ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేస్తుందనే నెపంతో అమెరికా, ఇజ్రాయిల్ సంయుక్తంగా ఇరాన్ పై దాడి చేసి ఆ దేశ సుప్రీం లీడర్ ఖొమేనిని హతమార్చారు. అమెరికాకు ఇలాంటి యుద్ధాలు చేయడం కొత్త కాదు, ఏదో సాకుతో దేశాలను ఆక్రమించి అక్కడి వనరులను దోచుకోవడం దాని నైజం. మాదకద్రవ్యాల అక్రమ రవాణా నెపంతో జనవరిలో వెనుజులా పై దాడి చేసి ఆ దేశ అధ్యక్షున్ని, ఆయన భార్యను కిడ్నాప్ చేసి నిర్బంధించారు. ఆ దేశ చమురు నిల్వలను, బంగారు గనులను దోచుకుంటున్నారు. ఇరాన్ యుద్ధం సందర్భంగా ఆయుధ వ్యాపారులతో సమావేశంలో ట్రంప్ ఆయుధ ఉత్పత్తిని మూడు రెట్లు పెంచాలని ఆదేశించారు. వనరులను దోచుకోవడం ఆయుధాల వ్యాపారం పెంచుకోవడం. అమెరికా నీతి, ఇప్పుడు ఇరాన్ పై దాడి వెనుక కూడా అదే వ్యూహం. చెప్పేది ఒకటి చేసేది మరోటి. ‘సామ్రాజ్యవాదమంటేనే యుద్దమని’ లెనిన్ మహాశయుడు చెప్పింది ఎంత సత్యమో అమెరికా దాడితో మరోసారి రుజువైంది. యుద్ధాలు జరుగుతున్నప్పుడు ప్రాణాలు కోల్పోయేది ప్రజలు, కష్టాలు, నష్టాలు భరించేది ప్రజలు. ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయిల్ యుద్ధం సందర్భంగా జరుగుతున్నది అదే….

మధ్యప్రాచ్యంలో దశాబ్దాలుగా పేరుకుపోయిన రాజకీయ, మత, వ్యూహాత్మక వైరుధ్యాలు నేడు ఒక అగ్నిపర్వతంగా రూపుదిద్దుకున్నాయి. అది ఇప్పుడు బద్దలైంది. అమెరికా, ఇజ్రాయిల్ సంయుక్తంగా ఇరాన్‌పై దాడి చేయడం కేవలం ఒక ద్వైపాక్షిక సంఘర్షణగా మాత్రమే లేదు. అది ప్రపంచ భౌగోళిక రాజకీయాలను, ఆర్థిక వ్యవస్థలను, కోట్లాది సాధారణ ప్రజల జీవితాలను తలకిందులు చేసే సూనామీగా మారింది.
ఇరాన్ పర్షియన్ గల్ఫ్ తీరంలో, 8.5 కోట్ల జనాభాతో, ప్రపంచంలోని 10శాతం చమురు నిల్వలను కలిగి ఉన్న దేశం. ఈ దేశంపై యుద్ధం అంటే కేవలం ఒక నేలపై బాంబులు వేయడం కాదు. అది ప్రపంచ సరఫరా గొలుసులను, ఇంధన భద్రతను, ప్రాంతీయ స్థిరత్వాన్ని, మానవ జీవితాలను ఒకేసారి ప్రమాదంలో పెట్టడం. అమెరికా, ఇజ్రాయిల్‌లు అదే చేశాయి. ఈ యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే పెను సంక్షోభంగా మారింది.
ఇరాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, అమెరికా-ఇజ్రాయిల్ దాడుల్లో ఆ దేశ సుప్రీం లీడర్ ఖొమేనితో సహా 1,200 మందికి పైగా మరణించారు, 10,000 మందికి పైగా పౌరులు గాయపడ్డారు. ఇజ్రాయిల్ – హెజ్బుల్లా మధ్య జరుగుతున్న పోరులో లెబనాన్‌లో 630 మందికి పైగా మరణించారు. అంతేకాకుండా, యుద్ధం కారణంగా లెబనాన్‌లో 7 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. 2024 లెబనాన్ సంక్షోభం కంటే ఇది మరింత వేగంగా జరుగుతోందని ఖచీ హెచ్చరించింది.
యుద్ధం ఇప్పుడు సైనిక లక్ష్యాలకు మాత్రమే పరిమితం కాలేదు. ఇరాన్ మద్దతుదారులు దుబారు విమానాశ్రయం సమీపంలో దాడి చేయగా, ఒమన్‌లోని సలాలా ఓడరేవు వద్ద ఇంధన ట్యాంకులు ఛేదించబడ్డాయి. ఇరాక్‌లోని చమురు ట్యాంకర్లపై దాడుల్లో ఒక సిబ్బంది మరణించారు. ఖతార్ తన LNG ఉత్పత్తిని నిలిపివేయగా, సౌదీ అరేబియాలోని రాస్ తనూరా రిఫైనరీపై దాడులు జరిగాయి.
తెహ్రాన్‌లోని చమురు నిల్వలపై అమెరికా దాడి వలన భారీ పర్యావరణ కాలుష్యం జరిగింది. ఖచీ హెచ్చరిక ప్రకారం ”బ్లాక్ రెయిన్” (నల్లటి వర్షం), ”యాసిడ్ రెయిన్” (ఆమ్ల వర్షం) పడే ప్రమాదం ఉంది. ఇది ప్రజల ఆరోగ్యానికి తీవ్రమైన ప్రమాదం కలిగిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) హెచ్చరించింది.
అమెరికాకు ఈ యుద్ధం వలన భారీగా ఖర్చవుతోంది. మొదటి 6 రోజుల్లోనే యుద్ధ వ్యయం 11.3 బిలియన్ యూఎస్ డాలర్లు (సుమారు 9.7 లక్షల కోట్ల రూపాయలు) దాటిందని పెంటగాన్ అధికారులు తెలియజేశారు.
గోల్డ్మన్ సాచ్స్ అంచనా ప్రకారం, చమురు ధర 100 యూస్ డాలర్లు దాటితే ప్రపంచ ఆర్థిక వద్ధి 0.5శాతం పడిపోతుంది. యూరోప్ తీవ్రంగా దెబ్బతింటుందని, రష్యా మాత్రమే లాభపడుతుందని వాల్ స్ట్రీట్ జర్నల్ విశ్లేషించింది. ప్రపంచ ద్రవ్యోల్బణం సంవత్సరాల తరబడి పెరిగే ప్రమాదం ఉందని ఖూవీ+ చీఫ్ ఎకనామిస్ట్ హెచ్చరించారు.
చమురు, గ్యాస్ కొరతతో దేశాలు విలవిలలాడుతున్నాయి. సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి అంతర్జాతీయ ఇంధన సంస్థ 40 కోట్ల బ్యారెల్స్ చమురును నిల్వల నుండి విడుదల చేస్తోంది. అయినా చమురు కొరత తీరుతుందని నమ్మకం లేదు.
ఈ యుద్ధం వలన గల్ఫ్ ఆర్థిక వ్యవస్థ 15 శాతం వరకు కుంచించుకు పోవచ్చని క్యాపిటల్ ఎకనామిక్స్ హెచ్చరించింది. ఈ ప్రాంతానికి పర్యాటకం 27 శాతం తగ్గి, 56 బిలియన్ యూఎస్ డాలర్ల ఆదాయం కోల్పోవచ్చని అంచనా వేసింది.

యుద్ధంలో నష్టపోయేది సాధారణ ప్రజలు
ప్రతి యుద్ధంలో అత్యంత ఎక్కువగా నష్టపోయేది సాధారణ పౌరులే. ఇరాన్ జనాభాలో 60 శాతం పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. తెహ్రాన్, ఇస్ఫాహన్, షిరాజ్ వంటి నగరాలపై వైమానిక దాడులు జరిగి లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. శరణార్థి సంక్షోభం ఏర్పడుతుంది. ఆసుపత్రులు, విద్యుత్, నీటి సరఫరా వ్యవస్థలు ధ్వంసమవుతున్నాయి.
ఆహారం, మందుల కొరత తీవ్రంగా ఉంది. మానసిక వ్యాధులు, పెద్ద ఎత్తున వ్యాపిస్తాయి.
స్త్రీలు, పిల్లలు, వృద్ధులు అత్యంత దుర్బలంగా మారతారు.
