Sunday, April 12, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుముఖ్యమంత్రి కుటుంబానిది రియల్‌ దందా

ముఖ్యమంత్రి కుటుంబానిది రియల్‌ దందా

- Advertisement -

అంబానీ జూ పార్కుకు రూ.6వేల కోట్ల భూములు
ఇబ్రహీంపట్నం గడ్డపై కాంగ్రెస్‌ కుట్రలను చిత్తు చేశాం
ఎన్నికల హామీలు మరిచిన ప్రభుత్వం : బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధుల సన్మానసభలో వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌

నవతెలంగాణ- ఇబ్రహీంపట్నం
తెలంగాణలో కాంగ్రెస్‌ అరాచక పాలన సాగిస్తోందని, సీఎం రేవంత్‌రెడ్డి కుటుంబం మొత్తం భూముల చుట్టూనే తిరుగుతోందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం బొంగుళూరు సమీపంలోని ప్రమిద గార్డెన్స్‌లో శనివారం బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధుల సన్మాన కార్యక్రమం నిర్వహించారు. మున్సిపల్‌ చైర్మెన్‌, కౌన్సిలర్లు, సర్పంచుల అభినందన సభకు కేటీఆర్‌ హాజరయ్యారు. ముందుగా మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా ఆయనతో కేక్‌ కట్‌ చేయించారు. అనంతరం సమావేశంలో కేటీఆర్‌ ప్రసంగించారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాన్ని గుప్పిట్లోకి తెచ్చుకునేందుకు ప్రభుత్వం పక్కా స్కెచ్‌ వేసిందన్నారు.

అంబానీ జూపార్క్‌ ఏర్పాటు కోసం ఎకరానికి రూ.2 కోట్ల విలువ చేసే 3వేల ఎకరాల ప్రభుత్వ భూమిని కట్టబెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. హైదరాబాద్‌ నుంచి మాడుగుల వరకు రేవంత్‌ రెడ్డి కుటుంబం భూములు కొనుగోలు చేస్తోందని ఆరోపించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని రైతులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని విమర్శించారు. తమ హయాంలో 16 లక్షల ఎకరాలు ఉన్న నిషేధిత జాబితా నేడు కోటి ఎకరాలకు చేరడమే.. ఈ ప్రభుత్వ భూదందాలకు నిదర్శనమన్నారు. సామాన్య రైతులను సైతం ఈ జాబితా పేరుతో బెదిరిస్తూ సెటిల్‌మెంట్లు చేసుకుంటున్నారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఫార్మాసిటీ రైతులకు భూములు తిరిగి ఇస్తామని నమ్మబలికిన రేవంత్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక ఆ హామీని బుట్టదాఖలు చేశారని అన్నారు. ఎన్నికల ప్రచారంలో భట్టి విక్రమార్క, సీతక్క, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కోదండరెడ్డి చెప్పిన మాటలు ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు.

మళ్లీ అదే రైతులకు చెందిన వేల ఎకరాలను భూసేకరణ చేస్తూ దగా చేస్తున్నారని విమర్శించారు. చివరకు కోహెడ పండ్ల మార్కెట్‌ కోసం కేటాయించిన 178 ఎకరాలను కూడా వదలకుండా కాజేసేందుకు కుట్ర పన్నుతున్నారని అన్నారు. అధికార పార్టీ ఎన్ని అక్రమ కేసులు బనాయించినా.. కౌన్సిలర్లను ప్రలోభపెట్టాలని చూసినా ఇబ్రహీంపట్నంలో గులాబీ జెండా రెపరెపలాడిందని చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ కాంగ్రెస్‌ నేతలకు తొత్తులుగా మారిన అధికారులను తాము మరిచిపోబోమని, భవిష్యత్‌లో వారందరికీ వడ్డీతో చెల్లిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షులు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, భువనగిరి పార్లమెంట్‌ ఇన్‌చార్జి క్యామా మల్లేష్‌, బీఆర్‌ఎస్‌ యువ నాయకులు మంచిరెడ్డి ప్రశాంత్‌కుమార్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మెన్‌ సత్తు వెంకటరమణరెడ్డి, ఇబ్రహీంపట్నం మున్సిపల్‌ చైర్మెన్‌ సుదర్శన్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు పల్లె గోపాల్‌గౌడ్‌, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మెన్‌ చంద్రయ్య, నాయకులు దండెం రాంరెడ్డి, వంగేటి లక్ష్మారెడ్డి, తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -