Saturday, January 31, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంకామన్‌ స్కూల్‌ విధానంతో అన్ని వర్గాలకు సమన్యాయం

కామన్‌ స్కూల్‌ విధానంతో అన్ని వర్గాలకు సమన్యాయం

- Advertisement -

– ఇంటిగ్రేటెడ్‌ స్కూల్స్‌లో మెరుగైన సౌకర్యాలు కల్పిస్తాం
– మొగిలిగిద్ద పాఠశాల 150వ వార్షికోత్సవ వేడుకలు
– పాల్గొన్న మంత్రి పొన్నం, ఎమ్మెల్యే శంకర్‌, ప్రొఫెసర్‌ హరగోపాల్‌
– పేదల కోసం పరితపించిన వ్యక్తి మాజీ సీఎం బూర్గుల రామకృష్ణారావు: డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
నవతెలంగాణ-షాద్‌నగర్‌

కామన్‌ స్కూల్‌ విధానంతో అన్ని వర్గాలకూ సమన్యాయం జరుగుతుందని, ఈ విధానంతోనే రాష్ట్ర ప్రభుత్వం యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ స్కూల్స్‌ను నెలకొల్పుతున్నామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో రూ.200 కోట్లతో 25 ఎకరాల స్థలంలో ఈ ఇంటిగ్రేటెడ్‌ స్కూల్స్‌ను ఏర్పాటు చేస్తున్నామని, ప్రయివేట్‌ పాఠశాలలకు దీటుగా వీటిని ఏర్పాటుచేస్తున్నట్టు తెలిపారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా ఫరూఖ్‌నగర్‌ మండలం మొగిలిగిద్దలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల 150వ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు. షాద్‌నగర్‌ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి డిప్యూటీ సీఎం భట్టి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కుల, మత తేడాలు లేకుండా చిన్నతనం నుంచే విద్యార్థుల్లో అందరం ఒక్కటే అనే భావాన్ని కల్పించేందుకే ఈ యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ స్కూల్స్‌ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అల్పాహారం అందించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు ఏర్పాటు చేస్తుందని అన్నారు. పైలెట్‌ ప్రాజెక్టు కింద కొడంగల్‌ నియోజకవర్గంలో అందిస్తున్నామని తెలిపారు. మొగిలిగిద్ద పాఠశాలలో చదువుకున్న రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు దేశానికి దిశా నిర్దేశం చేసే స్థాయికి ఎదిగారని, అలాగే ఈ పాఠశాలలో ఎంతో మంది చదువుకుని ప్రయోజకులయ్యారని తెలిపారు. భూమిపై రైతులకు హక్కులను కల్పించిన మహోన్నత వ్యక్తి బూర్గుల అని అన్నారు. 2008లో రాష్ట్రవ్యాప్తంగా ఆంగ్ల విద్యా విధానాన్ని దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ప్రవేశపెట్టారని తెలిపారు. మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు రూ.27 వేల కోట్లు వడ్డీ లేని రుణాలు ఇచ్చామని అన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ.. చరిత్ర ఎప్పుడు కూడా భవిష్యత్తుకు కొలమానమని, ప్రజలు చరిత్రను ఎప్పుడూ మరువకూడదని అన్నారు. ఈ గ్రామానికి తుర్రెబాజ్‌ ఖాన్‌ లాంటి పోరాటయోధుల చరిత్ర ఉందన్నారు. ప్రొఫెసర్‌ హరగోపాల్‌ మాట్లాడుతూ.. ఏ దేశమైతే విద్యకు ప్రాధాన్యత ఇస్తుందో ఆ దేశం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందన్నారు. వందేండ్ల వార్షికోత్సవానికి ఎస్‌ఆర్‌ శంకరన్‌ వచ్చి ప్రభుత్వ కళాశాలను ప్రారంభించారని గుర్తుచేశారు. లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌ నిర్మిస్తే ఈ ప్రాంతంలో వలసలు ఆగడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆడిషనల్‌ కలెక్టర్‌ చంద్రారెడ్డి, విద్యాశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ సోమిరెడ్డి, డీఈఓ సుశీందర్రావు, గ్రామ సర్పంచ్‌ ఏశామోని కృష్ణయ్య, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్‌పర్సన్‌ బండారు సంతోష, ఆర్డీఓ ఆర్‌ఎన్‌ సరిత, డీసీపీ శిరీష, ఏసీపీ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -