Thursday, January 8, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంజూరాల నుంచి 'పాలమూరు రంగారెడ్డి' నిర్మాణం హాస్యాస్పదం

జూరాల నుంచి ‘పాలమూరు రంగారెడ్డి’ నిర్మాణం హాస్యాస్పదం

- Advertisement -

అక్కడ నీటి లభ్యతే లేదు.. ఎలా ఎత్తిపోస్తారు?
జూరాల ప్రాజెక్టును సందర్శించిన మాజీ మంత్రులు
నవతెలంగాణ- ఆత్మకూర్‌

నీటి లభ్యత లేని జూరాల నుంచి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును నిర్మిస్తామనడం హాస్యాస్పదమని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. కృష్ణ జలాల కోసం బీఆర్‌ఎస్‌ పోరుబాట కార్యక్రమంలో భాగంగా మంగళవారం వనపర్తి జిల్లా ఆత్మకూర్‌ మండలంలోని జూరాల ప్రాజెక్టును(ఎడమ కాల్వ, కుడి కాల్వను) మాజీ మంత్రులు, బీఆర్‌ఎస్‌ ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, మాజీ ప్రజాప్రతినిధులతో కలిసి సందర్శించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ.. శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌ ద్వారా 50 టీఎంసీల నీటితో రిజర్వాయర్లు నింపడమే కేసీఆర్‌ లక్ష్యంగా పనులు చేపట్టారని తెలిపారు. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జూరాల నుంచి చేపట్టాలని కాంగ్రెస్‌ కొత్త వాదన తెర మీదకు తీసుకొచ్చిందని అన్నారు. కాంగ్రెస్‌ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏనాడూ ఈ అంశంపై పోరాడలేదని అన్నారు. కృష్ణా నీళ్లను గ్రావిటీ ద్వారా వాడుకునే వీలు లేకుండా ఉమ్మడి ఏపీలో అప్పటి పాలకులు ప్రాజెక్టులు కట్టారన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు ఇరిగేషన్‌కు వాడుకోవడానికి వీలు లేదన్నారు. జూరాలకు వరద వచ్చేది సగటు 25 నుంచి 30 రోజులే అన్నారు. జూరాల మీద పెట్టిన పంపులు ఎన్ని రోజులు నడుస్తున్నాయో లెక్క చెప్పాలని ప్రశ్నించారు. 145 మెగావాట్‌ల పవర్‌ ఉన్న మోటర్లు 10 నడిపించి జూరాల నుంచి 90 టీఎంసీలు ఎత్తిపోయటం అసాధ్యమన్నారు.

మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ.. ఇప్పటికే జూరాల ఎండిపోతుందని, అలాంటిది పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు నీళ్లు ఎట్టా తీసుకెళ్తారని ప్రశ్నించారు. క్రాప్‌ హాలిడే ఇచ్చి జూరాల నుంచి 70 టీఎంసీ నీళ్లు ఎలా తీసుకుపోతారన్నారు. పాలమూరు ప్రాజెక్టు పూర్తి చేసి నీళ్లు ఇవ్వాలన్నారు.
మాజీ మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. జూరాల ప్రాజెక్టులో నీటి నిలువ తక్కువగా ఉంటుందన్నారు. 70 టీఎంసీల నీళ్లు జూరాల నుంచి ఎలా తీసుకెళ్తారు..? దీనిపై వాస్తవాలను ప్రజలకు తెలియజేయడానికే ప్రాజెక్టును సందర్శించినట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే విజయుడు, ఎమ్మెల్సీ నవీన్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చిట్టెం రాంమోహన్‌ రెడ్డి, మర్రి జనార్ధన్‌రెడ్డి, రాజేందర్‌ రెడ్డి, పట్నం నరేందర్‌ రెడ్డి, ఆల వెంకటేశ్వర రెడ్డి, అంజన్న యాదవ్‌, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్‌, జిల్లా మీడియా కన్వీనర్‌ నందిమల్ల అశోక్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -