సీఎం రేవంత్‌రెడ్డి ఎప్పటికైనా బీజేపీలోకే
హామీల అమలులో ప్రభుత్వం విఫలం
తాండూరు ప్రచారంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
నవతెలంగాణ-తాండూరు
సీఎం రేవంత్‌రెడ్డి ఎప్పటికైనా బీజేపీలో చేరుతారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రెండేండ్ల లో కాంగ్రెస్ ఖేల్ ఖతం అవుతుందని అన్నారు. ఆదివారం వికారాబాద్ జిల్లా తాండూర్‌లో ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేటీఆర్ హాజరై ప్రసంగించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీల అమలులో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. 23 నెలల నుంచి రాష్ట్రంలో కాంగ్రెస్ ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున బాకీ పడి ఉందన్నారు. హామీలు అమలైతే కాంగ్రెస్‌కు ఓటేయాలని..లేదంటే బీఆర్‌ఎస్‌కు ఓటేయాలని ప్రజలకు సూచించారు. దేశంలో రాహుల్ గాంధీ ప్రధాని మోడీని చౌకీదార్ అంటే ఇక్కడ కాంగ్రెస్ సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం మోడీని బడేబాయి అని పిలుస్తున్నారన్నారు.
బీజేపీ, కాంగ్రెస్ తోడు దొంగలే అని విమర్శించారు. సీఎం హోదాలో హుందాగా ఉండాల్సిన ఆయన మాజీ సీఎం కేసీఆర్‌ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని అన్నారు. కేసులకు భయపడేది లేదన్నారు. తాండూరుకు నర్సింగ్ కాలేజీని మంజూరు చేస్తే కొడంగల్‌కు లాకెళ్ళారన్నారు. దమ్ముంటే తాండూర్ అభివృద్ధికి రూ.1000 కోట్లు మంజూరు చేస్తునట్టు జీవో విడుదల చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మెన్ రాజుగౌడ్, మున్సిపల్ ఎన్నికల ఇన్‌చార్జి శ్రీశైల్‌రెడ్డి, బీఆర్‌ఎస్ చైర్మెన్ అభ్యర్థి పట్లోళ్ల నర్సింలు, డాక్టర్ సంపత్‌కుమార్, కౌన్సిలర్ అభ్యర్థులు, సీనీయర్ నాయకులు, పాల్గొన్నారు.



