– చంద్రబాబుకు కోపం వస్తుందనే పాలమూరు ప్రాజెక్టు పక్కకు
– కావాలనే పట్టించుకోని రేవంత్‌రెడ్డి
– డబ్బుల కోసమే జీహెచ్‌ఎంసీ వార్డుల విభజన
– ఫోన్ ట్యాపింగ్, సిట్ డ్రామాలతో ప్రజల దృష్టిమళ్లించే యత్నం
– అసెంబ్లీలో మీడియాతో కేటీఆర్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తయితే కేసీఆర్‌కు పేరు వస్తుందనే భయంతోపాటు చంద్రబాబుకు కోపం వస్తుందనే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పక్కకు పెట్టారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు (కేటీఆర్) విమర్శించారు. కావాలనే ఆ ప్రాజెక్టును పట్టించుకో లేదని చెప్పారు. నీళ్లపై కాంగ్రెస్ ప్రభుత్వం రాజీపడుతున్నదని అన్నారు. సోమవారం అసెంబ్లీ ఆవరణలో మీడియా ప్రతినిధులతో ఆయన చిట్‌చాట్ నిర్వహించారు. కాలంతో పోటీపడి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని చెప్పారు. నీళ్లిచ్చింది ఎవరో ప్రజలకు బాగా తెలుసన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో 45 టీఎంసీలకు ఒప్పుకుంటే నష్టమేనని అన్నారు. కృష్ణా నదిలో 299 టీఎంసీలకు అంగీకరించింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. రేవంత్‌రెడ్డి అవినీతి, అక్రమాలు బయటపడుతున్నాయనే కారణంతోనే ఆయన బూతులు మాట్లాడుతున్నారని చెప్పారు. తనపై వ్యాఖ్యలు చేస్తే పట్టించుకోననీ, తన తండ్రి కేసీఆర్‌పై మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. కేసీఆర్ లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక కాంగ్రెస్ నాయకులు బూతులు మాట్లాడుతున్నారని అన్నారు. నీళ్ల అంశం చదివితే రాదనీ, రాష్ట్రంపై ప్రేమ ఉండాలని వ్యాఖ్యానించారు. కృష్ణా నది ఏ బేసిన్‌లో ఉందో, ఎక్కడ ఉందో అని ముఖ్యమంత్రి అధికారులను అడిగారని ఎద్దేవా చేశారు. బాక్రానంగల్ ఏ రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రికి తెలియదన్నారు. నీటిపారుదలపై కనీస అవగాహన లేని వారు కేసీఆర్ చర్చకు రావాలంటున్నారని చెప్పారు. చెక్‌డ్యాం పేల్చివేత కేసులో రాఘవ కన్‌స్ట్రక్షన్ కంపెనీ ఉన్నదనీ, మేడిగడ్డ పేల్చారంటూ ఆనాడే ఇంజినీర్లు ఫిర్యాదు చేశారని అన్నారు. ఎందుకు విచారణ చేపట్టడం లేదని ప్రశ్నించారు.
ఫోర్త్ సిటీని కార్పొరేషన్ చేస్తారేమో…
జీహెచ్‌ఎంసీని మూడు భాగాలుగా విభజిస్తారన్న ప్రచారం జరుగుతున్నని కేటీఆర్ చెప్పారు. ఫోర్త్ సిటీ అని పెట్టిన దాన్ని కూడా కార్పొరేషన్ చేస్తారేమోనని అన్నారు. ఏం చేసినా శాస్త్రీయంగా ఉండాలనీ, ఇష్టం వచ్చినట్టు చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. డబ్బుల సేకరణ ఓసమే మర్చంట్ బ్యాంకర్లు, బ్రోకర్లు చెప్పినట్టు డీలిమిటేషన్ చేస్తున్నారని ఆరోపించారు. అడ్డగోలుగా వార్డుల విభజన చేశారని అన్నారు. గూఢచారి వ్యవస్థ నెహ్రూ కాలం ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉందన్నారు. శాంతిభద్రతలు, రాష్ట్ర రక్షణ కోసమే ఈ వ్యవస్థ పనిచేస్తుందని చెప్పారు. నిఘా వ్యవస్థ లేదా ఫోన్ ట్యాపింగ్ లేదని ఎవరైనా అనగలరా?అని కేటీఆర్ ప్రశ్నించారు. ప్రతిపక్ష నాయకుల ఫోన్లు ట్యాప్ చేయడం లేదని ముఖ్యమంత్రి చెప్పగలరా?అని అడిగారు. సిట్, ఫోన్ ట్యాప్ వంటి అంశాలతో ప్రజల దృష్టిని ఎంతకాలం మళ్లిస్తారని చెప్పారు. సర్పంచ్ ఎన్నికలు కాంగ్రెస్ పాలనకు రెఫరెండమని అన్నారు. ప్రజలు కాంగ్రెస్ పరిపాలనను తిరస్కరించారని చెప్పారు. ముఖ్యమంత్రి హోదాలో అసెంబ్లీలో కేసీఆర్‌ను కలిసేంత సంస్కారం రేవంత్‌రెడ్డికి ఉంటే చాలని అన్నారు. అయితే ఇదే సంస్కారం బయట మాటల్లో కూడా ఉంటే బాగుంటుందని చెప్పారు. రాజకీయ ప్రత్యర్థులు ఒకరినొకరు పలకరించుకునేంత సానుకూల వాతావరణం ఉంటే మంచిదని అన్నారు. గడ్డం పెంచిన ప్రతిఒక్కరూ గబ్బర్‌సింగ్ కాదన్నారు. గడ్డాలు పెంచడం సులభమనీ, పాలన చేయడమే కష్టమని చెప్పారు. రేవంత్‌రెడ్డి గడ్డం, మీసాలు లేవన్నది తనను కాదనీ, రాహుల్‌గాంధీ, రాజీవ్‌గాంధీని కూడా అన్నారని అన్నారు.
నీళ్లపై కాంగ్రెస్ ప్రభుత్వం రాజీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



