హన్మకొండ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఏసీబీ మెరుపు దాడులు
ఏజెంట్ల నుంచి రూ.45,500 నగదు స్వాధీనం
నవతెలంగాణ-కాజీపేట
హనుమకొండ జిల్లాలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వేదికగా సాగుతున్న అక్రమాలకు ఏసీబీ అధికారులు చెక్ పెట్టారు. సాధారణ పౌరులు నేరుగా అధికారుల వద్దకు వెళ్తే పనులు చేయడం లేదని, ఏజెంట్ల ద్వారా వస్తేనే ఫైళ్లు కదులుతున్నాయని ఏసీబీకి ఫిర్యాదులు వచ్చాయి. ఈ నేపథ్యంలో గురువారం మధ్యాహ్నం వరంగల్ రేంజ్ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య ఆధ్వర్యంలో జాయింట్ సబ్ రిజిస్ట్రార్, జిల్లా రిజిస్ట్రార్, జిల్లా చిట్స్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏకకాలంలో తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. జాయింట్ సబ్ రిజిస్ట్రార్ 1, 2 కార్యాలయాల్లో సుమారు 20 మంది అనధికార డాక్యుమెంట్ రైటర్లు తిష్టవేసి ఉండటాన్ని అధికారులు గుర్తించారు.
వారి వద్ద నుంచి 70కి పైగా కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. సబ్ రిజిస్ట్రార్-2 ఆనంద్ గత నాలుగు నెలలుగా రిజిస్ట్రేషన్ పూర్తయిన 204 డాక్యుమెంట్లను బాధితులకు ఇవ్వకుండా తన వద్దే అట్టిపెట్టుకున్నట్టు ఏసీబీ గుర్తించింది. డబ్బులు ఇచ్చిన వారికి మాత్రమే వీటిని విడుదల చేస్తున్నారని, సామాన్యులను ఇబ్బంది పెడుతున్నారని ఫిర్యాదులు అందాయి. సబ్ రిజిస్ట్రార్-1 రామ్ నర్సింగరావు, సబ్‌రిజిస్ట్రార్-2 ఆనంద్.. ఏజెంట్లకు ఫోన్ మెసేజ్‌ల ద్వారా డబ్బులు పంపాలని సూచనలు చేసినట్టు అధికారుల విచారణలో తేలింది. ఏజెంట్ల ఫోన్లను తనిఖీ చేయగా ఈ అక్రమ లావా దేవీల చిట్టా బయటపడింది. ప్రాథమిక సోదాల్లో భాగంగా ఏజెంట్ల వద్ద నుంచి రూ. 45,500 నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఖాళీగా చిట్స్ రిజిస్ట్రార్ కార్యాలయం.. కానీ రిజిస్టర్‌లో సంతకాలు!
జిల్లా చిట్స్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన అధికారులకు వింత పరిస్థితి ఎదురైంది. కార్యాలయంలో ఒక్క ఉద్యోగి కూడా లేకపోగా, అటెండెన్స్ రిజిస్టర్‌లో మాత్రం అందరూ సంతకాలు పెట్టి ఉండటం గమనార్హం. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన ఈ అంశాన్ని కూడా సీరియస్‌గా తీసుకున్న ఏసీబీ, దీనిపై ప్రత్యేక రిపోర్టు సిద్ధం చేస్తోంది. సబ్ రిజిస్టర్లు-1,2లో సంవత్సర కాలంలో రూ.42లక్షలు డాక్యుమెంటు రైటర్ల నుంచి తీసుకున్నట్టు గుర్తించారు.
ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ సాంబయ్య మాట్లాడుతూ.. వాట్సప్ చాట్ ద్వారా ఈ లావాదేవీల వ్యవహారం బట్టబయలు అయిందని తెలిపారు. అనధికారిక డాక్యుమెంట్ రైటర్లు ఇచ్చిన వాటినే సబ్ రిజిస్టార్లు రిజిస్ట్రేషన్ చేశారని, సబ్ రిజిస్టర్లు జమాల్పూర్ రామ్ నర్సింహారావు, దేవులూరి ఆనంద్ ఆస్తులపైనా కూడా ఏసీబీ సోదాలు నిర్వహించామని చెప్పారు. ఇద్దరి ఇండ్లలో లక్షల కొద్ది నగదుతోపాటు భారీగా ఆస్తిపత్రాలు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ఇంటిలో రిజిస్ట్రేషన్ చేయని 254 పాత్రలను సైతం స్వాధీన పరుచుకుని మొత్తం నివేదిక రూపొందించి ప్రభుత్వానికి పంపిస్తామని అన్నారు. అనంతరం చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.



