పాలమూరు ప్రాజెక్టును పట్టించుకోని రేవంత్‌రెడ్డి
ఆరు గ్యారంటీలకే దిక్కులేదు ఇప్పుడు యూరియా కార్డా?
తెలంగాణను కాపాడాలంటే కేసీఆర్ మళ్లీ రావాలి : బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
కొల్లాపూర్ నియోజకవర్గం చిన్నంబావి సర్పంచ్ బీఆర్‌ఎస్‌లో చేరిక
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టును పట్టించుకోవడం లేదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు (కేటీఆర్) అన్నారు. అది పూర్తయితే కేసీఆర్‌కు పేరొస్తుందనీ, ఏపీ సీఎం చంద్రబాబుకు కోపం వస్తుందనే పనులు చేపట్డడం లేదన్నారు. సాగునీరు ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పొట్ట కొడుతోందని చెప్పారు. గురువారం హైదరాబా ద్‌లోని తెలంగాణ భవన్‌లో కొల్లాపూర్ నియోజకవర్గం చిన్నంబావి సర్పంచ్ రంజిత్ సహా ఆయన అనుచరులు బీఆర్‌ఎస్‌లో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి కేటీఆర్ ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ రెండేండ్ల పాలనలో చేసిన అభివృద్ధి శూన్యమని విమర్శించారు. ఎగవేతలు, కూల్చివేతలు, పేల్చివేతలే కాంగ్రెస్ మార్క్ ప్రగతి అని ఎద్దేవా చేశారు. ఆరు గ్యారెంటీలు ఎగవేశారనీ, 420 హామీలతో ప్రజలను మోసం చేశారనీ, హైడ్రా వంటి అరాచక చర్యలతో పేదల ఇండ్లను కూల్చివేస్తున్నారని విమర్శించారు. చెక్‌డ్యామ్‌లు కట్టాల్సిన చోట అవే చెక్‌డ్యామ్‌లను పేల్చడం ప్రపంచ చరిత్రలో ఎక్కడా కనిపించలేదని చెప్పారు.
బీఆర్‌ఎస్ హయాంలో చెక్ డ్యామ్‌లు, రిజర్వాయర్లు, ప్రాజెక్టులు నిర్మిస్తే కాంగ్రెస్ కేవలం విధ్వంసం చేస్తోందని అన్నారు. కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదన్నారు. రాష్ట్రంలో రైతన్నలను ఈ ప్రభుత్వం అష్టకష్టాల పాలు చేస్తున్నదని విమర్శించారు. బీఆర్‌ఎస్ పాలనలో 11 సార్లు రైతుబంధు ఇచ్చామని గుర్తు చేశారు. కాంగ్రెస్ రెండేండ్లలో ఒక్కసారే రైతు భరోసా ఇచ్చిందన్నారు. రూ.15 వేలు ఇస్తామని వాగ్ధానం చేసి రూ.12 వేలే ఇస్తున్నదనీ, ఇది రైతులకు చేసిన ద్రోహమని అన్నారు. యూరియా కోసం రైతులు చెప్పులు వరుసలో పెట్టి యుద్ధాలు చేసే పరిస్థితి వచ్చిందన్నారు. షాప్‌ల్లో యూరియా లేనప్పుడు యాప్‌లో ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఆరు గ్యారెంటీల అమలుకు దిక్కులేదు కానీ కొత్తగా యూరియా కార్డు పేరుతో ప్రజలను మరోసారి మోసం చేస్తున్నారని విమర్శించారు. నేడు కాంగ్రెస్ పాలనలో రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో క్రాప్ హాలిడేలు ప్రకటిస్తున్నారని అన్నారు. చంద్రబాబుకు భయపడి పాలమూరు ప్రాజెక్టును పండబెట్టారని చెప్పారు. నార్లాపూర్ రిజర్వాయర్ వద్ద కేసీఆర్ స్వయంగా బటన్ నొక్కి 145 మెగావాట్ల విద్యుత్‌తో పంపులను నడిపించి కృష్ణా నీటిని ఉప్పొంగించారని గుర్తు చేశారు.
సీఎం రేవంత్‌రెడ్డికి నదులపై, జలవనరులపై కనీస అవగాహన లేని అజ్ఞాని అని విమర్శించారు. భాక్రా నంగల్ ప్రాజెక్టు హిమాచల్ ప్రదేశ్‌లో ఉన్నప్పటికీ, స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో అది తెలంగాణాలో ఉందని చెప్పారని అన్నారు. దేవాదుల ఏ బేసిన్‌లో ఉందో కూడా తెలియని నాయకుడు రేవంత్‌రెడ్డి అని చెప్పారు. మంత్రి జూపల్లి కృష్ణారావు స్వార్థపూరిత అవకాశవాది అని అన్నారు. మంత్రి పదవిని కాపాడుకోవడం కోసమే రేవంత్‌రెడ్డిని పొగుడుతున్నారని వివరించారు. పంచాయతీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ గొప్ప విజయం సాధించిందని చెప్పారు. మున్సిపల్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లోనూ బీఆర్‌ఎస్ సత్తా చాటాలన్నారు. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావడానికి బీఆర్‌ఎస్ శ్రేణులు ఏకమై పనిచేయాలని సూచించారు. బీఆర్‌ఎస్ అభ్యర్థి ఎవరైనా కేసీఆర్ కోసం కారు గుర్తుకే ఓటేయాలని కోరారు. సంక్రాంతి తర్వాత కొల్లాపూర్‌లో పర్యటిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీమంత్రి వి శ్రీనివాస్‌గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు బీరం హర్షవర్ధన్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, పట్నం నరేందర్‌రెడ్డి, బీఆర్‌ఎస్ నాయకులు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్, అల్లిపురం వెంకటేశ్వర్‌రెడ్డి, ఆంజనేయగౌడ్, కిశోర్‌గౌడ్, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.



