Friday, December 19, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఎమ్మెస్‌ అగర్వాల్‌ ఫౌండ్రీస్‌ యాజమాన్యం తీరు దుర్మార్గం

ఎమ్మెస్‌ అగర్వాల్‌ ఫౌండ్రీస్‌ యాజమాన్యం తీరు దుర్మార్గం

- Advertisement -

చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న యాజమాన్యం
మృతుల కుటుంబాలకు రూ. కోటి పరిహారమివ్వాలి
పరిశ్రమల్లో ప్రమాదాలు జరుగుతుంటే కార్మికమంత్రికి పట్టదా?
ప్రమాద స్థలం సందర్శనకు అంగీకరించని యాజమాన్యం
కార్మికులకు న్యాయం జరిగే వరకు యాజమాన్యాన్ని వదిలిపెట్టం : సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్‌.వీరయ్య

నవతెలంగాణ-మనోహరాబాద్‌
మెదక్‌ జిల్లా మనోహరాబాద్‌ మండలం రంగయపల్లి గ్రామంలోని ఎమ్మెస్‌ అగర్వాల్‌ ఫౌండ్రీస్‌ పరిశ్రమ యాజమాన్యం చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నదని, కార్మికుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న పరిశ్రమ యాజమాన్యాన్ని శిక్షించే వరకు ఉద్యమం చేస్తామని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్‌.వీరయ్య తెలిపారు. గురువారం సీఐటీయూ రాష్ట్ర ప్రతినిధి బృందం పరిశ్రమను సందర్శించి గేటు బయట కార్మికులతో మాట్లాడింది. పరిశ్రమ గేట్‌ ఎదుట ధర్నా నిర్వహించి యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్బంగా వీరయ్య మాట్లాడుతూ.. పరిశ్రమలో ప్రమాద స్థలాన్ని సందర్శించడానికి యాజమాన్యం నిరాకరించడం అనేక అనుమానాలకు తావిస్తుందన్నారు. అన్నీ సక్రమంగా ఉంటే ప్రమాద స్థలాన్ని ఎందుకు సందర్శించనీయడం లేదని ప్రశ్నించారు.

యాజమాన్యం చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తోందని, ప్రమాదం జరిగి ఇద్దరు కార్మికులు చనిపోయినా ఏమాత్రం సంబంధం లేనట్టు పరిశ్రమలో ఉత్పత్తి యధేచ్ఛగా చేస్తున్నదని, కార్మికుల ప్రాణాల కంటే లాభాలే ముఖ్యమా అని ప్రశ్నించారు. ప్రమాద వివరాలు చెప్పడానికి యాజమాన్యానికి ఎందుకు అంత భయమన్నారు.ప్రమాదంపై కార్మిక శాఖ మంత్రి, జిల్లా కలెక్టర్‌ ఎందుకు స్పందించడం లేదని, వారు యాజమాన్యం కోసం పని చేస్తున్నారా? లేక కార్మికుల సంక్షేమనికి ఉన్నారా అని అనుమానం వ్యక్తం చేశారు. ప్రమాదంలో ఎంత మందికి గాయాలు అయ్యాయో ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. బీహార్‌, ఒడిశా, ఉత్తరప్రదేశ్‌ నుంచి సుమారు 1500 మంది వలస కార్మికులు పరిశ్రమలో పనిచేస్తున్నారన్నారు.

మృతుల కుటుంబాలకు రూ. కోటి పరిహరమివ్వాలి కంపెనీ యాజమాన్యం కార్మికులను కనీసం మనుషులుగా కూడా చూడటం లేదని, కనీస వేతనం అమలు చేయకుండా కార్మికులతో యాజమాన్యం వెట్టిచాకిరీ చేయిస్తున్నదని తెలిపారు. కార్మిక చట్టాలను అమలు చేయకుండా వారి శ్రమను దోచుకునే హక్కు యాజమాన్యానికి ఎక్కడిదన్నారు. అగర్వాల్‌ పరిశ్రమ లో పని చేస్తున్న కార్మికులతో పాటు మృతిచెందిన కార్మికుల కుటుంబాలకు న్యాయం జరిగే వరకూ సీఐటీయూ పోరాడుతుందని స్పష్టంచేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు ఎం.అడివయ్య, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు వీఎస్‌ రావు, జిల్లా అధ్యక్షులు బాలమణి, కార్యదర్శి ఏ.మల్లేశం, ఉపాధ్యక్షులు ఏ.మహేందర్‌ రెడ్డి, కోశాధికారి నర్సమ్మ, సహాయ కార్యదర్శులు సంతోష్‌, అసిఫ్‌, యూఈఈయూ రాష్ట్ర ఆర్గనైజింగ్‌ కార్యదర్శి గుడాల రవీంద్ర ప్రసాద్‌, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి అజయ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -