సీఎం రేవంత్ రెడ్డి గ్రామంలో రూ.200 కోట్లతో అభివృద్ధి పనులు
అభివృద్ధిలో దేశంలోనే రెండో గ్రామం
దసరా పండుగకు సీఎం రాక
నవతెలంగాణ – మహబూబ్‌నగర్ ప్రాంతీయ ప్రతినిధి
మాజీ సీఎం కేసీఆర్ సొంత గ్రామం సిద్దిపేట జిల్లా చింతమడక.. వ్యక్తిగత అభివృద్ధికి చిరునామాగా నిలిచింది.. ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షలు లబ్ది చేకూరేలా ట్రాక్టర్లు, ఆటోలు, జేసీబీలు, డైరీ ఫామ్‌లు, పౌల్ట్రీ ఫామ్‌లు ఇచ్చి వారిని ఆర్థికంగా ఆదుకున్నారు. పుట్టిన ఊరు పై తనకున్న ప్రేమను చాటుకున్నారు. కానీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వగ్రామం కొండారెడ్డిపల్లి మారుమూల గ్రామం.. గ్రామ అభివృద్ధి కోసం రేవంత్‌రెడ్డి ఎంతో కృషి చేశారు. ఇప్పుడు పూర్తి గ్రామ రూపురేఖలే మారిపోయాయి. ఆదర్శగ్రామంగా తీర్చిదిద్దుతున్నారు. దసరా పండుగ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి గ్రామాన్ని సందర్శించబోతున్నారు.
నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డి పల్లి గ్రామం.. మహబూబ్‌నగర్-నల్లగొండ జాతీయ రహదారికి 4కి.మీ దూరంలో ఉంది. రహదారికి అతి సమీపాన ఉన్నప్పటికీ గ్రామంలో మౌలిక సదుపాయాలు ఉండేవి కావు. రైతులు ఎక్కువ శాతం పాడి ఉత్పత్తిని ఆధారంగా చేసుకుని జీవించేవారు. రేవంత్‌రెడ్డి రాజకీయా ల్లోకి ప్రవేశించిన తర్వాత గ్రామ అభివృద్ధికి బీజం పడింది. మొదట మిడ్జిల్ నుంచి జేడ్పీటీసీగా గెలిచిన నాటి నుంచి గ్రామాభివృద్ధి కోసం ఆయన కృషిచేశారు. ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత గ్రామానికి ఆయన నిధులు మంజూరు చేసేవారు. కొడంగల్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిన తర్వాత గ్రామంలో పాల శీతలీకరణ కేంద్రంతో పాటు పశు వైద్యశాలను ఏర్పాటు చేయించారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత గ్రామం అభివృద్ధి అవుతుందని గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
రూ.200 కోట్లతో అభివృద్ధి పనులు
కొండారెడ్డిపల్లి గ్రామంలో ప్రత్యేక అభివృద్ధి పథకం కింద రూ.200 కోట్లతో అభివృద్ధి పనులు చేస్తున్నారు. ముఖ్యంగా గ్రామాన్ని పూర్తి సౌర విద్యుత్ గ్రామంగా మార్చారు. 490 కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి లక్షన్నర చొప్పున సోలార్ సెట్లను బిగించారు. ప్రభుత్వ కార్యాలయాలకు, స్కూళ్లకు, అంగన్వాడీ కేంద్రానికి సైతం సోలార్ ప్లాంట్‌ను అమర్చారు. రోడ్లు, రహదారుల కోసం రూ.38 కోట్లు, భూగర్భ డ్రయినేజీకి రూ.18 కోట్లు కేటాయించి పనులు ప్రారంభించారు. గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి రూ.72 లక్షలు ఖర్చు చేసి ఆధునిక భవనాన్ని నిర్మించారు. శుభకార్యములు నిర్వహించుకునేం దుకు ఉపయోగపడేలా రూ.82 లక్షలతో వెనుకబడిన తరగతుల భవనాన్ని ముస్తాబుచేశారు. అత్యధికంగా పాడి పరిశ్రమ ఉన్న ఈ ప్రాంతంలో రూ.55లక్షలతో వెటర్నరీ ఆస్పత్రిని నిర్మించి వైద్యం అందిస్తున్నారు. గ్రంథాలయం కోసం రూ.45 లక్షలు, పాలశీతలీకరణ కేంద్రానికి రూ.2.50 కోట్లు, ఆధునిక రైతు వేదిక కోసం రూ.20 లక్షలు ఖర్చు చేశారు.
అలాగే, పోల్కంపల్లి నుంచి కొండారెడ్డిపల్లి వరకు 6కి.మీ రహదారి నిర్మాణం కోసం రూ.55 కోట్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి రూ.2.50 కోట్లు కేటాయిం చారు. అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ల కోసం రూ.300 కోట్లు అవసరముందని ప్రాథమికంగా అంచనా వేశారు. సర్వారెడ్డిపల్లి నుంచి తిమ్మరాసిపల్లి వరకు రూ.30 కోట్లతో రహదారి పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే, ఆట స్థలం కోసం రూ.14 లక్షలు, ఓపెన్ జిమ్ కోసం రూ.18 లక్షలు, భూగర్భ విద్యుత్ కోసం 2.85 కోట్లు తదితర పనులకు నిధులు కేటాయించి పనులు ప్రారంభించారు. కొండారెడ్డిపల్లి గ్రామానికి సుమారు రూ.500 కోట్లు విడుదల అయినట్టు అధికారులు తెలిపారు. దేశంలోనే అభివృద్ధి చెందిన రెండో గ్రామంగా కొండారెడ్డి పల్లి నిలిచింది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రత్యేక గ్రాండ్‌తో గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్న ముఖ్యమంత్రికి గ్రామ ప్రజలు ధన్యవాదాలు చెబుతున్నారు.
రేవంత్ రెడ్డి పుణ్యమే : లక్ష్మయ్య, కొండారెడ్డి పల్లి
మా గ్రామం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందంటే.. అది సీఎం రేవంత్ రెడ్డి పుణ్యమే. నాలుగు లైన్ల రోడ్డు ప్రాథమిక ఆస్పత్రి, పాఠశాల, అంతర్గత డ్రయినేజీ పనులు జరిగాయి.
ముఖ్యమంత్రి సంకల్పం గొప్పది
ఏబీఎన్ రెడ్డి, తెలంగాణ వ్యవసాయ కమిషన్ మెంబర్
రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన సొంత ఊరు కొండారెడ్డిపల్లి శరవేగంగా అభివృద్ధి చెందుతున్నది. రూ.500 కోట్లకుపైగా నిధులు కేటాయించి అభివృద్ధి చేయడం ఆయన చిత్తశుద్ధికి నిదర్శనం. మాజీ సీఎం కేసీఆర్ సొంత గ్రామం చింత మడక వ్యక్తిగతంగా అభివృద్ధి అయితే.. కొండారెడ్డిపల్లిలో సామూహిక అభివృద్ధి జరిగింది. రేవంత్ రెడ్డి చేసిన ఈ అభివృద్ధి తరతరాలకు గుర్తుంటుంది.
మారిన కొండారెడ్డిపల్లి రూపురేఖలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES