తెలంగాణలో మళ్ళీ వచ్చేది బీఆర్‌ఎస్సే : ఎమ్మెల్యే హరీశ్‌రావు
బీఆర్‌ఎస్ మద్దతుతో గెలిచిన సర్పంచులు, వార్డు సభ్యులకు సన్మానం
నవతెలంగాణ-నర్సాపూర్
సర్పంచ్ ఎన్నికల ఫలితాలతో స్థానిక ఎన్నికలపై కాంగ్రెస్‌కు భయం పట్టుకుందని, అందుకే కార్పొరేషన్ ఎన్నికలు పెట్టకుండా నామినేట్ పద్ధతి తెస్తున్నారని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. ఇక కాంగ్రెస్ పని అయిపోయిందని, ఒక రెండేండ్లు ఓపిక పడితే.. మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్‌ఎస్సే అని తెలిపారు. మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలోని సాయికృష్ణ కళ్యాణ మండపంలో బీఆర్‌ఎస్ మద్దతుతో గెలిచిన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులకు ఎమ్మెల్యే సునీతారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సన్మాన కార్యక్రమానికి హరీశ్‌రావు హాజరై మాట్లాడారు. తెలంగాణలో కాంగ్రెస్.. ఆగమాగం పాలన చేస్తుందన్నారు. సర్పంచి ఎన్నికల్లో ఒక ముఖ్యమంత్రి కాలుకు బలపం కట్టుకొని తిరగడం ఎప్పుడూ జరగలేదని తెలిపారు. ఓటమి భయంతో రేవంత్ రెడ్డి ఊరూరు తిరిగి ప్రచారం చేశారని అన్నారు. అధికారంలో ఉన్న పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో 90శాతం విజయం సాధిస్తుందని తెలిపారు. కానీ ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో 6వేల స్థానాల్లో కాంగ్రెస్ గెలిస్తే, 4 వేల స్థానాల్లో బీఆర్‌ఎస్ గెలిచిందని చెప్పారు.
బీఆర్‌ఎస్‌ను మొలకెత్తనియ్యనని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారని.. కానీ నేడు 4వేల మంది సర్పంచులు రేవంత్ రెడ్డి గుండెల్లో నుంచి మొలకెత్తి వచ్చారని అన్నారు. కేంద్రం నుంచి వచ్చే నిధుల్లో వందకు రూ.85 డైరెక్ట్‌గా సర్పంచ్ అకౌంట్‌లోనే పడతాయని.. రేవంత్ రెడ్డికి సంబంధం లేదని తెలిపారు. మీకు విడుదలయ్యే నిధులతో గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని, ఎవరికీ భయపడాల్సిన పని లేదని అన్నారు. ఓడిపోయిన సర్పంచు అభ్యర్థులు అధైర్య పడొద్దని.. కచ్చితంగా వారికి భవిష్యత్ ఉంటుందని తెలిపారు. రైతులను యాప్‌ల పేరుతో ఇబ్బంది పెడుతున్నారని.. కేసీఆర్ హయాంలో ఏ యాప్ లేకుండానే యూరియా సరఫరా చేశామన్నారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్, లేబర్ వెల్ఫేర్ బోర్డు మాజీ చైర్మెన్ దేవేందర్ రెడ్డి, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మెన్ చంద్ర గౌడ్, మున్సిపల్ మాజీ చైర్మెన్ అశోక్ గౌడ్, బీఆర్‌ఎస్ మండలాధ్యక్షులు భోగ శేఖర్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.



