Friday, April 3, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంమండలి సమావేశాల నిర్వహణ బాలేదు

మండలి సమావేశాల నిర్వహణ బాలేదు

- Advertisement -

ప్రతిపక్ష నేత మధుసూదనాచారి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

శాసనమండలి సమావేశాల నిర్వహణ తీరు అస్సలు బాలేదని మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి నొక్కి చెప్పారు. గురువారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజా సమస్యలనుగానీ, హామీలపైనగానీ చర్చ జరుగకుండా కాంగ్రెస్‌ ద్రోహాలు, మోసాలను కప్పిపుచ్చుకునేందుకు సమావేశాలను వాడుకున్నదని విమర్శించారు. ఆరురోజులే సమావేశాలు నిర్వహించగా అందులోనూ టీ బ్రేక్‌ల పేరుతో గంటల సమయాన్ని వృథా చేశారనీ, ఒకరోజు సాయంత్రం నాలుగు గంటలకు వాయిదా వేసి రాత్రి పది గంటలకు ప్రారంభించారని ఎత్తిచూపారు. మంత్రులు ఒకరిద్దరే మండలికి హాజరుకావడమేంటని ప్రశ్నించారు. గతంలో తాను చైర్మెన్‌గా పనిచేసిన సమయంలో మినిట్‌ టూ మినిట్‌ ప్రోసీడింగ్స్‌ ఉండేవని గుర్తుచేశారు. క్వశ్చన్‌ అవర్‌ను రెండురోజులకు కుదించారనీ, అంత్య కీలకమైన అంశాలపై బీఆర్‌ఎస్‌ సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాలను తిరస్కరించారని విమర్శించారు.

ఏ బిల్లుపైన కూడా సమగ్ర చర్చ జరుగకుండానే ఆమోదించడాన్ని తప్పుబట్టారు. కాంగ్రెస్‌ నేతల పరిభ్రమణం మొత్తం ఢిల్లీ చుట్టే తిరుగుతున్నదనీ, రేవంత్‌రెడ్డి నిర్వాహకాల చిట్టా రోజురోజుకీ పెరిగిపోతున్నదని విమర్శించారు. మండలి బీఆర్‌ఎస్‌ఎల్పీ ఉపనేత ఎల్‌.రమణ మాట్లాడుతూ..మండలిలో రైతులు, యువత, మహిళలు, నిరుద్యోగులు, ఉద్యోగాల భర్తీపై చర్చే జరగలేదన్నారు. ఇలా సమావేశాలను తానెప్పుడూ చూడలేదనీ, ఇలాంటివి ప్రజాస్వామ్యానికి మంచివి కాదని అభిప్రాయపడ్డారు. ఇక్కడ అక్రమంగా దోచుకున్న డబ్బులను ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల కోసం ఖర్చుచేస్తున్నారనీ, ఇక్కడ పాలనను గాలికొదిలేసి పక్క రాష్ట్రాల్లో ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. చేనేత కార్మికులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. ఎమ్మెల్సీ సురభి వాణిదేవి మాట్లాడుతూ..విద్యావ్యవస్థ గాడి తప్పిందన్నారు. స్కూళ్లలో టాయిలెట్స్‌ లేక ఆడ పిల్లలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఉద్యోగ విరమణ చేసిన వారి డబ్బులు ఇవ్వకపోవడం తన జీవితంలో తొలిసారి చూస్తున్నానని చెప్పారు. అసెంబ్లీ నిర్వహణను బట్టి రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని అర్థమవుతున్నదన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -