Saturday, December 20, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిఅసమానతల అగాధం-బ్రిటిష్‌ పాలన కన్నా అధ్వానం

అసమానతల అగాధం-బ్రిటిష్‌ పాలన కన్నా అధ్వానం

- Advertisement -

అసమానతల అధ్యయన కృషిలో పేరుగాంచిన థామస్‌ పికెట్టి బ్రిటిష్‌ పాలన నాటికంటే ఇప్పుడే భారత దేశంలో అసమానతలు అధికంగా వున్నాయని వ్యాఖ్యానించారు. దాంతో పెద్ద దుమారం చెలరేగింది. అయితే ఇప్పుడు ఆయన పరిశీలనే వాస్తవమని మరింత స్పష్టంగా నిరూపించింది. అందరికీ అందుబాటులోకి వచ్చిన అంతర్జాతీయ అసమానతల నివేదిక 2026 వాటికి సంబంధించిన సమస్యలను తేటతెల్లం చేస్తున్నది. చాలా విజ్ఞానవంతంగానూ విషయ సంపన్నంగానూ వున్న ఆ నివేదికనే ఇలా పేర్కొంటున్నది: ”ప్రపంచ అసమానతల నివేదిక 2026 మూడవదిగా వెలువడుతున్నది. 2018, 2022 తర్వాత కీలకమైన సిరీస్‌గా ఇది వస్తున్నది. ప్రపంచవ్యాపితంగా రెండువందల మందికి పైగా మేధావుల కృషి ఆధారంగా ఇది కూర్పు చేయబడింది. వారు ప్రపంచ అసమానతల అధ్యయన ప్రయోగశాలతో అనుబంధంగా వుంటున్నారు.

ప్రపంచ అసమానతల చారిత్రిక పెరుగుదలకు సంబంధించిన అతి పెద్ద డేటా సేకరణకు వారు దోహదపడుతున్నారు. అసమానతలకు సంబంధించి ప్రపంచ వ్యాపిత చర్చలకు ఈ సమిష్టి కృషి గొప్పగా సహాయపడగలదు. విధాన నిర్ణేతలు, పౌరులు, అసమానతల తీవ్రతనూ, కారణాలనూ అర్థం చేసుకునే తీరును మార్పు చేయడానికి ఈ బృందం కృషి సహాయ పడింది. ప్రపంచ సంపన్నులను వేరుగా వుంచే ప్రక్రియనూ పైన పెరిగే విధంగా పన్ను వ్యవస్థను మార్చవలసిన అవ సరాన్ని అర్థమయ్యేలా చేశారు. అంతర్జాతీయంగా ద్రవ్య సంస్కరణలపై సంపద పన్ను, పున:పంపిణీ వేదికలపైన జాతీయ పార్లమెంటుల నుంచి జి20 వరకూ లేవనెత్తడానికి ఈ సమాచారం అందింది.’

కుబేరుల కులుకులు
ప్రస్తుత కాలం భారతీయ మహా కుబేరులకు స్వర్ణయుగంగా మారిందని తాజా నివేదిక చెబుతున్నది. దానివల్ల ప్రపంచంలోకెల్లా అత్యధిక అసమానతలను సృష్టించింది. అమెరికా, బ్రెజిల్‌, దక్షిణాఫ్రికాల కన్నా భారతదేశం లోనే అసమానతలు ఆకాశమంటుతున్నాయి. భారతీయ సంపన్నులకూ పేదలకూ మధ్య అంతరం ఎంత భారీగా వుందంటే ఒక విధంగా చూస్తే బ్రిటిష్‌ వలస పాలనలోనే ఈ సంపద పంపిణీ ఇప్పటికన్నా కొంత సమానతతో వుండేది. పికెట్టితో సహా ఈ అధ్యయనం రూపొందించిన ఆర్థికవేత్తల బృందం మాట ఇది. ”ప్రస్తుతం భారతదేశంలో మహా కుబేరుల సంఖ్య రెండు వందల డెబ్బయి ఒకటి. 2023లోనే కొత్తగా తొంభై నాలుగు మంది ఈ జాబితాలో చేరారని 2024 హురున్‌ పరిశోధనా సంస్థ సంపన్నుల జాబితా చెబుతున్నది. అమెరికాను మినహాయిస్తే మరే దేశంలోనూ ఇంత సంఖ్యలో బిలియనీర్లు లేరు.

