Tuesday, August 26, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలుసామాన్యుడే టార్గెట్‌

సామాన్యుడే టార్గెట్‌

- Advertisement -

– డిజిటల్‌ చెల్లింపులే సాక్ష్యం
– చిరువ్యాపారుల్ని జీఎస్టీ పరిధిలోకి తేవడమే లక్ష్యం
– రెండు శ్లాబుల మతలబు అదే..
ఇప్పటి వరకు జీఎస్టీలో 5, 12, 18, 28, 40 శ్లాబులు ఉన్నాయి. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ ఈ శ్లాబుల్ని రెండుగా కుదిస్తామని ప్రకటించి, దానికి దీపావళిని ముహుర్తంగా నిర్ణయించారు. ఆ తర్వాత కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఆర్థికశాఖల మంత్రులతో ఢిల్లీలో సమావేశం నిర్వహించారు. జీఎస్టీలో 5, 12, 40 శాతం శ్లాబులు మాత్రమే ఉంటాయనీ, 18, 28 శ్లాబుల్ని ఎత్తేస్తా మని ప్రకటించారు. ఈ నిర్ణయం ప్రజలకు మేలు కలిగించేదిగా ఉండాలనీ, అంతిమంగా వినియోగదారుడు లాభ పడాలని ప్రతిపక్షపార్టీల ఏలుబడిలో ఉన్న రాష్ట్రాలు కేంద్రానికి విజ్ఞప్తి చేశాయి. దీనిలో కేంద్రం చేయాల్సిన జిమ్మిక్కులపై కసరత్తు మొదలైంది. అది ప్రజలకు మేలు చేస్తుందా లేక మోయలేని భారాల్ని విధిస్తుందో వేచిచూడాలి! ఈలోపు ప్రజల్లోని ఆందోళనల్నీ పరిగణనలోకి తీసుకోవాల్సిందే!!
నవతెలంగాణ – హైదరాబాద్‌ బ్యూరో

ఊర్లో గొల్లల దగ్గర క్యాన్‌ తీసుకెళ్లి బర్రెపాలు పోయించుకుంటే ఐదు శాతం జీఎస్టీ…అవే పాలను ప్యాకెట్ల రూపంలో కొనుగోలు చేస్తే 12 శాతం జీఎస్టీ. చెరకుపై ఐదు శాతం జీఎస్టీ…చక్కెరపై 12 శాతం జీఎస్టీ…ఇప్పుడు చెప్పండి…కప్పు చారు రేటు ఎంతవుతుంది? ఇప్పుడైతే రూ.20 ఉంది. పై జీఎస్టీ శ్లాబులు అమల్లోకి వస్తే అదే కప్పు టీ రూ.30 నుంచి రూ.40కి చేరినా ఆశ్చర్యం లేదు. జీఎస్టీని రెండు శ్లాబుల్లోకి కుదిస్తే నిత్యవసర వస్తువుల ధరలు దిగొచ్చి, కామన్‌మ్యాన్‌కు ఆర్థిక ప్రయోజనం కలుగుతుందని బీజేపీ అనుకూల మీడియా ఊదరగొడుతోంది. కేంద్రంలో ఉన్నది ఫక్తు వ్యాపార పార్టీ బీజేపీ, ప్రధానిగా ఉంది పక్కా వ్యాపారవేత్తలకు వత్తాసు పలికే నరేంద్రమోడీ. ఆపార్టీ ఎంపీలు, మంత్రులు, రాష్ట్రాల్లో ఉన్న ఎమ్మెల్యేలు సహా అందరూ ఏదో ఒక వ్యాపారంలో భాగస్వాములే. వారందరూ తమ వ్యాపారాల్లో వచ్చే లాభాల్ని తగ్గించే సుకొని, ప్రజాసేవలో పునీ తులు అవుతారంటే నమ్మేదెలా? కచ్చితంగా జీఎస్టీ రెండు శ్లాబుల్లో ఏదో గోల్‌మాల్‌ ఉండటం ఖాయంగా కనిపిస్తోంది. తక్కువ వినియోగం ఉండే వస్తువుల్ని ఐదు శాతం జీఎస్టీ పరిధిలోకి, ఎక్కువ వినియోగం ఉండే వస్తువుల్ని 12 శాతం శ్లాబ్‌లోకి మారిస్తే పరిస్థితి ఏంటి? ఎటూ శ్లాబులు కుదించాం కాబట్టి, ఇప్పటి వరకు జీఎస్టీ పరిధిలోకి రాని వస్తువుల్ని కూడా ఐదు లేదా 12 శాతం శ్లాబుల్లో చేర్చరనే గ్యారెంటీ లేదు.

పోనీ బీజేపీ అనుకూల మీడియా ప్రచారం చేస్తున్నట్టు నిత్యవసర వస్తువుల ధరలు తగ్గి, యూపీఐ పేమెంట్స్‌ పెరిగితే, కచ్చితంగా కొన్ని లక్షల మంది చిరువ్యాపారులు జీఎస్టీ పరిధిలోకి రావడం తథ్యం! మినరల్‌ వాటర్‌బాటిల్‌పై ఐదు శాతం జీఎస్టీ విధించి, బియ్యంపై 12 శాతం జీఎస్టీ వేస్తే మెతుకు ఉడుకుతుందా? ముద్ద గొంతులోకి జారుతుందా? ఇప్పటికే నిత్యవసర వస్తువులు, పూలు, పండ్లు సహా మార్కెట్‌ మొత్తం డీ మార్ట్‌, రిలయన్స్‌ ఫ్రెష్‌ వంటి కార్పొరేట్‌ సంస్థల చేతిలోకి వెళ్లిపోయాయి. కేంద్రం కుదించే జీఎస్టీ శ్లాబు ప్రయోజనాలు సామాన్యులకు వెళ్తాయో… కార్పొరేట్ల జేబుల్లోకి వెళ్తాయో తేల్చడం పెద్ద కష్టమేం కాదు. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్‌ ఆయిల్‌ రేటు తగ్గినా, పెట్రోల్‌, డీజిల్‌ రేట్లను కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం తగ్గించలేదు. వంటగ్యాస్‌ రేటు ప్రతినెలా కేవలం పది, పదిహేను రూపాయల మధ్యే హెచ్చుతగ్గులు అవుతుందే తప్ప, బేస్‌ రేట్‌ను మోడీ సర్కార్‌ ఏమాత్రం తగ్గించలేదు. అలాంట ప్పుడు జీఎస్టీ శ్లాబులు 5, 12 శాతాలకే పరిమితం అయితే మన జేబులు ఏవో బరువెక్కిపోతాయి అనుకుంటే పొరపాటే!


యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (యూపీఐ) లావాదేవీలకు సంబంధించిన భారీ జీఎస్టీ బిల్లులు చిన్న వ్యాపారులు, విక్రేతలపై పెను భారం మోపుతున్నాయి. దీనితో వారంతా నగదు లావాదేవీల వైపు మొగ్గు చూపుతున్నారు. టర్నోవర్‌ పరిమితి దాటిన తర్వాత జరిపే చెల్లింపులు నగదు రూపంలో వచ్చినా లేక డిజిటల్‌ రూపంలో వచ్చినా జీఎస్టీ వర్తిస్తుందని కర్నాటక వాణిజ్య పన్నుల శాఖ ఇటీవలే వివరణ ఇచ్చింది. ఇది చిన్న వ్యాపారులను తీవ్రంగా కలవరపెడుతోంది.


ఇది కేవలం ఫుట్‌పాత్‌ వ్యాపారులకే కాదు. చిన్న మధ్య తరహా పరిశ్రమలపైనా తీవ్ర ప్రభావాన్నే చూపుతుంది. ముడిసరుకుపై జీఎస్టీని తగ్గించి, వస్తువుగా మారిన తర్వాత, పరిశ్రమ నుంచి డీలర్‌, హోల్‌సెల్లర్‌, రిటైలర్‌ ద్వారా వినియోగదారుడికి చేరే ప్రతి దశలోనూ 12 శాతం జీఎస్టీ విధిస్తే, ఆ వస్తువు ధర ఎన్ని రెట్లు పెరుగుతోందో ఊహిస్తేనే భయం వేస్తుంది. ఇలాంటి జిమ్మిక్కుల్ని మోడీ సర్కార్‌ చేయదనే గ్యారెంటీ ఏం లేదు. హఠాత్తుగా జీఎస్టీ శ్లాబు రేట్ల కుదింపు వెనుక అమెరికాతో స్వేచ్ఛా వాణిజ్యం షరతులు కూడా ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇప్పటికే ట్రంప్‌ భారత్‌పై విధించిన అధిక సుంకాలపై ఎదురుదాడి చేయలేక, కేంద్రంలోని మోడీ ప్రభుత్వం పరోక్షంగా జీఎస్టీ శ్లాబురేట్ల కుదింపుతో లింకు పెట్టి, ఒప్పందాలకు ఓకే చెప్పినా ఆశ్చర్యం లేదు. ఏదేమైనా దేశంలోని వినియోగదారులకు జీఎస్టీ రెండు శ్లాబులతో ఏదో మేలు జరిగిపోతుంది అని భావిస్తే అది భ్రమే అవుతందనడంలో సందేహం లేదు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad