కొండచరియలు విరిగిపడటం, ఉధృతమైన వరదల రూపంలో హిమాలయాలు మనతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూనే ఉన్నాయి. ఇవన్నీ దేవుని చర్యలు కావని శాస్త్ర విజ్ఞానం మనకి చెబుతూనే ఉంది. దీనికి కారణం పర్యావరణ విధ్వంసం, కార్పొరేట్ దురాశ, రాజకీయ నిర్లక్ష్యమే! హిమాలయాలు ప్రమాదంలో ఉన్నాయి.ఇటీవలి ఘటనలు పంజాబ్‌లో వరదలు, జమ్ముకాశ్మీర్‌లో హఠాత్తుగా కురిసిన కుండపోత వానలు ఉత్తరాఖండ్‌లో బురదమేట వేయడంతో గ్రామాలకు గ్రామాలు తుడిచిపెట్టుకు పోవడం, ఒకప్పుడు తాత్కాలిక ప్రకృతి వైపరీత్యాలుగా పరిగణించబడేవి. కాని, నేడు నిరంతర పరిణామాలైపోయాయి. ఒక్కరాత్రి కురిసిన కుండపోత వాన శతాబ్దాల మానవ నివాసాల్ని తుడిచిపెట్టేయడం ఒక భయానక, సాధారణ ఘటనగా మారిపోయింది. ఇదంతా ఒక క్రూరమైన పరిస్థితికి దారితీస్తుంది. ముందు మీడియా వాలిపోతుంది. జరిగిన దుర్ఘటనను, దాని ఫొటోలను, అక్కడి బీభత్సాన్ని ప్రపంచానికి వెదజల్లుతుంది. రాజకీయ నాయకులు సంతాప సందేశాల్ని వెళ్లగక్కుతారు. ”వీరోచిత”మైన తాత్కాలిక ఉపశమన చర్యలు ప్రకటిస్తారు. కెమేరాలు అవతలికి పోగానే చేసిన వాగ్దానాలు గాల్లో కలిసిపోతాయి.
మరో ఉపద్రవం వచ్చేంతవరకు చెవులు చిల్లులు పడేంత నిశ్శబ్దం అలుము కుంటుంది. పొంచి వున్న అసలు జబ్బును కాక రోగ లక్షణాలకు గోశాయి చిట్కాలు వేయటం మన పాలకులకు అలవాటైపోయిన విద్య. ఇటీవలి దుర్ఘటన ఒక సంక్షోభం. అది అర్థం కావాలంటే పైపైన చూస్తే చాలదు. లోతుల్లో కెళ్లి పరిశీలించాలి. పాలకులు చెప్పే అభివృద్ధి నమూనా ఎంతటి బోలైందో నిష్ణాతులైన శాస్త్రవేత్తలు ఏమి చెప్తున్నారో వినాలి. ఉత్తరాఖండ్‌కు చెందిన భూగర్భ శాస్త్రవేత్త డాక్టర్ ఎస్.పి.సతి ”ప్రస్తుత ప్రమాదకర వర్షాలకు కారణం ఒక అరుదైన ప్రమాదకర వాతావరణ మార్పుల ‘కాక్ టెయిల్’ అంటారు” ఉత్తర భారతదేశంలో వర్షాలు ఏడాదిలో రెండు పద్ధతుల్లో పడ తాయట. ఒకటి నైరుతి రుతుపవనాలు. రెండు పశ్చిమానున్న కల్లోల పరిస్థితివల్ల. రెండవది చలికాలంలో రాగా, మొదటిది ఎండాకాలంలో వస్తుంది. ఏమైనా, కొన్ని సందర్భాల్లో నైరుతీ వర్ష రుతువు జూన్ నుండీ సెప్టెంబరు మధ్య ఎండాకాలంలో హిమాలయ పర్యత ప్రాంతాల్లో చురుగ్గా ఉంటోంది. పడమటి కల్లోల పరిస్థితులు కూడా ఇదే సమయంలో అదనంగా, అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడన పరిస్థితులు విపరీతమైన తేమతో కలిసి హిమాలయాలవైపు కదుల్తాయి.
ఇది మూడురకాల తేమ సంగమించే పరిస్థితుల్ని సృష్టిస్తున్నాయి. ఇది పశ్చిమ హిమాలయాల్లోనూ, ఒకింత మధ్య హిమా లయాల్లోనూ విపరీత వర్షపాతానికి కారణమవుతున్నది. ఇది వారం దాకా కొనసాగుతోంది. 2013లో కేదార్‌నాథ్‌లో వచ్చిన వరదల ఉపద్రవానికి కారణమైంది. నేటి పరిస్థితికీ అదే కారణం. అల్పపీడన ద్రోణి ఉత్తరాఖాండ్, హిమాచల్‌ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలపై కేంద్రీకరించి ఉండింది. దీనివల్ల తూర్పునున్న కాళీనది నుండి సట్లెజ్ వరకు 16, 17 నదులకు ఏకకాలంలో వరదలొచ్చాయి. ఇటీవలి వరకు ఈ అల్పపీడన ద్రోణి పశ్చిమ హిమాలయాలపై నుంది. కాశ్మీర్ నుండి ఉత్తరాఖాండ్ వరకు ప్రతి నది ప్రమాద సూచికకు దగ్గరిగా లేదా దాటి ప్రవహిస్తున్నాయి. ఈ కాలంలో మైదాన ప్రాంతంలో విస్తృతంగా వరదలొస్తున్నాయి. ఈ వరదలకు కారణం పర్యావరణ మార్పులేననేది స్పష్టం. పైగా వర్షాకాలంలో పూర్తి మార్పులు సంభవిస్తున్నాయి. ఈ పరిస్థితి గతంలో అరుదుగా చూసేవారం. నేడు హిమాలయ పర్యావరణ వ్యవస్థ పెళుసు(ఫ్రైజైల్)గా తయారైంది.
మానవ నిర్మిత సంక్షోభ కారకాలు
వాతావరణ పరిస్థితులు భారీవానలకు కారణమైతే, మానవ చేష్టలు ఈ వాతావరణ మార్పులను మానవ కారక మహావిపత్తుగా మార్చాయి. ఇది ప్రకృతి కారక సంక్షోభంకాదు. ఇది ప్రాధాన్యతల వల్ల ఏర్పడిన సంక్షోభం. మనం ఎలా అభివృద్ధి చెందాలో, ఎవరికోసం అభివృద్ధి చెందాలో నియంత్రించకపోతే మన నిర్లక్ష్యాన్ని హిమాలయాలు గుర్తుచేస్తూనే ఉంటాయి. హిమాలయాల వయసు తక్కువ. భూమి పలకల కదలికల (టెక్టానిక్ మూవ్‌మెంట్) వల్ల ఏర్పడ్డాయి. అందుకే భారీ నిర్మాణాలు ఇక్కడ జరుగరాదు. చాలా ఆచితూచి నిర్మాణాలు జరపాలి. నేడు దీనికి భిన్నంగా జరుగు తోంది. అది ప్రమాదకరమైంది. అడవుల విధ్వంసం, భారీ ప్రాజెక్టుల కోసం జరిగే బ్లాస్టింగులు, నదీ గర్భంలో జరిగే ఇసుక తవ్వకాలు, నిలకడలేని చోట జరిగే నిర్మాణాలు ఇప్పటికే పెళుసైన హిమాలయాల్ని మరింత ప్రమాదంలోకి నెడుతున్నాయి. ఎంతవరకూ మానవ కార్యకలాపాలు అనుమతించగలవో హిమాలయాలకు ఒక లెక్కుంది. కాని విపరీతమైన నిర్మాణాలు, ప్రణాళికలేని టూరిజం, అన్ని వాతావరణాలకు (ఆల్ వెదర్) సరిపోయే రోడ్ల పేర నిర్మించిన చార్‌ధామ్ రోడ్డు వంటివి ఈ లెక్కను దాటుతున్నాయి. ఇవన్నీ ఈ ప్రాంతాన్ని మరింత దుర్భలంగా తయారు చేస్తున్నాయి. మనం వెంటనే కదలకపోతే పర్యావరణం మళ్లీ మార్చ వీలులేని స్థితికి నెట్టబడుతుంది. దానివల్ల మైదాన ప్రాంత ప్రజలతో సహా కోట్లాది ప్రజల జీవితాలు ప్రమాదంలో పడతాయి.
గత కొద్ది దశాబ్దాలుగా హిమాలయాల కథ ఈ ప్రమాదకర పరిణామంలో ఉంది. నదుల వెంట నిర్మించిన రోడ్లు పథకంలేని పట్టణీకరణకు గుర్తుగా మిగి లాయి. వరదలు వచ్చే ప్రాంతంలో పుట్టుకొచ్చిన పట్టణాలు, అస్థిరమైన పర్వత సానువుల్లో బహుళ అంతస్తుల భవనాలు, హోటళ్లు, పాఠశాలలు వంటి నిరంతర ఆర్థిక కార్యకలాపాలు నిర్వ హిస్తున్నారు. వీటికి ఎటువంటి భూగర్భ అంచనాలు గాని, నియంత్రణలు గానీ లేవు. ఉదాహరణకు ‘ధరాలీ’నే తీసు కుందాం. అది కొంత ఎత్తులోనే ఉంది. కాని కొట్టుకొచ్చిన ఒండ్రు, మట్టిపై నిర్మించిన మరో గ్రామం ధ్వంస మైపోయింది. దానికి బాధ్యులెవరు? అక్కడ నిర్మాణానికి అనుమతించిన ప్రభు త్వమా? ప్రమాదం ఉంటుందని తెలిసినా ఇండ్లు నిర్మించుకున్న ప్రజలా? బతుకు దెరువుకు అంతకంటే మార్గంలేని పరిస్థితులా? నిజానికి మనందరిదీ సమిష్టి బాధ్యతే!
నేర్చుకోని పాఠాలు
ముందే స్క్రిప్ట్ అంతా తెలిసినా మనం నిర్లక్ష్యం చేశాం. హిమాచల్‌లోని ఛిర్‌గావ్‌నే తీసుకుందాం. 1997లో మేఘ విస్ఫోటనం 200 మందిని బలిగొంది. దానికి ఆనాడు ప్రకతిని నిందించారందరూ! కానీ, అది మానవ తప్పిదం. నిర్లక్ష్య నిర్ణయాలు, కార్పొరేట్ల పేరాశతో అస్థిరమైన అభివద్ధి నమూనా పర్వతాన్ని పెళుసుగా తయారుచేసింది. స్థానిక ప్రజలకు తెలిసిన విషయాలుగాక అశాస్త్రీయ ప్లానింగ్ ఫలితమిది. 28 ఏండ్ల తర్వాత అదే ఛిర్‌గావ్ నేడు మరింత చిక్కటి జనసాంద్రతతో ఉంది. నాడు తుడిచి పెట్టుకుపోయిన ప్రాంతంలోనే నేడు బస్టాండ్, ఇతర భవనాలు నిర్మించారు. అడవుల్ని రక్షించాలని, భవనాల నిర్మాణాలు నియంత్రించాలనే శాస్త్రవేత్తల హెచ్చరికలు పట్టించుకునే నాధుడే లేడు. ఎందుకంటే రాజకీయులకు పర్యావరణ పరిరక్షణకన్నా, కార్పొరేట్ల, బిల్డర్ల లాభాలే ముఖ్యం.
వారి దష్టిలో నదులు, అడవులు, రియల్ ఎస్టేట్ నిర్మాణానికి పనికొచ్చే సాధనాలు. ఉపద్రవం జరిగిన తర్వాత బుల్‌డోజర్లు, హెలికాఫ్టర్లు వస్తాయి. అసలు జరుగకుండా చూసే ప్లానింగ్, స్లోప్ మ్యాపింగ్, మొత్తం సమా జాన్ని సన్నద్ధం చేసుకోవడం లాంటి వాటికి నిధుల లేమి వెంటాడుతోంది. రాజకీయ సంకల్పం అసలు కనపడడంలేదు.
దీనికి పరిష్కారం కనుగొనడమంటే అభివృద్ధిని అడ్డుకోవడం కాదు. మనం కోరుకునే అభివృద్ధి ఏ విధమైంది? అది ఎవరికి లబ్దిచేకూర్చాలి? ఇవి కీలక ప్రశ్నలు. చర్చ దీన్నుండి పక్కదారి పట్టకూడదు. అసలు స్థానిక ప్రజల కేంద్రంగా ప్లానింగ్ జరగాలి. వారి సాంప్రదాయబద్ధమైన విజ్ఞానాన్ని ఆధునిక శాస్త్ర విజ్ఞానంతో సమ్మిళితం చేసి ఆచరణాత్మకమైన పరిష్కారాలు కనుగొనాలి.
ఇదంతా జరగాలంటే నిర్ణయాలు కింది స్థాయి ప్రజా సమూహాలు, శాస్త్రవేత్తలు, పౌర సమాజ బృందాలు కలిసి పనిచేసే ఏర్పాట్లుండాలి. అపుడు ప్రమాదాన్ని పసిగట్టగలుగుతారు. సుస్థిరాభివద్ధికి ప్రణాళికలు రచించి అటు ప్రజల్ని, ఇటు పర్యావరణాన్ని కాపాడగలుగుతారు. అభివద్ధి అనేది పైనుండి కిందికి రుద్దేదికాదు. ప్రజలతో, స్థానిక వాస్తవాలతో సంబంధం లేకుండా ఉండరాదు.
కొండచరియలు విరిగి పడటం, ఉధృతమైన వరదల రూపంలో హిమాలయాలు మనతో మాట్లాడుతూనే ఉన్నాయి. ఇవన్నీ దేవుడి చర్యలు కాదని శాస్త్రవిజ్ఞానం చెప్తూనే ఉంది. వాతావరణ విధ్వంసం, రాజకీయ నిర్లక్ష్యం, కార్పొరేట్ దురాశవల్లనే ఈ పరిస్థితి దాపురించింది.
(రచయిత: ప్రముఖ పర్యావరణవేత్త, హిమాలయాలపై ప్రత్యేక అధ్యయనం చేసిన వ్యక్తి)
డా.ఓ.పి. భూరెయిత