వారి సంపద మొత్తం కలిపి చూస్తే లక్ష కోట్ల డాలర్లు. మరో విధంగా చూస్తే మొత్తం ప్రపంచ సంపదలో ఏడు శాతమన్నమాట. ప్రపంచంలోనే అతి సంపన్నులైన జెఫ్‌ బెజోస్‌, ఎలన్‌మస్క్‌ వంటి వారి బృందంలో కలసిపోయే విధంగా వున్నారు ముఖేష్‌ అంబానీ, గౌతం అదానీ, సజ్జన్‌ జిందాల్‌ వంటి వారు. బ్రిటిష్‌ కాలం నాటి వలస పాలనా శక్తుల కంటే భ్రారతదేశ ఆధునిక బూర్జువా వర్గం నాయకత్వంలోని బిలియనీర్‌ రాజ్‌ ప్రస్తుతం అధిక అసమానతతో నడుస్తున్నది.” అని రాశారా రచయితలు. ఈ వ్యాఖ్యానం ప్రత్యేకించి చాలా కఠోరంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవైపున బార్క్‌లేస్‌ అధ్యయనాల అంచనా ప్రకారం ఎనిమిది శాతం జీడీపీ పెరుగుదలతో భారత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతున్నట్టు చెప్పడం వింటున్నాం. మరికొందరైతే 2027 నాటికి ఇండియా, జపాన్‌నూ జర్మనీని దాటేసి ప్రపంచంలో మూడో పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవిస్తుందనే అంచనాలు ఇస్తున్నారు.

అన్నీ చూశాకే నివేదిక
కాని ప్రపంచ ఆర్థిక అసమానతల అధ్యయనశాల రచయితలు ఈ నిర్ణయానికి రావడానికి చాలా విషయాలు సేకరించారు. దేశపు మొత్తం రాబడి, అలాగే సంపదలో అగ్రభాగాన వున్న ఒక్క శాతం మంది చేతుల్లో ఎంత కేంద్రీకృతమైందో పరిశీలించారు. ఆదాయం అంటే ఆర్జనల మొత్తం కాగా పొదుపు, మదుపు ఇతర వనరులపై వడ్డీ కాగా, సంపద (లేదా నికర సంపద) అంటే ఆయా వ్యక్తుల లేదా గ్రూపుల స్వంత ఆస్తిగా పరిగణించారు. జాతీయాదాయ లెక్కలను సంపద మొత్తం వివరాలనూ పన్ను పట్టికలనూ సంపన్నుల జాబితాలనూ ఆదాయాలు వినిమయం, సంపదలపై సర్వేలనూ లెక్కకట్టి మరీ ఈ వివరాలు నిగ్గుతేల్చారు. సంపదను లెక్కకట్టడం కోసం ఆ ఆర్థికవేత్తలు 1922లో బ్రిటిష్‌, ఇండియా ప్రభుత్వాలు విడుదల చేసిన పట్టికలను పరిశీలించారు. 1930లలో రెండు ప్రపంచ యుద్ధాల మధ్య కాలంలో అసమానతలు అత్యధికంగా నమోదైనాయి. ఆ కాలంతో సహా లెక్క తీసుకుని 1947లో దేశానికి స్వాతంత్య్రం వరకూ లెక్కలు తీశారు.

