. బహుళ పార్టీ వ్యవస్థ కలిగిన పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ప్రతి రాష్ట్రం ముఖ్యమైనదేనని, సహకార సమాఖ్యవాద స్ఫూర్తితో, కేంద్రం నేరుగా లేదా కౌన్సిల్‌తో రాష్ట్రాలను సంప్రదించి ఉండేదని, కానీ.. దురదృష్టవశాత్తు రేటు హేతుబద్ధీకరణ ప్రకటన ఏకపక్షంగా జరిగిందన్నారు. తెలంగాణ కొత్తగా ఏర్పడిన రాష్ట్రమని, ఎన్నో ఆకాంక్షలు ఉన్నాయని, నిధులు అవసరమని తెలిపారు. సరైన పన్ను విధించడంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి అది దోహద పడుతుందన్నారు. రాష్ట్రాలకు ఆదాయం తగ్గుతుందని, దానికి పరిహారం చెల్లిస్తామని జీఎస్టీ విధానాన్ని ప్రవేశపెట్టారని, గత ఐదేండ్లలో జీఎస్టీ ద్వారా ఆదాయాలు గణనీయంగా పెరుగుతాయని అంచనా వేశారని, కానీ ఆశించినంతగా ఏమీ జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఆర్థిక స్వేచ్ఛతో వ్యాట్‌ను కొనసాగించి ఉంటే 2024-25 సంవత్సరానికి ఆదాయం రూ.69,373 కోట్లు ఉండేదని, కానీ జీఎస్టీ ద్వారా ఆదాయం రూ.42,443 కోట్లు మాత్రమే వచ్చిందని తెలిపారు. రాష్ట్ర సొంత పన్ను ఆదాయంలో జీఎస్టీ వసూళ్లు 39 శాతమేనని, అందువల్ల జీఎస్టీ రేట్లలో ఏమైనా తగ్గింపులు ఉంటే.. కేంద్ర ప్రభుత్వం కంటే రాష్ట్ర ఆదాయంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని పేర్కొన్నారు. ప్రతిపాదిత రేటు హేతుబద్ధీకరణ కారణంగా తెలంగాణ రాష్ట్రం దాదాపు రూ.7,000 కోట్లు నష్టపోతుందని అంచనా వేశారు. ఇది జీఎస్టీ ఆదాయంలో దాదాపు 15 శాతమని, ఇది మొత్తం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని తెలిపారు. తెలంగాణ ఆదాయంలో 80 శాతం కంటే ఎక్కువ సంక్షేమ వ్యయం కోసం కేటాయిస్తున్నామని గుర్తు చేశారు. తెలంగాణలో విలాసవంతమైన వస్తువులపై సెస్ వాటా రాష్ట్రానికి వచ్చే జీఎస్టీలో 15 శాతం మాత్రమేనని స్పష్టం చేశారు. తెలంగాణ జీఎస్టీ, జీఎస్ డీపీ నిష్పత్తి 2022-23లో 3.07 శాతం నుంచి 2024-25లో 2.58 శాతానికి క్రమంగా తగ్గుతోందని, రేటు హేతుబద్ధీకరణ దీనిని మరింత తగ్గిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రాలకు పన్ను విధించడంలో స్వేచ్ఛ లేనప్పుడు, అంతరాన్ని తగ్గించడానికి అదనపు ఆదాయానికి తగిన విధానాన్ని ప్రవేశపెట్టకపోతే ఆర్థిక భారం భారీగా ఉంటుందని తెలిపారు. తెలంగాణ రేటు హేతుబద్ధీకరణకు మద్దతు ఇస్తుందని, కానీ రెండు తీవ్రమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మొదటిది.. రాష్ట్రాల ఆదాయాలను రక్షించాలని, రాష్ట్రాలు సంక్షేమం, అభివద్ధి, మౌలిక సదుపాయాల కార్యక్రమాలను కొనసాగించేలా తగిన పరిహార విధానాన్ని రూపొందించాలని అన్నారు. రెండోది.. పన్ను తగ్గింపు లేదా మినహాయింపు నిజంగా సమాజంలోని పేద, మధ్య తరగతి వర్గాల సమూహాలకు చేరేలా ఉండాలని అభిప్రాయపడ్డారు. తెలంగాణలో వరదల వల్ల తీవ్ర నష్టం వాటిల్లిందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహించారని గుర్తు చేశారు. వీలైనంత తర్వరగా నివేదికను సిద్ధం చేసి కేంద్రానికి సమర్పించామని, ఆర్థికసాయం కోరుతామని తెలిపారు.
రాష్ట్రాలకు జరిగే నష్టాన్ని కేంద్రమే భర్తీ చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES