– సీజేఐ జస్టిస్ గవాయ్
న్యూఢిల్లీ: భారత రాజ్యాంగమే సర్వోన్నతమైందని, మూలస్తంభాలుగా ఉన్న వ్యవస్థలన్నీ కలిసి పనిచేయాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ తెలిపారు. మహారాష్ట్ర, గోవా బార్ కౌన్సిల్ ఏర్పాటుచేసిన సత్కార కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగం ఏకైక సర్వోన్నత శక్తి అని, న్యాయవ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, చట్టసభలు సమన్వయంతో రాజ్యాంగం ప్రకారమే పనిచేయాలని స్పష్టం చేశారు. దేశ ప్రాథమిక నిర్మాణం బలంగా ఉందని, రాజ్యాంగంలోని మూడు స్తంభాలు సమాన ప్రాధాన్యత కలిగి ఉండాలని, ఒకదాని పట్ల ఒకటి తగిన గౌరవాన్ని చూపాలని చెప్పారు. దేశం ఆర్థికంగా, సామాజికంగానే కాకుండా సాంస్కృతికంగానూ బలపడుతోందని, ఈ పురోగతిని కొనసాగించాలని అన్నారు. రాజ్యాంగంలోని అన్ని అంగాలు ఒకదానికి ఒకటి సహకరించుకోవడమే ప్రజాస్వామ్య సారాంశమని, ఇది భారత సమాఖ్యకు ప్రాథమిక ఆధారమని చెప్పారు. కోర్టు గౌరవాన్ని ఎవరైనా దెబ్బతీస్తే రాజీపడేది లేదని చెప్పారు. ఈ కార్యక్రమంలో జస్టిస్ గవారు వెలువరించిన 50 ముఖ్యమైన తీర్పులను వివరించే పుస్తకాన్ని విడుదల చేశారు.
సంప్రదాయానికి స్వస్తి వెకేషన్ బెంచ్‌కి సీజేఐ అధ్యక్షత
సీనియర్ న్యాయమూర్తులు సహా భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) వేసవి సెలవుల సమయంలో విచారణలు జరపరాదన్న సంప్రదాయానికి స్వస్తి పలికారు. దీనిపై సుప్రీంకోర్టు తాజాగా ఓ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 26 నుండి జూలై 13 వరకూ సుప్రీంకోర్టుకు వేసవి సెలవులు. 26 నుంచి జూన్ 1వ తేదీ వరకూ న్యాయస్థానంలో విచారణకు హాజరు కావాలని సీజేఐ కూడా నిర్ణయించారు. వేసవి సెలవులను ‘పాక్షిక కోర్టు పని దినాలు’గా సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ సమయంలో రెండు నుంచి ఐదు వెకేషన్ బెంచ్‌లు పనిచేస్తాయని తెలిపింది. గతంలో వేసవి సెలవులలో రెండు వెకేషన్ బెంచ్‌లు మాత్రమే ఉండేవి. వీటిలో సీనియర్ న్యాయమూర్తులు ఉండే వారు కాదు. సీజేఐ గవారు 26 బెంచ్‌లను నామినేట్ చేశారు. ఇవి వేసవి సెలవులలో వేర్వేరు తేదీలలో పనిచేస్తాయి. సెలవుల సమయంలో సుప్రీంకోర్టు రిజిస్ట్రీ తెరిచే ఉంటుంది.
ప్రజలకు దూరం కావద్దు
సామాజిక వాస్తవాలను అర్థం చేసుకొని, స్పందించడంలో న్యాయమూర్తుల పాత్ర కీలకమని సీజేఐ జస్టిస్ బీఆర్ గవారు చెప్పారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ మానవ అనుభవాల విషయంలో క్షేత్ర స్థాయి వాస్తవికతలను, సంక్లిష్టతలను న్యాయమూర్తులు దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు.
రాజ్యాంగమే సర్వోన్నతం
- Advertisement -
- Advertisement -