ఆ కాపీలను వెంటనే జప్తు చేయాలి
ఎన్‌సీఈఆర్టీ వివాదంలో కేంద్రంపై సీజేఐ ఫైర్
మోడీ సర్కార్ యూటర్న్
న్యూఢిల్లీ : ఎనిమిదో తరగతి సాంఘిక శాస్త్ర పాఠ్యపుస్తకాన్ని వెనక్కి తీసుకోవాలంటూ ఎన్సీఈఆర్టీకి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. తక్షణ నిషేధం మొదలు పుస్తక ప్రతులను స్వాధీనం చేసుకోవడం వరకూ అత్యున్నత న్యాయస్థానం ఐదు రకాలైన ఆదేశాలు ఇచ్చింది. వివాదాస్పద ఛాప్టర్‌ను రాసిన రచయితల పేర్లు, సమావేశపు మినిట్స్‌ను కూడా కోరింది. ఈ సందర్భంగా ఎన్సీఈఆర్టీకి, రాష్ట్రాల విద్యా శాఖలకు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ కఠినమైన చర్యలు సూచించారు. వాటిని అమలు చేయాలని ఆదేశించారు. ఎనిమిదో తరగతి సోషల్ సైన్స్ పుస్తకానికి చెందిన ప్రతి కాపీని…అది హార్డ్ కాపీ అయినా లేక డిజిటల్ రూపం లో ఉన్నా…తక్షణమే ఉపసంహరించుకోవాలని ఎన్సీఈఆర్టీని సుప్రీంకోర్టు ఆదేశించింది.
ఇందుకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేసుకోవాలని సూచించింది. పుస్తకాల షాపులు, పాఠశాలలు, ఆన్‌లైన్ వేదికల నుంచి పుస్తక ప్రతులను తీసుకోవాలని, ఈ విషయంలో జాప్యం తగదని స్పష్టం చేసింది. పాఠశాలలకు ఇప్పటికే పంపిన పుస్తకాలను వెంటనే స్వాధీనం చేసుకోవాల్సిన బాధ్యత ఎన్సీఈఆర్టీ డైరెక్టర్ దినేష్ ప్రసాద్ సక్లానీకి అప్పగించింది. ఆదేశాల అమలుకు సంబంధించిన నివేదికను కోర్టు ముందు ఉంచాలని చెప్పింది. రాష్ట్రాలలో విద్యా శాఖ ముఖ్య కార్యదర్శులు కూడా ఆదేశాలను అమలు చేసి, నివేదికలను కోర్టుకు సమర్పించాలని తెలిపింది.
ఒకవేళ పాఠ్యపుస్తకం ఎక్కడైనా అందుబాటులో ఉన్నప్పటికీ ఉపాధ్యాయులు దానిని తరగతి గదిలో బోధనకు ఉపయోగించకూడదు. అంటే దీనర్థం పుస్తకంలోని విషయం పరోక్షంగా ప్రచారంలోకి రాకూడదు.
పాఠ్య పుస్తకం ముద్రణ, సరఫరాలపై న్యాయస్థానం నిషేధం విధించింది. పుస్తకాన్ని భౌతికంగా లేదా డిజిటల్ రూపంలో పంపిణీ చేసేందుకు ప్రయత్నిస్తే దానిని కోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగానే ఉల్లంఘించినట్లు పరిగణిస్తారు. ఈ ఉల్లంఘన చట్టపరమైన తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది. ఛాప్టర్‌ను రూపొందించడంలో భాగస్వాములైన నేషనల్ సిలబీ బోర్డు సభ్యుల పేర్లు, వారి గుర్తింపు పత్రాలను సమర్పించాలని ఎన్సీఈఆర్టీ డైరెక్టర్‌ను కోర్టు ఆదేశించింది. ఛాప్టర్‌పై చర్చించి, దానిని ఖరారు చేసిన సమావేశపు ఒరిజినల్ మినిట్స్‌ను తదుపరి విచారణలో సమర్పించాలని సూచించింది. అవమానకరమైన ఛాప్టర్‌కు బాధ్యులైన వారిపై వివిధ చట్టాలను ప్రయోగించనందుకు ఎందుకు చర్య తీసుకోకూడదో తెలియజేయాలంటూ పాఠశాల విద్యా శాఖ కార్యదర్శికి, ఎన్సీఈఆర్టీ డైరెక్టరుకు సుప్రీంకోర్టు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
కేంద్రం యూటర్న్
ఎన్‌సీఈఆర్టీ 8వ తరగతి పుస్తకాల్లో న్యాయవ్యవస్థపై మోడీ ప్రభుత్వం అవినీతి ముద్ర వేసే ప్రయత్నం చేసింది .సుప్రీంకోర్టు సీరియస్ కావటంతో కేంద్రం యూటర్న్ తీసుకున్నది. పిల్లలకు ఇలాంటివి బోధిస్తారా..? అంటూ ప్రధాని మోడీ స్పందించినట్టు లీకులు వస్తున్నాయి. మరోవైపు కేంద్ర విద్యాశాఖమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మీడియా ముందుకు వచ్చి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జాతీయ విద్యావిధానం మార్పులో భాగంగా ఎంతకైనా తెగబడటానికి కేంద్రంలోని బీజేపీ సర్కార్ చేస్తున్న ప్రయత్నాలకు న్యాయవ్యవస్థ అంశం కాస్త వెనక్కి తగ్గేలా చేసిందని విద్యారంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.



