Thursday, January 15, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఈవీఎంల ట్యాంపరింగ్‌ ప్రచారం మాత్రమే

ఈవీఎంల ట్యాంపరింగ్‌ ప్రచారం మాత్రమే

- Advertisement -

– ఈయూ అధికారులతో తెలంగాణ సీఈవో బందం భేటీ
– ఎన్నికల నిర్వహణ, తీసుకోవాల్సిన చర్యలపై చర్చలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

ఈవీఎంలు పూర్తిగా స్టాండ్‌అలోన్‌ విధానంలో నెట్‌వర్క్‌కు అనుసంధానం లేకుండా పనిచేస్తాయనీ, ఎలాంటి ట్యాంపరింగ్‌కు అవకాశం లేదని తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) సి.సుధర్శన్‌రెడ్డి అన్నారు. మంగళవారం బ్రస్సెల్స్‌లో ఎఫ్‌పీఎస్‌ ఇంటీరియర్‌ డైరెక్టర్‌ జనరల్‌ హెచ్‌ఈ. అన్నబెల్‌ హాగెమాన్‌తో పాటు పార్లమెంట్‌ ఉన్నతాధికారులతో సీఈవో బృందం భేటీ అయింది. భారత దేశంలో ఎన్నికల నిర్వహణకు అనుసరిస్తున్న విధివిధానాలు, తీసుకుంటున్న చర్యలను వారికి వివరించారు. 2024-25లో దేశవ్యాప్తంగా 97.9 కోట్ల మంది ఓటర్ల కోసం ఎన్నికలు నిర్వహించామనీ, ఇందుకోసం రూ.2 కోట్ల మందికిపైగా సిబ్బందిని వినియోగించామని సుధర్శన్‌ రెడ్డి తెలిపారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికల కసరత్తుగా నిలిచిందని పేర్కొన్నారు. 23 భాషలు, విభిన్న మతాలు, హిమాలయ పర్వత ప్రాంతాల నుంచి దీవుల వరకు విస్తరించిన భౌగోళిక పరిస్థితుల్లోనూ ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించేలా పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఒక్కో పోలింగ్‌ బూత్‌లో కనీసం ఒకరు నుంచి గరిష్టంగా 1,500 మంది వరకు ఓటర్లు ఉండే విధంగా వ్యవస్థను రూపొందించామన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఓటర్ల జాబితాను భారత్‌ నిర్వహిస్తోందనీ, ఏడాది పొడవునా నమోదు ప్రక్రియ కొనసాగుతుందని వివరించారు. జనవరి 2025లో ప్రచురించిన దాదాపు వంద కోట్ల పేర్లలో 2 కోట్ల క్లెయిమ్స్‌, అభ్యంతరాలను పరిష్కరించామని తెలిపారు. రాజకీయ పార్టీలు, బూత్‌ స్థాయి ఏజెంట్లు ఈ ప్రక్రియలో సమాంతర ఆడిటర్లుగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. 2024 ఎన్నికల్లో ఒకే రోజులో 70.5 కోట్ల ఓట్లను 62 లక్షల ఈవీఎంలతో లెక్కించామనీ, 81.7 కోట్ల వీవీప్యాట్‌ స్లిప్పులను ఓటర్లు వీక్షించారని తెలిపారు. లెక్కింపులో 1.6 కోట్ల స్లిప్పుల భౌతిక పరిశీలనలో ఒక్క తప్పు కూడా తేలలేదన్నారు. గత 35 ఏండ్లలో ఈవీఎంలపై దాఖలైన 41 కేసులను సుప్రీంకోర్టు కొట్టివేసిందని చెప్పారు. రాజ్యాంగ, చట్టపరమైన పరిమితుల్లో వేలాది మంది జనరల్‌, పోలీస్‌, వ్యయ పరిశీలకుల పర్యవేక్షణలో ఎన్నికలు నిర్వహిస్తున్నామనీ, ఓటర్లు, అభ్యర్థుల కోసం అనేక డిజిటల్‌ యాప్‌లు అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -