ఆరు గ్యారెంటీల అమలు ఏమాయే? : బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
పార్టీ అభ్యర్థులను గెలిపించాలంటూ ప్రజలకు విజ్ఞప్తి
నవతెలంగాణ-పరకాల
కాంగ్రెస్ పార్టీది దండుపాళ్యం బ్యాచ్ అని, ఎన్నికల ముందు రాష్రానికి ఇచ్చిన ఆరు గ్యారంటీల హామీలు ఇప్పటికీ నెరవేర్చకుండా ప్రజలు నష్టపోయేలా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేశారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్‌రెడ్డి ఎన్నికల ముందు గ్యారెంటీల బాండ్ పేపరు రాసిచ్చారని.. ఇప్పటికీ వాటిని అమలు చేయలేక విఫలమయ్యార న్నారు. సోమవారం పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పట్టణంలో బస్టాండు కూడలి నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ సెంటర్ వద్ద రోడ్ షోలో కేటీఆర్ మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డి తెల్లారి లేస్తే కేసీఆర్‌ను తిట్టడమే తప్ప చేసిందేమీ లేదన్నారు. రేవంత్‌రెడ్డి నమ్మిన ప్రజలను నట్టేటా ముంచారని, అన్న వస్త్రం కోసం వస్తే ఉన్న వస్త్రం పోయిన చందంగా ప్రస్తుత పరిస్థితులు ఉన్నాయన్నారు.
‘మార్పు.. మార్పు.. అన్న ప్రజలారా ఈరోజు ఆగమయ్యారా’ అని కేటీఆర్ ప్రజలను అడిగారు. ఏ హామీని నెరవేర్చని కాంగ్రెస్‌కు ఈ ఎన్నికల్లో ఓటు ఎందుకు వేయాలని రేవూరి ప్రకాష్‌రెడ్డిని నిలదీయాలన్నారు. పరకాల మున్సిపాలిటీలోని 22 వార్డుల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కేటీఆర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నర్సంపేట నియోజకవర్గంలో ఎన్ని తండాలు ఉన్నాయో రేవూరి ప్రకాశ్‌రెడ్డికి తెలియదని, ఆయన ఏం అభివృద్ధి చేశారో అక్కడి ప్రజలు చెబుతారని మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. ఇప్పుడు పరకాల అభివద్ధి చేస్తానని, ఎంతో చరిత్ర గల పరకాలను నిర్వీర్యం చేయడానికి పూనుకున్నాడని విమర్శించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్, గండ్ర రమణారెడ్డి, నన్నపనేని నరేందర్, తదితరులు పాల్గొన్నారు.



