మైదాన ,ఏజెన్సీలలో ఐటిడిఏ ఏర్పాట్లు చేయాలి
గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎం. ధర్మనాయక్
నవతెలంగాణ – అచ్చంపేట
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు చేవెళ్లలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో దళిత, గిరిజనులకు డిక్లరేషన్ ప్రకటన చేయడం జరిగిందని ఆ డిక్లరేషన్ వెంటనే రాష్ట్రంలో అమలు చేయాలని తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎం ధర్మానాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం పట్టణంలోని టీఎన్జీవో భవనంలో తెలంగాణ గిరిజన సంఘం జిల్లా విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. సమావేశానికి సభావత్ అశోక్ అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు ధర్మానాయక్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో గిరిజనుల జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు 12 శాతానికి పెంచి ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో అమలు చేసి తీరుతామని ఇచ్చిన మాట ఏమైందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. గిరిజనులకు చదువుకుంటున్న ప్రతి ఒక్కరికి చదువు పూర్తయిన ప్రతి ఒక్కరికి ప్రైవేటు విద్యాసంస్థల్లో ప్రైవేటు కంపెనీలలో రిజర్వేషన్లు అమలు చేసి తీరుతామని అన్నారని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఆదివాసి ఎరుకుల సేవాలాల్ పేర్లతో కార్పొరేషన్లు ఏర్పాటు చేసి సంవత్సరానికి 5000 కోట్ల రూపాయలు కేటాయించి గిరిజన తండాలు చెంచుగూడాలు, ఎరుకల పెంటల అభివృద్ధి కోసం దోహద పడతామని, ఇచ్చిన హామీ ఇప్పటివరకు అమలు అమలు చేయడం లేదన్నారు.
వెంటనే కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ప్రత్యేక నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఐదు కొత్త ఐటీడీఏలు ఏర్పాటు చేసి, తొమ్మిది సూపర్ స్పెషల్ హాస్పిటల్ నిర్మాణం చేసి గిరిజనులకు అన్ని రకాల వైద్యాన్ని అందుబాటులో ఉంచుతామని చెప్పిన మాట హామీగానే మిగిలిందన్నారు. ఇప్పటివరకు ఇచ్చిన చెవెళ్ల హామీని అమలు చేసే దాంట్లో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుందని, వెంటనే వాటి కోసం ప్రత్యేక దృష్టి పెట్టి కేంద్రీకరించి గిరిజనుల అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు.
లేనిచో రాపోయే కాలంలో పెద్ద ఎత్తున తెలంగాణ గిరిజన సంఘం ఆధ్వర్యంలో అన్ని తెగల ప్రజలను ఐక్యం చేసి ఉద్యమ పోరాటాలు చేస్తామని ప్రభుత్వాన్ని వారు హెచ్చరించారు. గిరిజన సంఘం గౌరవ అధ్యక్షులు దేశా నాయక్ మాట్లాడుతూ. గత ప్రభుత్వం తండాల అభివృద్ధి కోసం ప్రత్యేక పంచాయతీలు ఏర్పాటు చేసి రాజ్యాధికారం కల్పించిన నిధులు కేటాయించకపోవడంతో తండాల అభివృద్ధి పూర్తిగా కుంటూ పడిపోయిందన్నారు. ప్రతి తండాలకు 25 లక్షలు కేటాయిస్తానన్న హామీని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసి తీరాలని ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు.
గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి శంకర్ నాయక్ మాట్లాడుతూ.. గిరిజన విద్యార్థులు చదువుకుంటున్న కాలేజీలలో ఫీజు రియంబర్స్మెంట్ రాక హాస్టల్లో ఉండే పరిస్థితి లేదని, ప్రభుత్వం బకాయిలు ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేసి గిరిజన విద్యార్థులకు చదువుకు దోహదపడాలని కోరారు. విద్యా జ్యోతి పేరుతో పదో తరగతి చదువుకున్న గిరిజన విద్యార్థులకు 10,000 ప్రోత్సాహకాలు ఇస్తామని, ఇంటర్ వారికి 25000 ఇస్తామని పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన వారికి లక్ష ఎంపీటి హెచ్డి చేసిన వారికి ఐదు లక్షలు ఇస్తామన్న హామీ ఇంకా అమలు కావడం లేదని వారు ప్రశ్నించారు. గిరిజన చదువుకు ఆటంకం లేకుండా ఇట్లాంటి ప్రోత్సాఖాలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం జిల్లా నాయకులు, లక్పతి, దశరథం, హరీష్ నాయక్ వాల్య నాయక్ రమేషు ,మల్లేష్, వెంకటేష్ శ్రీను నాయక్ నరేందర్ అనిత, తదితరులు ఉన్నారు.