నవతెలంగాణ – తొగుట
“ఇందిరమ్మ రాజ్యం” అని చెప్పుకుంటూ, రేవంత్ రాష్ట్రాన్ని పూర్తిగా “గూండాల రాజ్యం”గా మార్చే శారన్నారని మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి, మాజీ సొసైటీ చైర్మన్ కె. హరి కృష్ణారెడ్డి లు పేర్కొన్నారు. శనివారం విలేకరులతో మాట్లాడుతూ ప్రతిపక్ష నాయకుడు, మాజీ సీఎం, గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ గూండాలు చేసిన పిరికిపంద దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రధాన ప్రతిపక్ష నేత క్యాంపు కార్యాలయంపైనే దాడులు జరుగుతుంటే రాష్ట్రంలో శాంతిభద్రతలు ఉన్నట్లా? లేనట్లా? అని ప్రశ్నించారు.
పోలీసులు చట్టాన్ని కాపాడాల్సింది పోయి కాంగ్రెస్‌కు ప్రైవేట్ సైన్యంలా వ్యవహరించడం దుర్మార్గమన్నారు. దాడులకు పాల్పడుతున్న మూకలను పోలీసులు ఎందుకు అడ్డుకోవడం లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకుల చిల్లర దాడులకు బీఆర్ఎస్ ఏమాత్రం భయపడదన్నారు. గ్రామ సభల్లో ఇప్పటికే ప్రజలు మిమ్మల్ని తిడుతున్నారని, మిమ్మల్ని తరిమికొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం ఫోటో పెట్టాలని అనుకుంటే అధికారులు చర్య తీసుకోవాలని, కాంగ్రెస్ నాయకులకు ఎం అధికారం ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గ్రామ సభల్లో ఎమ్మెల్యే ఫోటోలు పెట్టడం లేదని, ప్రజా స్వామ్యాన్ని పాతర వేస్తున్నారని విమర్శించారు. క్యాంపు కార్యాలయంలో దాడి చేసిన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వారి వెంట మాజీ ఎంపీటీసీ వేల్పుల స్వామి, నాయకులు బండారు స్వామి గౌడ్, జహంగీర్, రాజు వెడ్స్ స్వాతి తదితరులు ఉన్నారు.