యువత, విద్యార్థులు: ఇరాన్ జనాభాలో 35 శాతం మంది 25 ఏళ్ళ లోపు వారే. ఈ తరం నేరుగా యుద్ధ ప్రభావాలను అనుభవిస్తుంది. విద్యా సంస్థలు మూతపడి, ఒక తరానికి చదువు అందకుండా పోతుంది. అనేక మంది సైన్యంలో చేరవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. భవిష్యత్తుపై నమ్మకం సన్నగిల్లి, వలసలు తీవ్రమవుతాయి. ఇంటర్నెట్ నిరోధం, సమాచార నిషేధం వలన బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి.
మహిళలు: ఇరాన్‌లో ఇప్పటికే పరిమితమైన స్వేచ్ఛలో జీవిస్తున్న మహిళలు యుద్ధ కాలంలో మరింత ఇబ్బందుల పాలవుతారు. ఆర్థిక కార్యకలాపాలు స్తంభించి, ఉపాధి అవకాశాలు తగ్గుతాయి
హింస, అత్యాచారాలు యుద్ధ కాలంలో పెరిగే ప్రమాదం ఉంది. వైద్య సేవలు దెబ్బతిని, మాత మరణాల రేటు పెరుగుతుంది.

మధ్యతరగతి, చిన్న వ్యాపారవేత్తలు:
ప్రస్తుతం పాశ్చాత్య ఆంక్షల వలన అప్పటికే నలిగిపోతున్న ఇరాన్ మధ్యతరగతి వర్గానికి యుద్ధం అంటే ఆర్థిక వినాశనమే, రియల్ కరెన్సీ విలువ పూర్తిగా పడిపోయి హైపర్ ఇన్ఫ్లేషన్ వస్తుంది. చిన్న వ్యాపారాలు, పరిశ్రమలు మూతపడతాయి. బ్యాంకింగ్ వ్యవస్థ పూర్తిగా కుప్పకూలే ప్రమాదం ఉంది. మధ్యతరగతి వర్గం పేదరికంలోకి కూరుకుపోతుంది.
పేదల పరిస్థితి: ఇరాన్‌లో ఇప్పటికే 30-40శాతం పేదరికంలో జీవిస్తున్న వారికి యుద్ధం జీవన్మరణ సమస్యగా మారుతుంది. ఆహార భద్రత పూర్తిగా దెబ్బతింటుంది. కరువు పరిస్థితులు ఏర్పడతాయి. యుద్ధం వల్ల దెబ్బతిన్న మౌలిక సదుపాయాల కల్పనకు బడ్జెట్ ఖర్చు చేయాల్సి ఉంటుంది. దీంతో ప్రభుత్వ సబ్సిడీలు, సంక్షేమ పథకాలు నిలిపివేయబడతాయి. శరణార్థి శిబిరాల్లో అమానవీయ పరిస్థితులు ఏర్పడుతాయి.
మధ్యప్రాచ్య దేశాలపై ప్రభావం:
ఇరాక్: ఇరాన్ సరిహద్దులో ఉన్న ఇరాక్ నేరుగా యుద్ధ అలలను అనుభవిస్తుంది. ఇరాన్ అనుకూల మిలీషియాలు ఇరాక్‌లో ఉన్నాయి.
ఇరాక్ నేల తిరిగి యుద్ధభూమిగా మారే ప్రమాదం పొంచి ఉంది. తెలారా నుండి బాగ్దాద్ వరకు అమెరికన్ స్థావరాలపై దాడులు జరుగుతున్నాయి. ఇరాక్ చమురు ఉత్పత్తి దెబ్బతిని దేశ ఆర్థిక వ్యవస్థ చితికిపోతుంది. లక్షలాది శరణార్థులు ఇరాక్‌లోకి వెళ్ళే అవకాశం ఉంది.
సిరియా, లెబనాన్: ఇరాన్ వ్యూహాత్మక భాగస్వాములైన హెజ్బుల్లా, (లెబనాన్), సిరియన్ ప్రభుత్వం నేరుగా ఈ సంఘర్షణలో చేరతాయి. లెబనాన్ మీద ఇజ్రాయిల్ దాడులు చేస్తుంది. పెద్ద ఎత్తున విధ్వంసం సష్టించింది. అధికార గణాంకాల ప్రకారం 630 మంది చనిపోయారు, 7 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. సిరియాలో ఇప్పటికే అస్థిరంగా ఉన్న పరిస్థితి మరింత దిగజారుతుంది. వేల కిలోమీటర్ల సరిహద్దుల్లో హింస విస్తరిస్తుంది.
యెమెన్: ఇరాన్ మద్దతున్న హౌతీ వర్గాలు యెమెన్‌లో శక్తివంతంగా ఉన్నాయి. దాడులు జరుగుతున్నాయి. సౌదీ అరేబియాపై మిసైల్ దాడులు తీవ్రమవుతాయి.
బాబ్-ఎల్-మందేబ్ జలసంధి మూసివేత, భారత్‌కు సరఫరా సమస్యలు ఎదురవుతాయి. ఇప్పటికే హౌతీల అంతర్గత దాడులతో చనిపోతున్న యెమెన్ ప్రజలకు మరింత దుర్భర పరిస్థితులు ఎదురవుతాయి.
సౌదీ అరేబియా, గల్ఫ్ దేశాలు: బాహ్యంగా ఇరాన్ వ్యతిరేకులుగా కనిపించే సౌదీ, యూఏఈ దేశాలు కూడా పెద్ద మూల్యం చెల్లిస్తాయి. చమురు ఉత్పత్తి కేంద్రాలపై మిసైల్ దాడుల ముప్పు మరింత పెరుగుతుంది. గల్ఫ్ ప్రాంతంలో విదేశీ పెట్టుబడులు వెనక్కి తిరిగి వెళ్లిపోతాయి. పర్యాటక, సేవా రంగాలు కుప్పకూలే ప్రమాదం ఉంది. ఇప్పటికే నిర్మాణ రంగంలో పని చేసే కోట్లాది భారత, పాకిస్తాన్, బంగ్లాదేశ్ కార్మికులు ఉపాధి కోల్పోతున్నారు. ఈ సమస్య మరింత తీవ్రం కానుంది.

భారతదేశం… బహుముఖ ప్రమాదాలు:
భారత్‌కు ఇరాన్‌తో చారిత్రక, ఆర్థిక, వ్యూహాత్మక సంబంధాలు ఉన్నాయి. గత వారసత్వానికి భిన్నంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమెరికాకు, ఇజ్రాయిల్‌కు అనుకూలంగా ఉంది. భారత్‌కు ఈ యుద్ధం తీవ్రమైన సమస్యలు సష్టిస్తోంది. భారత్ తన చమురు అవసరాల్లో 85 శాతం దిగుమతి చేసుకుంటుంది. ఇరాన్ యుద్ధం వలన చమురు ధర బ్యారెల్‌కు 150-200 యూఎస్ డాలర్లకి పెరిగే అవకాశం ఉంది.
ఎల్పీజీ సంక్షోభం: హోర్ముజ్ జలసంధి మూసివేత కారణంగా భారత్‌లో తీవ్రమైన ఎల్పీజీ కొరత ఏర్పడింది. దీని వలన ముంబైలో 20శాతం హోటళ్ళు మూతపడగా, విజయవాడలో 1,500 హోటళ్ళు అనిశ్చితంగా నిలిచిపోయాయి. బ్లాక్ మార్కెట్‌లో సిలిండర్ ధర రూ. 3,000 వరకు పలుకుతోంది. ముంబైలోని ప్రసిద్ధి చెందిన ధోబీ ఘాట్లు గ్యాస్ అందుబాటులో లేక పూర్తిగా మూతపడ్డాయి.
డబుల్ ఇన్ఫ్లేషన్ షాక్: ఈ యుద్ధం వలన కలిగే ఇంధన ధరల పెరుగుదల, వేసవిలో ఎక్కువ కాలం ఉండే తీవ్రమైన ఉష్ణోగ్రతల ప్రభావంతో కలిసి, భారత్‌లో ఆహార ధరలు ఆకాశాన్నంటే ప్రమాదం ఉంది. 2022 (రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ం తీవ్ర వడగాడ్పులు) పరిస్థితి పునరావతం కావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
చాబహార్ పోర్ట్ అనిశ్చితి ఏర్పడుతుంది. భారత్ నిర్మిస్తున్న ఈ రేవు ద్వారా ఆఫ్ఘనిస్తాన్, మధ్య ఆసియాకు చేరే మార్గం మూసుకుపోతుంది.
