న్యూఢిల్లీ : మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ప్రథమ వర్ధంతి సందర్భంగా శుక్రవారం ఆయనకు కాంగ్రెస్ ఘనంగా నివాళలర్పించింది. పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ, ఇతర నాయకులు న్యూఢిల్లీలో నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఖర్గే సోషల్ మీడియాలో చేసిన పోస్టులో దేశ ఆర్థిక మార్గాన్ని మన్మోహన్ పునర్నిర్మించారని, ఆర్థిక సంస్కరణల ద్వారా లక్షలాది మందికి అవకాశాలను విస్తరించారని, లక్షలాది మందిని పేదరికం నుంచి బయటపడేశారని తెలిపారు. మన్మోహన్ వినయం, నిజాయితీ, వారసత్వం తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయని చెప్పారు. రాహుల్‌గాంధీ తన పోస్టులో ‘మన్మోహన్ తన దార్శనిక నాయకత్వం ద్వారా భారత్‌ను ఆర్థికంగా శక్తివంతం చేశారు. ఆయన చారిత్రాత్మక ప్రయత్నాలు, పేదల కోసం తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలు ప్రపంచ వేదికపై భారత్‌కు కొత్త గుర్తింపును ఇచ్చాయి’ అని తెలిపారు. ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా తన పోస్టులో ‘మన్మోహన్ సింగ్ సమానత్వాన్ని బలంగా విశ్వసించారు. ఆయన ఒక బలమైన, ధైర్యవంతుడైన, గౌరవనీయమైన వ్యక్తి. దేశ ప్రగతికి నిజంగా అంకితమైనవారు. ఆయన నిజాయితీ, దేశం పట్ల ఆయనకున్న అంకితభావం మనందరికీ ఎల్లప్పుడూ స్ఫూర్తినిస్తాయి’ అని తెలిపారు.