ఈ మొత్తం కాలంలో చూస్తే దేశంలో అత్యధిక సంపన్న శ్రేణిలో వున్న ఒక్కశాతం మంది చేతుల్లో 20 నుంచి 21 శాతం జాతీయ సంపద వుంది. ఈ రోజున ఇదే ఒక్క శాతం అత్యధిక సంపన్న శ్రేణి దేశ ఆదాయంలో 22.6 శాతం కలిగివున్నారు. అదేవిధంగా సంపద అసమానతలు కూడా ఈ ఆర్థికవేత్తలు అధ్యయనం చేశారు. 1961లో భారత ప్రభుత్వం సంపద, అప్పులు, ఆస్తులు వంటి వాటిపై మొదటి భారీ ఇంటింటి సర్వే నిర్వహించింది. అదే సమయంలో ఫోర్బ్స్‌ బిలియనీర్‌ సూచీ సమాచారం జోడించి పరిశోధించింది. వీటన్నిటి ద్వారా తేలిందేమంటే దేశంలో అతి సంపన్నులైన ఒక శాతం మంది చేతుల్లో జాతీయ సంపద 40.1 శాతం పోగుపడి వుంది.

దీనికి కారణమేమంటే భారతదేశ మహా కుబేరుల సంఖ్య 1991లో ఒకే ఒక్కరుగా వుంటే 2022 నాటికి 162కు పెరిగింది. ఈ వ్యక్తులందరి చేతుల్లో మొత్తం సంపద భారత దేశ మొత్తం సంపదతో పోల్చి చూస్తే 1991లో ఒక శాతం వుంటే 2022లో 25 శాతానికి చేరింది. అని ఆ రచయితలు పేర్కొన్నారు. 2014లో భారతీయ జనతా పార్టీ తొలిసారి అధికారం చేపట్టాక ఈ అసమానతలు మరీ వేగంగా పెరిగిపో తున్నట్టు కూడా ఆ నివేదిక గుర్తించింది. గత పదేళ్ల కాలంలో చేపట్టిన ప్రధానమైన రాజకీయ, ఆర్థిక సంస్కరణల గురించి ఆ నివేదిక ఇలా వ్యాఖ్యానించింది: ‘నిర్ణయాధి కారం కేంద్రీకరించుకున్న ఒక నిరంకుశ ప్రభుత్వం బడా వ్యాపార వరాలకూ ప్రభుత్వానికి మధ్య కుమ్మక్కు ఇందుకు దారి తీసింది. దీనివల్ల సమాజంపైనా సర్కారు పైనా శ్రుతిమించిన పట్టు పెంచుకునే వీలు కలిగింద’ని నివేదిక తెల్పింది.

సర్కారూ చెప్పినవే
ఆరోగ్యం, విద్య, పౌష్టికాహార రంగాల్లో ప్రభుత్వ పెట్టుబడులు పెంచడం తప్పక జరగాల్సివుందని కూడా నివేదిక అభిప్రాయపడింది. 2022-23 కాలంలో భారత దేశంలో అగ్రభాగాన వున్న 167 మంది వ్యక్తుల నికర సంపదపై కేవలం రెండు శాతం సూపర్‌ పన్ను విధిస్తే జాతీయ ఆదాయంలో 0.5 శాతం రాబడి పెరుగుతుందని అంచనా కట్టింది. తద్వారా ప్రభుత్వం ఈ అవసరమైన పెట్టుబడులు పెట్టడానికి సదుపాయం కల్పించే అమూల్యమైన ద్రవ్యపరమైన వెసులుబాటు దొరుకుతుందని ఆ రచయితలు అంటున్నారు. ఏమైనా 2018-2022 మధ్య కాలంలో ప్రపంచ అసమానతల నివేదికల్లో భారత దేశానికి సంబంధించిన అధ్యాయాల్లో ఇలాంటి ధోరణుల గురించే పొందు పరిచారు.

అవే ఇప్పుడు మరింత ప్రస్ఫుటమయ్యాయి. అయితే ఇది కేవలం పరిశోధన ఆధారంగా తీస్తున్న సైద్ధాంతిక సూత్రీకరణ మాత్రమే కాదు. ఈ ప్రభుత్వమే ఇస్తున్న వాస్తవాల్లోనూ ఇదే కనిపిస్తుంది. 2014-15 నుంచి 2023-24 మధ్య కాలంలో భారీ పరిశ్రమలు సర్వీసులకు సంబంధించి రూ. 9,26, 947 కోట్ల రుణాలను పారుబాకీలుగా (ఎన్‌పిఎ) ప్రకటించినట్టు ప్రభుత్వం పార్లమెంటు ప్రస్తుత సమావేశా లలోనే లోక్‌సభలో తెలియజేసింది (మూలాధారం: రిజర్వు బ్యాంకుగా పేర్కొంది). అదే విధంగా కార్పొరేట్‌ పన్నులకు సంబంధించి 2019-20 నుంచి 2023-24 మధ్య కాలంలో రూ.3,67,261 కోట్ల రాబడిని రద్దు చేసినట్టు ఇదే కాలానికి ఇచ్చిన రెవెన్యూ లెక్కలు చెబుతున్నాయి.

అంతులేని అగాథం, కింకర్త్యం?
మరోవైపున చూస్తే శ్రామిక ప్రజానీకం జీవనోపాధిని నిర్దాక్షిణ్యంగా హరించి వేయడం జరుగుతున్నది. కొత్త లేబర్‌ కోడ్‌లు, నిర్ణీత పని దినాలలో ఎన్‌ఆర్‌ఇజిఎ పని హక్కు ఎత్తివేత వంటివి జరుగుతున్నాయి. 2012 ఏప్రిల్‌4-9 తేదీలలో కేరళలోని కొజికోడ్‌లో జరిగిన సీపీఐ(ఎం) 20వ మహాసభ కొన్ని సిద్ధాంత సమస్యలపై ఆమోదించిన తీర్మానంలో మేము ఇలా చెప్పాము: ఏమైనా ప్రస్తుత నయా ఉదారవాద దాడిలో ముందు కొచ్చిన రెండు ధోరణులు దాన్ని నిలబడలేనిదిగా మారుస్తాయి. ఈ విషయం నొక్కి చెప్పడానికి ప్రపంచీకరణకు సంబంధించిన రెండు ముఖ్య లక్షణాలను మరోసారి పేర్కొనవలసి వుంటుంది? మొదటిది: ఈ ప్రక్రియ వల్ల దేశాలలో అంతర్గతంగా పేదలు సంపన్నుల మధ్య అలాగే సంపన్న దేశాలు వర్ధమాన దేశాల మధ్య ఆర్థిక అసమానతలో అది ముడిపడి వుంటుంది.

రెండవది: ప్రపంచీకరణ ఉపాధిరహిత అభివృద్ధి అనేదాన్ని తీసుకొచ్చింది. ”ఎందుకంటే లాభాలను అత్యధికంగా పిండుకునే పథకం వల్ల అనివార్యంగా మానవ శ్రమ బదులు మరింత సాంకేతికను పెంచడమే జరుగుతుంది గానీ మానవ వనరుల సమర్థతను పెంపొందించడం జరగదు”. కనుక ముందున్న మార్గం స్పష్టంగా కనిపిస్తూనే వుంది. అసమానతల తీవ్రతరం, ఉద్యోగాలు లేకుండా చేయడాన్ని ఎదుర్కొంటూ శక్తివంతంగా పోరాటాలు చేయవలసి వుంటుంది. ఈ అంశంపై అత్యధికంగా సమీకరించడం శ్రామిక ప్రజానీకానికి అవసరం. అలాంటి పోరాటం జరక్కపోతే భారతదేశం అత్యంత దారుణంగా కొద్ది మంది సంపన్నుల రాజ్యం (ప్లూటోక్రసీ)గా మారి సమాజమే అల్లకల్లోలమవుతుంది.
(డిసెంబర్‌17 ‘పీపుల్స్‌ డెమోక్రసీ’ సంపాదకీయం)

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -