Saturday, February 14, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలు'పట్టణం' హస్తానిదే

‘పట్టణం’ హస్తానిదే

- Advertisement -

68 మున్సిపాల్టీల్లో కాంగ్రెస్‌కు స్పష్టమైన ఆధిక్యం
బీఆర్‌ఎస్‌ 14కే పరిమితం
33 చోట్ల హంగ్‌
1,530 వార్డుల్లో కాంగ్రెస్‌ అభ్యర్థుల గెలుపు
775 స్థానాలతో రెండో స్థానంలో బీఆర్‌ఎస్‌
4 కార్పొరేషన్లలో కాంగ్రెస్‌ పాగా
నిజామాబాద్‌, కరీంనగర్‌లో బీజేపీకి మెజార్టీ స్థానాలు
కొత్తగూడెంలో అత్యధిక స్థానాలు దక్కించున్న సీపీఐ
16న మేయర్‌, డిప్యూటీ మేయర్‌, చైర్మెన్‌, వైస్‌ చైర్మెన్ల ఎన్నిక

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
మున్సిపల్‌ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్‌ పార్టీ హవా కొనసాగింది. మొత్తం 116 మున్సిపాల్టీలు, ఏడు కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగాయి. వాటిలో 64 మున్సిపాల్టీలు, 4 కార్పొరేషన్లలో కాంగ్రెస్‌పార్టీ సంపూర్ణ మెజారిటీ సాధించింది. 14 మున్సిపాల్టీల్లో బీఆర్‌ఎస్‌ గెలిచింది. బీజేపీ ఏ మున్సిపాల్టీలోనూ స్పష్టమైన ఆధిక్యతను కనబర్చలేదు. కరీంనగర్‌, నిజామాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్లలో హంగ్‌ ఏర్పడింది. ఇక్కడ బీజేపీ అత్యధిక స్థానాల్ని గెలిచింది. కొత్తగూడెం మున్సిపాల్టీని బీఆర్‌ఎస్‌ మద్దతుతో సీపీఐ కైవసం చేసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాల్టీలు, కార్పొరేషన్లలో 2996 వార్డులో ఎన్నికలు జరగాల్సి ఉండగా, 12 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. ఒక వార్డులో ఎన్నిక వాయిదా పడింది. మిగిలిన 2,983 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. వాటిలో తుది వార్తలు అందే సమయానికి కాంగ్రెస్‌ పార్టీ 1,533 వార్డుల్లో గెలుపొందింది.

బీఆర్‌ఎస్‌ 775, బీజేపీ 330, ఇతరులు 173, ఎంఐఎం 70 వార్డుల్లో విజయం సాధించాయి. సీపీఐ 35, సీపీఐ(ఎం) 13 వార్డులు గెలిచాయి. ఇటీవల జరిగిన సర్పంచ్‌ ఎన్నికలు పార్టీ రహితంగా జరిగినప్పటికి ఆ పార్టీ బలపర్చిన వారే మూడింట రెండోంతుల మంది జయ కేతనం ఎగుర వేశారు. మున్పిపల్‌ ఎన్నికల్లోనూ సర్పంచ్‌ ఫలితాలే పునరావృతం అయ్యాయి. రామగుండం కార్పొరేషన్‌లో మొత్తం 60 వార్డుల్లో 30, మంచిర్యాలలో 60 డివిజన్లలో 46, నల్లగొండలో 48 వార్డుల్లో 27 స్థానాల్ని కాంగ్రెస్‌పార్టీ కైవసం చేసుకుంది. మహబూబ్‌ నగర్‌లో మొత్తం 60 స్థానాల్లో కడపటి వార్తలందే సరికి 43 స్థానాలకు ఫలితాలు వెల్లడయ్యాయి. అందులో కాంగ్రెస్‌కు 24స్థానాలు దక్కాయి. నిజామాబాద్‌, కరీం నగర్‌లలో బీజేపీ మెజార్టీ స్థానాలను దక్కించుకున్నా మేజిక్‌ ఫిగర్‌ను అందుకోలేకపోవడం తో ఇక్కడ మేయర్‌ ఎన్నిక రసవత్తరంగా మారనుంది.

ఇండిపెండెంట్లు, ఇతర పార్టీల అభ్యర్థుల మద్దతు కోసం ఆ పార్టీ పావులు కదుపుతోంది. కొత్తగూడెంలో ఒంటరిగా పోటీ చేసిన సీపీఐ మెజార్టీ స్థానాలను దక్కించుకుంది. మొత్తం 60 స్థానాల్లో కాంగ్రెస్‌, సీపీఐ చెరో 22 డివిజన్లలో విజయం సాధించారు. ఇక్కడ బీఆర్‌ఎస్‌ 8 స్థానాలను గెలిచి, సీపీఐకి మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించింది. దీనితో కొత్తగూడెం మున్సిపల్‌ కార్పొరేషన్‌ సీపీఐ వశం అయ్యింది. కాంగ్రెస్‌పార్టీ నేరేడుచర్ల, హుజూర్‌నగర్‌, హాలియా, కోదాడ, నందికొండ, చండూరు, చిట్యాల, భూత్పూర్‌, ధర్మపురి, భీంగల్‌, బిచ్కుంద, బాన్సువాడ, ఎల్లారెడ్డి, చొప్పదండి, సుల్తానాబాద్‌, చెన్నూరు, మంథని, హుస్నాబాద్‌, మరిపెడ, డోర్నకల్‌, నారాయణఖేడ్‌, సంగారెడ్డి, ఆందోలు-జోగిపేట, సదాశివపేట, రామాయంపేట, హుజూరాబాద్‌, కొల్లాపూర్‌, కల్వకుర్తి, మద్దూరు, పెబ్బేరు, స్టేషన్‌ఘన్‌పూర్‌, మధిర, అశ్వారావుపేట, ఇల్లెందు, ములుగు, యాదిగిరిగుట్ట, ఆలేరు మున్సిపాల్టీల్లో స్పష్టమైన మెజారిటీ సాధించింది.

గడ్డపోతారం, ఇంద్రేశం, అయిజ, తొర్రూర్‌, ఇబ్రహీంపట్నం, తిరుమలగిరి, ఆమన్‌గల్‌, సిరిసిల్ల సహా మొత్తం 14 మున్సిపాల్టీలను బీఆర్‌ఎస్‌ వశం చేసుకుంది. జోగులాంబ గద్వాల జిల్లాలోని వడ్డేపల్లి మున్సిపాల్టీలో ఫార్వర్డ్‌ బ్లాక్‌ మెజార్టీ స్థానాలను దక్కించుకుంది. దేవరకద్ర, అలంపూర్‌, దేవరకొండ, ఆలియాబాద్‌, కోహీర్‌, కేసముద్రం, ఆసిఫాబాద్‌, అమరచింత, గద్వాల, క్యాతనపల్లి, జనగామ, జిన్నారం, నర్సాపూర్‌, జమ్మికుంట, వేములవాడ, రాయికల్‌, జహీరాబాద్‌, బెల్లంపల్లిల్లో ఏపార్టీకి స్పష్టమై మెజార్టీ రాలేదు. ఇండిపెండెంట్లు ఇతర పార్టీల అభ్యర్థుల మద్దతుపై ఇక్కడ ఎవరికి అధికారం దక్కనుందో ఈ నెల 13న తేలనుంది.

క్యాంపులు నడిపితే చర్యలు : ఎస్‌ఈసీ
క్యాంప్‌ రాజకీయాల పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్లను ఎన్నికల సంఘం ఆదేశించింది. నిఘా, తనిఖీ బృందాలను మరింత అప్రమత్తం చేయాలని సూచించింది. ఈనెల 16న ఛైర్‌పర్సన్లు, మేయర్ల ఎన్నికలు ముగిసే వరకు ఎన్నికల కోడ్‌ అమల్లో ఉంటుందని ఎస్‌ఈసీ స్పష్టం చేసింది. ఎన్నిక ధ్రువపత్రం స్వయంగా విజేతలకే అందచేయాలని తెలిపింది. ఎన్నికల కోడ్‌కు కట్టుబడి ఉంటామని విజేతలు డిక్లరేషన్‌ ఇవ్వాలని ఆదేశించింది. బీఎన్‌ఎస్‌ఎస్‌ 163 సెక్షన్‌ అమల్లో ఉంటుందనీ, ముగ్గురికి మించి గుంపుగా ఉండరాదని పేర్కొంది.

ముందస్తు అనుమతి లేకుండా ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించేలా ప్రయివేట్‌, టూరిస్ట్‌ బస్సులు, ఇతర వాహనాల్లో వెళ్లవద్దని పేర్కొంది. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించిన విజేతలు, పార్టీలకు వెంటనే నోటీసు ఇవ్వాలని జిల్లా అధికారులను ఎస్‌ఈసీ ఆదేశించింది. కోడ్‌ ఉల్లంఘిస్తే డిక్లరేషన్‌, ఎన్నికల నిబంధనల మేరకు విజేతలపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఆయా జిల్లాల్లో జరుగుతున్న పరిణామాలపై ఎప్పటికప్పుడు నివేదికలు ఇవ్వాలని ఎన్నికల సంఘం జిల్లా కలెక్టర్లను ఆదేశించింది.

త్వరలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు
సర్పంచ్‌, మున్సిపల్‌ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు దక్కించుకుని జోష్‌లో ఉన్న కాంగ్రెస్‌ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు వెళ్లాలని భావిస్తోంది. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి సైతం దీనికి సానుకూలంగా ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే రిజర్వేషన్ల డ్రాఫ్ట్‌ లిస్ట్‌ను ప్రభుత్వానికి, సీఎంకు అధికారులు అందించారు. రెండు విడతలుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) భావిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఆమోదిస్తే మార్చి మొదటి వారంలో షెడ్యూల్‌ విడుదల చేసే అవకావం ఉందని తెలుస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -