Saturday, March 21, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంపాఠాలు నేర్వని కాంగ్రెస్‌ ప్రభుత్వం

పాఠాలు నేర్వని కాంగ్రెస్‌ ప్రభుత్వం

- Advertisement -

బీఆర్‌ఎస్‌ దారిలోనే పయనం
వాస్తవాలకు దూరంగా అంచనాలు
ఆరు గ్యారంటీల నిధుల్లో కోత
రెవెన్యూ రాబడి రూ.2.41 లక్షల కోట్ల లక్ష్యం
గత బడ్జెట్‌లో జనవరి నాటికి వచ్చిన ఆదాయం రూ.1.38 లక్షల కోట్లే
రూ.3.24 లక్షల కోట్ల రాబడి ఎలా సాధ్యం

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
కాంగ్రెస్‌ ప్రభుత్వం పాఠాలు నేర్వడం లేదు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నడిచిన దారిలోనే రాష్ట్ర ప్రభుత్వం పయనిస్తున్నది. మూడో బడ్జెట్‌ను ప్రవేశపెట్టినా వాస్తవాలకు దూరంగా అంచనాలు ఉండడమే ఇందుకు నిదర్శనం. బడ్జెట్‌ ప్రతిపాదనల్లో పారదర్శకత కొరవడింది. 2026-27 వార్షిక బడ్జెట్‌ను రూ.3,24,234 కోట్లతో ప్రవేశపెట్టింది. ఇందులో రెవెన్యూ రాబడులు రూ.2,41,263 కోట్లు అని అంచనా వేసింది. 2025-26 బడ్జెట్‌లో రూ.2,29,720 కోట్ల రెవెన్యూ రాబడులు వస్తాయని ప్రకటించింది. కాగ్‌ లెక్కల ప్రకారం జనవరి నాటికి రూ.1,38,371 (60.23 శాతం) మాత్రమే రెవెన్యూ రాబడులు వచ్చాయి. ఫిబ్రవరి, మార్చి కలిపితే మరో రూ.50 వేల కోట్ల వరకు రావొచ్చు.

వాటితో కలిపి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ రాబడులు రూ.1,88,371 కోట్లకు చేరుకుంటుంది. అయినప్పటికీ లక్ష్యాన్ని చేరుకోలేదు. కనీసం రూ.రెండు లక్షల కోట్లు కూడా వచ్చే అవకాశం లేదు. ఈ గణాంకాల ప్రకారం చూస్తే వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం ఆశిస్తున్నట్టుగా రూ.2,41,263 కోట్ల రెవెన్యూ రాబడి ఎలా సాధ్యమవుతుందన్న ప్రశ్న తలెత్తుతున్నది. ఇంకోవైపు కేంద్రం నుంచి గ్రాంట్లు వచ్చే ఆర్థిక సంవత్సరానికి రూ.24,166 కోట్లు వస్తాయని అంచనా వేసింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.22,782 కోట్లు గ్రాంట్లు వస్తాయని చెప్పింది. కాగ్‌ లెక్కల ప్రకారం జనవరి నాటికి రూ.4,213 (18.49 శాతం) కోట్లు మాత్రమే వచ్చాయి. ఫిబ్రవరి, మార్చిలో కలిపి మరో రూ.నాలుగు వేల కోట్లు వస్తాయని అనుకున్నా రూ.8,213 కోట్లు అవుతాయి. ఈ లెక్కల ఆధారంగా వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.24,166 కోట్లు ఎలా వస్తాయన్న ప్రశ్న ఉత్పన్నమవుతున్నది.

అప్పులపైనే ఆధారం
వచ్చే ఆర్థిక సంవత్సరానికి రూ.58,458.71 కోట్లు అప్పు తేవాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.54,009.74 కోట్లు అప్పు తేవాలని భావించింది. కాగ్‌ లెక్కల ప్రకారం జనవరి నాటికి అది రూ.69,148.28 కోట్లకు చేరింది. అంటే అనుకున్న లక్ష్యం కంటే రూ.15,138.54 కోట్లు అదనంగా అప్పు చేసింది. ఇంకా ఫిబ్రవరి, మార్చి గణాంకాలు రావాల్సి ఉన్నది. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అప్పు రూ.లక్ష కోట్లకు చేరే అవకాశము న్నది. ఇంకోవైపు వచ్చే ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ రాబడు లు రూ.2,41,263.58 కోట్లు, అప్పు రూ.58,458.71 కోట్లు కలిపితే రూ.2,99,722.29కోట్లు అవుతాయి.

కానీ ప్రభుత్వం వచ్చే ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్‌ రూ.3,24,234 కోట్లు. దీంతో రెవెన్యూ లోటు రూ.24,511.71 కోట్లు అవు తుంది. పన్నేతర ఆదాయం రూ. 35,730.20 కోట్లు వస్తాయని అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.31,618.77 కోట్లు వస్తాయని అంచనా వేసింది. కాగ్‌ గణాంకాల ప్రకారం రూ.7,864.18 (24.87 శాతం) కోట్లు మాత్రమే వచ్చాయి. దీంతో వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ పన్నేతర ఆదాయం పూర్తిగా వచ్చే అవకాశం లేదు. దీంతో అప్పులపైనే ప్రభుత్వం ఆధారపడాల్సి వస్తుందని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు.

ఆరు గ్యారంటీలకు తగ్గిన నిధులు
ఆరు గ్యారంటీల గురించి ప్రచారం చేసి కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఆరు గ్యారంటీల అమలుకు రూ.56,084 కోట్లు కేటాయించింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో మాత్రం రూ.50,713 కోట్లు ప్రతిపాదించింది. ఏకంగా రూ.5,371 కోట్లు కోత విధించడం గమనార్హం. ఆరు గ్యారంటీల అమలుకు నిధులు పెంచాల్సింది పోయి తగ్గించడం పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. ఇందిరమ్మ ఇండ్లకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.12,571 కోట్లు కేటాయించింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.5,500 కోట్లు మాత్రమే ప్రతిపాదించింది. ఆరు గ్యారంటీల్లో కొన్ని పథకాలు మాత్రమే అమలవుతున్నాయి. అమలు కాని వాటి కోసం ప్రజలంతా ఎదురుచూస్తున్నారు. ఇంకా ఎక్కువ నిధులు కేటాయించాల్సిందిపోయి తగ్గించడం గమనార్హం.

సన్నబియ్యం పథకానికి రూ.3 వేల కోట్లు సరిపోయేనా?
రాష్ట్ర ప్రభుత్వం పేదలకు సన్నబియ్యం పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నది. ఒక్కొక్కరికి ఆరు కిలోలు ఇస్తున్నది. కుటుంబంలో ఎంత మంది ఉన్నా ఆరు కిలోల చొప్పున సన్నబియ్యం పథకాన్ని అమలు చేస్తున్నది. అయితే వచ్చే ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం పథకం సబ్సిడీకి రూ.మూడు వేల కోట్లు కేటాయించింది. రాష్ట్రంలో 3.38 కోట్ల మంది లబ్దిదారులకు ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా సన్నబియ్యం అందిస్తున్నది. రాష్ట్రంలో ప్రస్తుతం 1,05,07,879 రేషన్‌ కార్డులున్నాయి. సన్నబియ్యం పంపిణీ పాత బకాయిల వడ్డీకే రూ.రెండు వేల కోట్లు చెల్లించాల్సి ఉన్నది. ఇక మిగిలేది రూ.వెయ్యి కోట్లు మాత్రమే. వచ్చే ఆర్థిక సంవత్సరంలో సన్న బియ్యం పథకానికి రూ.వెయ్యి కోట్లు సరిపోతాయా?అన్న ప్రశ్న తలెత్తుతున్నది.

ఉద్యోగుల పెండింగ్‌ బిల్లులు ఎన్ని కోట్లు?
కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రకటించిన శ్వేతపత్రంలో ఉద్యోగుల పెండింగ్‌ బిల్లులు రూ.42 వేల కోట్లు ఉన్నాయని ప్రకటించింది. ఉద్యోగులు ఉద్యోగ విరమణ పొందుతున్నారు. కానీ రిటైర్మెంట్‌ బెనిఫిట్లు మాత్రం ప్రభుత్వం చెల్లించడం లేదు. పెండింగ్‌ బిల్లుల కోసం నెలకు రూ.700 కోట్లు విడుదల చేస్తున్నది. రాష్ట్రంలో ఉద్యోగుల వివిధ రకాల పెండింగ్‌ బిల్లులు ఎన్ని వేల కోట్లు ఉన్నాయో ప్రభుత్వం ఎందుకు ప్రకటించడం లేదని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. పెండింగ్‌ డీఏల ప్రస్తావన, పీఆర్సీ అమలు గురించి ప్రభుత్వం ప్రకటించలేదు. దీంతో ఉద్యోగులు, రిటైర్డ్‌ ఉద్యోగుల్లో ప్రభుత్వం పట్ల అసంతృప్తి నెలకొంది.

ప్రమాదంలోకి విద్యుత్‌ సంస్థలు
గృహజ్యోతి పథకం ద్వారా 53 లక్షలకుపైగా కుటుంబాలు లబ్ధిపొందుతున్నాయి. డిస్కంలకు ప్రజల తరఫున ప్రభుత్వం భారం భరిస్తున్నది. విద్యాసంస్థలకు ఉచిత విద్యుత్‌, వ్యవసాయ సబ్సిడీ ఇస్తున్నది. కొత్తగా రైతు డిస్కమ్‌ ఏర్పాటు ద్వారా వ్యవసాయానికి మరింత కేంద్రీకృత, నాణ్యమైన సేవలను అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే ప్రభుత్వ శాఖలకు సంబంధించి విద్యుత్‌ బిల్లులు రూ.20 వేల కోట్ల వరకు ఉన్నాయి. 16వ ఆర్థిక సంఘం అధ్యయనం ప్రకారం డిస్కంలకు ప్రభుత్వం రూ.67 వేల కోట్లు అప్పులున్నట్టు తేలింది. వాటిని చెల్లించకుంటే విద్యుత్‌ సంస్థలు ప్రమాదంలో పడే అవకాశమున్నది. ప్రస్తుతం ఉన్న ఎన్‌పీడీసీఎల్‌, ఎస్పీడీసీఎల్‌ ఇబ్బందుల్లోకి వెళ్తాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -