నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని మల్లారం గ్రామపంచాయతీ పరిదిలోగల దబ్బగట్టులోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మరుగుదొడ్లు లేకపోవడంతో ఒంటికి, రెంటికి విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బందులకు గురివుతున్నారు. అత్యవసరమైతే నానా అవస్థలు పడుతున్న పరిస్థితి. పాఠశాల ప్రధాన రహదారికి ప్రక్కన ఉండడంతో విద్యార్థులు టాయిలెట్ల కోసం రోడ్డు దాటి వెళ్లాలంటే భయాందోళనకు గురవుతున్నారు. పాఠశాల కొన్ని నెలల క్రితం జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం కింద రూ.3.5 లక్షలతో మంజూరైన మరుగుదొడ్ల నిర్మాణ పనులు చేపట్టారు.
పనులు చేపట్టిన గుత్తేదారుకు బిల్లులు రాకపోవడంతో అవి అసంతృప్తి నిర్మాణంగా వదిలేసినట్లుగా ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. పాఠశాలకు ప్రహరీ లేకపోవడంతో రాత్రివేళలో మందుబాబులకు అడ్డాగా మారుతున్నాయి. ప్రతిరోజు ఉదయం పాఠశాలకు వచ్చేసరికి ఖాళీ గ్లాసులు, మద్యం సీసాలు ఆనవాళ్లు కనిపిస్తున్నాయని విద్యార్థులు, ఉపాధ్యాయులు వాపోతున్నారు. పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు, 14 మంది విద్యార్థులు ఉన్నారు. పాఠశాలలో అసంతృప్తిగా ఉన్న మరుగుదొడ్లు పూర్తియ్యేలా చూస్తూ, పాఠశాల చుట్టూ ప్రహరీ గోడ మంజూరు చేయాలని విద్యార్థులు, తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.