గల్ఫ్ దేశాల్లో 90 లక్షల మంది భారతీయులు జీవిస్తున్నారు. వారు ప్రాణభయంతో విలవిలలాడుతున్నారు. ఉపాధి కోల్పోయి వెనక్కి వస్తున్నారు. గల్ఫ్ దేశాలకి మన వ్యవసాయ ఎగుమతులు కూడా నిలిచిపోయాయి. విదేశీ చెల్లింపులు ఆగిపోవడం వలన
రూపాయి పతనం అవుతోంది. ద్రవ్యోల్బణం తీవ్రంగా పెరుగుతుంది. ఇంధన సంక్షోభం ఏర్పడి విద్యుత్, రవాణా, వ్యవసాయ రంగాలు దెబ్బతింటాయి.
ఇంత నష్టం జరుగుతున్నా అమెరికా ఇజ్రాయిల్ అక్రమ యుద్ధంపై భారత ప్రభుత్వం నోరు మెదపడం లేదు.
చైనా… ఆర్థిక, వ్యూహాత్మక సంక్షోభం
చైనా ఇరాన్ చమురు అతిపెద్ద కొనుగోలుదారు. రెండు దేశాల మధ్య 400 బిలియన్ యూఎస్ డాలర్ల వ్యూహాత్మక ఒప్పందం ఉంది. చైనా BRI (Belt and
Road Initiative) ద్వారా వెళ్ళే మార్గాలు దెబ్బతింటాయి. ఇరాన్ చమురు కోల్పోవడం వలన చైనా ఆర్థిక వ్యవస్థ మీద తీవ్ర ఒత్తిడి అమెరికాతో శత్రుత్వం మరింత పెరిగి, చైనా సైనిక జోక్యానికి దిగవలసి వస్తే ప్రపంచమే మహాయుద్ధ ప్రమాదంలో పడుతుంది.
రష్యాకు అవకాశం, ప్రమాదం
రష్యా-ఇరాన్ వ్యూహాత్మక భాగస్వామ్యం గురించి అందరికీ తెలుసిందే, చమురు ధరలు పెరగడం రష్యాకు ఆర్థిక ప్రయోజనం కలుగుతుంది. కానీ సంఘర్షణ విస్తరిస్తే రష్యా కూడా ఒత్తిడిలో పడుతుంది.
ఉక్రెయిన్ యుద్ధంతో పాటు మరో ఇరాన్ సమస్య ముందుకు వస్తుంది.
పాకిస్తాన్ కు సరిహద్దు ఒత్తిడి: ఇరాన్‌తో 900 కిలోమీటర్ల సరిహద్దు కలిగిన పాకిస్తాన్‌కు శరణార్థి ప్రవాహాలు పెరిగి ఇప్పటికే ఆహార కొరతతో సతమతం అవుతున్నందున మరింత భారం పడుతుంది. బలూచిస్తాన్‌లో అస్థిరత మరింత పెరుగుతుంది. ఆర్థికంగా అప్పటికే సంక్షోభంలో ఉన్న పాకిస్తాన్‌కు అదనపు భారం.
యూరోపియన్ దేశాలు: చమురు దిగుమతులకు మధ్యప్రాచ్యంపై ఆధారపడిన యూరోప్‌కు ఇంధన సంక్షోభం ఏర్పడింది. ముఖ్యంగా జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీలకు కొత్త శరణార్థి ప్రవాహాలు పెరుగుతాయి. 2015 సంఘటనల కంటే పెద్ద స్థాయిలో ఆర్థిక మాంద్యం, ద్రవ్యోల్బణ ప్రమాదాలు పెరుగుతాయి.
ఇరాన్ అనుకూల ఉగ్రవాద చర్యలు జరిగే అవకాశాలు ఉన్నాయి.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం: ప్రపంచ చమురు సరఫరాలో 20శాతం హోర్ముజ్ జలసంధి నుండే వెళ్తుంది. ఈ జలసంధిని ఇరాన్ మూసివేసింది.
చమురు ధరలు రాతిరికి రాత్రి పెరిగాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ట్రిలియన్ డాలర్ల నష్టం జరుగుతుందని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు.
అన్ని దేశాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతాయి. వ్యవసాయ, ఉత్పాదక, రవాణా రంగాలన్నీ మహాసంక్షోభంలో పడతాయి.
ఆహార భద్రతకు దెబ్బ: ప్రపంచ ఆహార ధరలు ఇప్పటికే అస్థిరంగా ఉన్నాయి. యుద్ధం వల్ల ఎరువుల దిగుమతి ఆగిపోయి వ్యవసాయ ఉత్పత్తి పడిపోతుంది.
రవాణా ఖర్చులు పెరిగి ఆహార ధరలు మరింత అధికమవుతాయి. ఆఫ్రికా, ఆసియా దేశాల్లో కరువు పరిస్థితులు ఏర్పడుతాయి.
ప్రపంచ ఆర్థిక మాంద్యం: 2008 ఆర్థిక సంక్షోభం కంటే తీవ్రమైన మాంద్యం రావడానికి అవకాశాలు ఉన్నాయి.
స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. ప్రపంచ వ్యాపారం తగ్గిపోయి, ఉపాధి అవకాశాలు తగ్గుతాయి. అభివద్ధి చెందుతున్న దేశాలు అప్పుల ఊబిలో కూరుకుపోతాయి.
అణ్వాయుధ ప్రమాదం… ఆందోళనకరం
ఇరాన్ అణు కార్యక్రమాన్ని నాశనం చేయడమే ఈ యుద్ధానికి ముఖ్య కారణాల్లో ఒకటి అని చెప్పబడుతుంది. కానీ ఈ యుద్ధం వలన ఇరాన్ అణ్వాయుధ ప్రయత్నాలను వేగవంతం చేయవచ్చు. ఇరాన్ రహస్య అణు కేంద్రాలు ఉంటే వాటిని ధ్వంసం చేయడం అసాధ్యం.
ఇజ్రాయిల్ తన అణ్వాయుధాలను ఉపయోగించే పరిస్థితి వస్తే, మొత్తం మధ్యప్రాచ్యం నివాసయోగ్యం కాకుండా పోతుంది. అణు రేడియేషన్ వలన కోట్లాది అమాయక ప్రజల మరణిస్తారు. వాతావరణ మార్పులు, ‘న్యూక్లియర్ విండర్’ ప్రమాదం పొంచి ఉంది.
అమెరికా, ఇజ్రాయిల్ ప్రజలపై ప్రభావం
అమెరికా: యుద్ధం మొదలుపెట్టిన అమెరికా కూడా తీవ్రమైన మూల్యం చెల్లిస్తోంది. అమెరికన్ స్థావరాలు, నౌకలు దాడికి గురవుతున్నాయి.అమెరికా సైనికుల ప్రాణాల నష్టం జరుగుతుంది. దేశీయంగా ఆర్థిక ఒత్తిడి, ఇంధన ధరలు పెరగడం వలన సంక్షోభ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అమెరికా ముస్లిం వ్యతిరేక హింస పెరిగే అవకాశం ఉంది. ట్రిలియన్ డాలర్ల యుద్ధ వ్యయం సంక్షేమ పథకాలకు నిధుల కోత విధించేలా చేస్తుంది. దేశీయంగా మరింత విభజన, రాజకీయ అస్థిరత ఏర్పడుతుంది.
ఇజ్రాయిల్: ఇజ్రాయిల్ ఇరాన్‌పై దాడికి తిరుగుదెబ్బ చాలా తీవ్రంగా ఉంది. ఇప్పటికే టెల్ అవీవి పై పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయి. ఉత్తర, దక్షిణ ఇజ్రాయిల్ పై ఇరాన్ తో పాటు హిజ్బుల్లా (లెబనాన్), హమాస్, ఇతర వర్గాల వైపు నుండి మిసైల్ దాడులు జరుగుతున్నాయి. ఇజ్రాయిల్ పౌరులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బంకర్లలో తలదాచుకున్నారు. నగరాలు శ్మశాన ప్రదేశాలుగా మారే అవకాశం ఉంది.
అంతర్జాతీయంగా మిత్రదేశాలు సహకారం తగ్గి ఇజ్రాయిల్ ఒంటరయ్యే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటుంది.
పర్యావరణానికి, మానవ హక్కులకు భంగం
యుద్ధాలు పర్యావరణాన్ని శాశ్వతంగా నాశనం చేస్తాయి. చమురు సంస్థలు, రిఫైనరీలు దాడికి గురైతే పర్షియన్ గల్ఫ్‌లో పర్యావరణ విపత్తు, అణు శక్తి కేంద్రాలు ధ్వంసమైతే రేడియోధార్మిక కాలుష్యం ఏర్పడుతుంది. ఆసుపత్రులు, పాఠశాలలు ధ్వంసమవుతున్నాయి. అంతర్జాతీయ చట్టాలు ఉల్లంఘించి సాగుతున్నాయి. వేలాది సంవత్సరాల ప్రాచీన పర్షియన్ చారిత్రక వారసత్వ సంపద నాశనం అవుతుంది. జంతు జాతులు, పర్యావరణ వ్యవస్థలు శాశ్వతంగా దెబ్బతిన్నాయి.
దీర్ఘకాలిక రాజకీయ, భౌగోళిక పరిణామాలు
యుద్ధం తాత్కాలికంగా ముగిసినా దీర్ఘకాలిక పరిణామాలు దశాబ్దాల పాటు కొనసాగుతాయి. ఇరాన్‌లో తీవ్రవాద వర్గాలు మరింత బలపడతాయి. ISIS వంటి సంస్థలు పునర్జన్మ పొందుతాయి.
ప్రాంతీయ అస్థిరత పెరిగి మరిన్ని యుద్ధాలకు దారితీస్తుంది.
ప్రపంచ వ్యాపారంలో డాలర్ ఆధిపత్యం సవాలుకు గురవుతుంది. ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ సంస్థల విశ్వసనీయత మరింత దిగజారిపోయింది.
శాంతి మార్గమే పరిష్కారం
ఇరాన్‌పై యుద్ధం ఎవరికీ నిజమైన గెలుపును తీసుకు రాదు. సైనికంగా బలహీనమైన ఇరాన్‌ను ఓడించవచ్చు. కానీ ఆ ‘విజయం’ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను తలకిందులు చేసి, కోట్లాది అమాయక ప్రజల జీవితాలను తుడిచిపెట్టి, ఒక తరానికి శాంతి లేకుండా చేసిన మూల్యంతో వస్తుంది. ఇరాన్ ఒక వైపు తీవ్రంగా దెబ్బతింటూనే, మరోవైపు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను లక్ష్యంగా చేసుకుని యుద్ధం (war of attrition) చేస్తోంది. ఇరాన్ వ్యూహం ప్రకారం, తాము పూర్తిగా ఓడిపోయినా, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను తమతోపాటు లాగేసుకుపోవడమే లక్ష్యంగా పనిచేస్తోంది. ఈ పరిణామాలు ఒక ప్రాంతానికే పరిమితం కాక, మొత్తం ప్రపంచాన్ని దహించే సామర్థ్యం కలిగి ఉన్నాయి. ఇరాన్‌పై యుద్ధంతో అమెరికా ఇజ్రాయిల్ దేశాలు ఏ సమస్యలను పరిష్కరించలేవు, పైగా కొత్త సమస్యలు సష్టిస్తాయి.
గత చరిత్ర, తాజా పరిణామాలు కూడా ఇదే సత్యాన్ని నొక్కి చెబుతున్నాయి. ఇరాక్ యుద్ధం (2003), అఫ్ఘనిస్తాన్ యుద్ధం (2001) ఇవి ఏ సమస్యనూ పరిష్కరించలేదు. బదులుగా ISIS అల్ ఖైదా లాంటి ప్రమాదకర శక్తులకు జన్మనిచ్చాయి. నిజమైన భద్రత చర్చల ద్వారా, దౌత్యం ద్వారా, పరస్పర గౌరవం, సహకారం ద్వారా వస్తుంది. యుద్ధాల ద్వారా కాదు. భవిష్యత్తు తరాలకు శాంతియుత ప్రపంచాన్ని అందించాలంటే ఆయుధాలు పక్కన పెట్టాలి. మాట్లాడడం మొదలుపెట్టాలి. శాంతికి బాటలు వేయాలి. భారతదేశం విదేశాంగ విధానంలో అమెరికాకి జూనియర్ భాగస్వామిగా కాకుండా స్వతంత్ర అలీన విధానాన్ని అనుసరించాలి. ప్రపంచశాంతికి చొరవ చూపే విధంగా కషి చేయాలి. ఎవరో ఒకరు శాంతి కోసం ముందడుగు వేయాలి. అది మనమే ఎందుకు కాకూడదు.
”యుద్ధం ప్రారంభించడం సులభం – ముగించడమే చాలా కష్టం”
ఎం.డి అబ్బాస్
9030098032



